Saturday, May 18, 2024

రష్యా-ఉక్రెయిన్‌ దాడుల్లో కర్నాటక స్టూడెంట్ మృతి.. గవర్నర్‌ హౌస్‌ వెనుకే ఫ్లాట్‌

ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థులు ఆకలికి అలమటిస్తూ.. నీళ్లు లేక గొంతెండిపోతూ.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంకర్స్‌లో తలదాచుకున్న వారికి ఎవరూ సాయం చేసేవారు లేరు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బంకర్‌ నుంచి కాలు బయట పెట్టాల్సిన పరిస్థితి. అదే ఆకలి.. ఓ భారతీయ విద్యార్థిని బలిగొంది. రష్యన్‌ ఆర్మీ షెల్‌కు కర్నాటక వాసి ప్రాణాలు కోల్పోయాడు. అతన్ని.. 21 ఏళ్ల నవీన్‌ శేఖరప్పగా గుర్తించారు. ఉక్రెయిన్‌ గవర్నర్‌ కార్యాలయానికి సమీపంలోని ఓ ఫ్లాట్‌లో నవీన్‌ ఉంటున్నాడు. మిగిలిన విద్యార్థులందరూ.. ఫ్లాట్‌కు సమీపంలోని ఓ బంకర్‌లో తలదాచుకుంటున్నారు. ఫ్లాట్‌లో ఉండిపోయిన నవీన్‌కు ఆకలి వేయడంతో.. వండుకునేందుకు ఏమీ లేవు. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. బంకర్‌లో ఉన్నవారికి మాత్రం కొంత మంది సాయం చేస్తున్నారు. కానీ నవీన్‌ ఫ్లాట్‌లోనే ఉండిపోయాడు.

ఫ్లాట్‌లోనే ఉండిపోయిన నవీన్‌

భారత్‌ విద్యార్థి కో-ఆర్డినేటర్‌ పూజ ప్రహరాజ్‌ మాట్లాడుతూ.. సరుకులు తీసుకుందామని ఫ్లాట్‌ నుంచి నవీన్‌ బయటికి వచ్చాడు. గవర్నర్‌ హౌస్‌కు వెనుకే నవీన్‌ ఫ్లాట్‌ ఉంది. గవర్నర్‌ కార్యాలయానికి సమీపంలోని ఓ గ్రాసరీ స్టోర్‌కు చేరుకున్నాడు. అక్కడే ఉన్న ఓ షాపునకు వెళ్లి.. ఇండియన్‌ కరెన్సీని.. ఉక్రెయిన్‌ కరెన్సీగా మార్చుకున్నాడు. డబ్బులు చేతిలో పడ్డాయి.. ఇక భోజనం, నీళ్లు తీసుకొని ఫ్లాట్‌లోకి వెళ్లిపోదామని అనుకున్నాడు. గ్రాసరీ స్టోర్‌ బయట క్యూ ఉంది. రెండు గంటల పాటు లైన్‌లో నిల్చున్నాడు.. అదే సమయంలో.. రష్యన్‌ ఆర్మీ.. గవర్నర్‌ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని షెల్‌ ప్రయోగించింది… అయితే అది కాస్తా.. గురితప్పి గ్రాసరీ స్టోర్‌ సమీపంలో పడింది. దీంతో నవీన్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

భోజనం, నీళ్ల కోసం బయటికొచ్చి..

నవీన్‌ మృతిని భారతీయ విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.. ఉదయమే.. నవీన్‌ తన తండ్రికి ఫోన్‌ చేసి మాట్లాడాడు. తాము గవర్నర్‌ కార్యాలయానికి సమీపంలోని బంకర్‌లో తలదాచుకున్నామని, భోజనం లేదని, తాగడానికి నీళ్లు కూడా లేవని తెలిపాడు. ఈ విషయాన్ని నవీన్‌ తండ్రి స్థానిక అధికారులకు వివరిస్తూ బోరున విలపించాడు. ఖార్కివ్‌లో ఈ ఘటన జరిగింది. దాడి జరిగిన సమయంలోనే.. ఖార్కివ్‌లోని భారత్‌ విద్యార్థి కో-ఆర్డినేటర్‌ పూజ ప్రహరాజ్‌.. నవీన్‌కు ఫోన్‌ చేశాడు. అయితే నవీన్‌ స్పందించలేదు. అప్పటికే బాంబు దాడిలో కన్నుమూశాడు. స్థానిక ఉక్రెయిన్‌ మహిళ ఫోన్‌ లిఫ్ట్‌ చేసి.. నవీన్‌ చనిపోయాడని, మృతదేహాన్ని మార్చురీకి తరలిస్తున్నట్టు చెప్పినట్టు పూజ ప్రహరాజ్‌ మీడియాకు వివరించాడు. ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌ను లక్ష్యంగా చేసుకుని రష్యా బలగాలు భారీ దాడులకు దిగుతున్నాయి.

- Advertisement -

ఉదయమే చూశాం.. అంతలోనే..

నవీన్‌ శేఖరప్ప, కర్నాటకలోని హవేరి జిల్లాకు వ్యక్తిగా భారత్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఖార్కివ్‌లోని నేషనల్‌ మెడికల్‌ కాలేజీలో మెడిసన్‌ నాల్గో సంవత్సరం చదువుతున్నాడు. ఖార్కివ్‌లోని గవర్నర్‌ కార్యాలయం పక్కనే ఉన్న అపార్టుమెంట్‌లో స్నేహితులో నివాసం ఉంటున్నాడు. గత కొన్ని రోజులుగా రష్యన్‌ ఆర్మీ దాడులు చేస్తుండటంతో.. తోటి రూంమేట్స్‌ పక్కనే ఉన్న బంకర్‌లోకి వెళ్లి తలదాచుకున్నట్టు తెలుస్తోంది. నవీన్‌ను ఉదయం 8.30 గంటలకు చూసినట్టు గోపాల కృష్ణన్‌ అనే విద్యార్థి తెలిపాడు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ ష్రింగ్లా.. రష్యా, ఉక్రెయిన్‌ రాయబారులతో మాట్లాడారు. సురక్షితంగా భారతీయ విద్యార్థులను ఉక్రెయిన్‌ సరిహద్దుకు తరలించేందుకు సహాయపడాలని కోరారు. ఖార్కివ్‌తో పాటు కీవ్‌లోని భారతీయ విద్యార్థుల రక్షణ బాధ్యత ఇరు దేశాలదే అని స్పష్టం చేశారు.

త్వరలో భారత్‌కు మృతదేహం..

ఉక్రెయిన్‌-రష్యా దాడుల్లో కర్నాటక వాసి నవీన్‌ మృతి చెందినట్టు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్‌ బాగ్చీ వెల్లడించారు. మృతుడి కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. విషయాన్ని మృతుడి కుటుంబానికి తెలియజేశామన్నారు. నేషనల్‌ మెడికల్‌ వర్సిటీలో నాల్గో సంవత్సరం చదువుతున్నట్టు తెలిపారు. ఖార్కివ్‌ సహా ఇతర నగరాల్లోని భారతీయుల రక్షణకు చర్యలు చేపట్టాలని రెండు దేశాలతో మాట్లాడినట్టు బాగ్చీ వివరించారు. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌, ఆ నగర పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వెంటనే ఖాళీ చేయాలని సూచించారు. రైళ్లు, బస్సుల ద్వారా.. ఉక్రెయిన్‌ సరిహద్దుకు చేరుకోవాలని కోరారు.

కుటుంబం కన్నీరుమున్నీరు..

నవీన్‌ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ ఘటన తెలియగానే.. భారీ సంఖ్యలో గ్రామస్తులు.. నవీన్‌ ఇంటి వద్దకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు. సీఎం బసవరాజ్‌ కూడా నవీన్‌ తండ్రితో ఫోన్‌లో మాట్లాడారు. నవీన్‌ మృతి వార్త తెలియగానే.. ఇంకా ఉక్రెయిన్‌లోనే ఉండిపోయిన భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ వారిని వెంటనే స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

అండగా ఉంటాం : ప్రధాని మోడీ..

ప్రధాని నరేంద్ర మోడీ కూడా.. నవీన్‌ శేఖరప్ప కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుటుంబానికి అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. మృతదేహాన్ని వెంటనే స్వదేశానికి తీసుకొచ్చేందుకు అధికారులను ఆదేశించినట్టు వివరించారు. ఉక్రెయిన్‌లో ఉండిపోయిన ప్రతీ విద్యార్థిని భారత్‌కు సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యత తమదు అంటూ చెప్పుకొచ్చారు.

అన్ని విధాలుగా అండగా ఉంటాం.. – కర్నాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై..

నవీన్‌ మృతిపై కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విద్యార్థి కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. నవీన్‌ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వివరించారు. నవీన్‌ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రకటించారు. నవీన్‌ కుటుంబానికి దేవుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా అతని కుటుంబ సభ్యులు, స్నేహితులకు సీఎం బసవరాజ్‌ బొమ్మై సంతాపం తెలియజేశారు. తనకు నవీన్‌ కుటుంబం బాగా తెలుసు అని, చాలా దగ్గరి వాళ్లే అని ప్రకటించారు. ప్రధాని మోడీ కూడా ఫోన్‌లో మాట్లాడినట్టు వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement