Thursday, May 2, 2024

నేటితో క‌ర్నాట‌క ప్ర‌చారానికి తెర – మూడు ముక్క‌లాట‌లో గెలుపెవ‌రిది?

బెంగళూరు: కర్నాటక అసెంబ్లికి మే 10న జరిగే ఎన్నికల కోసం ప్రధాన రాజకీయ పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌) చేస్తున్న వాడి వేడి తారాస్థాయి ప్రచారం నేటితో ముగియనుంది. మూడు పార్టీలకు చెందిన కీలక నేతలందరూ గత కొద్ది రోజులుగా ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ప్రత్యామ్నాయ ప్రభుత్వం అధికారంలోకి వస్తున్న 38 సంవత్స రాల ఒరవడిని బద్దలు కొట్టడానికి అధికారంలో ఉన్న బీజేపీ అహ రహం పాటుపడుతున్నది. దక్షిణాదిన అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రంలో అధికారాన్ని తిరిగి పొందడానికి తీవ్రంగా శ్రమిస్తున్నది.

మరోవైపు బీజేపీ నుంచి అధికార పగ్గాలు చేజిక్కించు కోవడానికి కాంగ్రెస్‌ పార్టీ కష్టించి పనిచేస్తున్నది. అధికారంలోకి వచ్చిన పక్షంలో 2024లో లోక్‌సభకు జరిగే ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం పాత్రను పోషించడానికి ఉవ్విళ్లూరుతున్నది.
మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ నేతృత్వంలోని జేడీ(ఎస్‌) పార్టీ ఎన్నికల ప్రచారంలో తన శక్తియుక్తులను ప్రదర్శిస్తున్నది. ఎన్నికల తర్వాత ‘కింగ్‌మేకర్‌’ కు బదులుగా ‘కింగ్‌’ గా అవతరించాలని ఆరాటపడుతున్నది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థానాలను గెలుచుకోగలననే ధీమాలో ఉన్నది.

224 స్థానాల అసెంబ్లికి జరిగే ఎన్నికల ప్రచారంలో అన్ని రాజకీయ పార్టీల నేతలకు ”పూర్తి మెజార్టీతో కూడిన ప్రభుత్వం” అత్యంత అభిమానపాత్రమైన నినాదంగా అవతరించింది. రాష్ట్రంలో ఒక పటిష్టమైన, సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం తమకు అనుకూలంగా ఒక స్పష్టమైన తీర్పును ఇవ్వాలని మూడు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఎవరికి వారే ఓటర్లను కోరుతున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ కేంద్రంగా ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ సాగిస్తోంది. డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం, జాతీయ అంశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు, సాధించిన ఘనతలను ప్రచారాంశాలుగా బీజేపీ చేపట్టింది.
అయితే మొదట్లో స్థానిక అంశాలు ప్రధానంగా స్థానిక నేతలతో ప్రచారాన్ని కాంగ్రెస్‌ పార్టీ చేపట్టింది. కానీ ఆ తర్వాత పార్టీ కీలక నేతలైన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, తదితరులు ప్రచారంలో కీలకమైన పాత్రను పోషించారు.

- Advertisement -

జేడీ(ఎస్‌) పార్టీ సైతం స్థానిక అంశాలు ప్రధానంగా, పార్టీ నేత హెచ్‌డీ కుమారస్వామి ఏకైక ప్రచారకర్తగా ఎన్నికల బరిలోకి దిగింది. ఆ తర్వాత వయోభారం, సంబంధిత రుగ్మతులతో బాధపడుతున్నప్పటికీ పార్టీ వృద్ధ నేత దేవెగౌడ సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఏప్రిల్‌ 29 నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ప్రారం భించిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఇప్పటి వరకు 18కి పైగా భారీ బహిరంగ సభలు, ఆరు రోడ్‌ షోలను నిర్వహించడం ద్వారా ప్రత్య ర్థుల కంటే చురుకుగా ముందుకు సాగుతున్నారు. ”ఈ బారియ నిర్దార, బహుమతద బీజేపీ సర్కార”(ఈసారి నిర్ణయం: బీజేపీ మెజార్టీ ప్రభుత్వం) అనే ఎన్నికల నినాదంతో బీజేపీ అభ్యర్థుల తరఫున రాష్ట్రమంతటా ప్రధాని ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నేత లు చెప్పినదాన్ని బట్టి ప్రచారంలో మోడీ పాల్గొనడంతో పార్టీ శ్రేణు ల్లో నైతిక స్థైర్యం పెరిగింది. పార్టీ పట్ల ఓటర్లలో నమ్మకం కలిగింది. అదంతా ఓట్లుగా మారి ఎన్నికల్లో పార్టీ చరిత్ర సృష్టిస్తుందనే ఆశాభావంతో బీజేపీ ఉంది. కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా సైతం ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటించారు. ఎన్నికల ప్రచారానికి వ్యూహరచన చేశారు. మోడీ, అమిత్‌ షాల కారణంగా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ వెనుకపడిపోయిందని బీజేపీ వర్గాలు తెలిపాయి.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, అసోం సీఎం హేమంత బిశ్వ శర్మ, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ లాంటి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, ఎస్‌ జైశంకర్‌, స్మృతి ఇరానీ, నితిన్‌ గడ్కరీ, తదితరులు పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి రాష్ట్రంలో పలు చోట్లకు పర్యటించారు.

2008, 2018 ఎన్నికలప్పుడు ఏకైక అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పటికీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోలేకపోయిన కారణంగా సొంత బలంతో ప్రభుత్వా న్ని ఏర్పాటు చేయడంలో అనేక ఇబ్బందులను చవిచూసిన బీజేపీ.. కనీసం 150 స్థానాల్లో విజయాన్ని లక్ష్యంగా విధించుకొని పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆశిస్తోంది. అనాదిగా బలహీనంగా ఉన్న ఓల్డ్‌ మైసూరు ప్రాంతంలో అడుగుపెట్టడానికి దారి చేసుకోవ డంలో కాషాయ పార్టీ విశ్వప్రయత్నాలను చేస్తోంది. బెంగళూరులో 28 స్థానాలను కలుపుకొని ఓల్డ్‌ మైసూరు ప్రాంతంలో మొత్తం 89 స్థానాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో బలం పుంజుకోవడంలో అశక్తత కారణంగా మెజార్టీకి కొద్ది దూరంలో నిలిచినట్టుగా 2008లో 110 స్థానాలను, 2018లో 104 స్థానాలను పార్టీ గెలుచుకుందని బీజేపీ నేతలు తెలిపారు.

కాంగ్రెస్‌ పార్టీ విషయానికి వస్తే బీజేపీ నుంచి అధికారాన్ని కైవసం చేసుకున్న పక్షంలో అది పార్టీ శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని ఇనుమడింపజేస్తుంది. వచ్చే ఎన్నికల్లో తన భవితవ్యానికి బంగారు బాటలు వేస్తుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షంగా అవతరించగలననే ఆశాభావంలో కాంగ్రెస్‌ పార్టీ ఉంది. కర్నాటక ఎన్నికల్లో గెలుపు హిందీ రాష్ట్రాల్లో కీలకమైన మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ అసెంబ్లిdలకు ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో పార్టీ శ్రేణులకు ఎక్కడా లేని ఊపును, ఉత్సాహాన్ని ఇస్తుం దని కాంగ్రెస్‌ పార్టీ తలపోస్తోంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల ప్రచార బరిలోకి ముందుగా రాష్ట్ర నేతలైన సిద్ద రామయ్య, డీకే శివకుమార్‌, ఖర్గేలను దింపింది. తద్వారా పార్టీ అగ్ర నేతలైన రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచారంలోకి దిగడానికి రంగాన్ని సిద్ధం చేసింది.

ఇద్దరు తోబుట్టువులు రాష్ట్రంలో విస్తృతంగా ప్రయాణించా రు. ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రచార యంత్రాంగాన్ని సవాల్‌ చేశారు. అనేక అంశాలపై మరీ ముఖ్యంగా సవాళ్ళు, ప్రతిసవాళ్ళు చేశారు. కర్నాటకలో ఒక ఉత్తమమమైన ప్రత్యామ్నా య ప్రభుత్వాన్ని అందిస్తామని కన్నడిగులకు బాస చేశారు. ప్రచారం చివరి రోజుల్లో వారి మాతృమూర్తి, కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బరిలోకి దిగారు. హుబ్బలిలో శనివారం జరిగిన పార్టీ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. కలబురిగి జిల్లాకు చెందిన కన్నడిగుడు ఖర్గే పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఉండటంతో కాంగ్రెస్‌ పార్టీకి ఈ ఎన్నికల పోరు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పోరుగా మారింది.

జేడీ(ఎస్‌) పార్టీ విషయానికి వస్తే.. ఈ అసెంబ్లి ఎన్నికలు పార్టీ మనుగడకు జరిపే ఒక పోరాటంగా మారుతుందా? లేక ఓటర్లు హంగ్‌ తీర్పును ఇచ్చిన పక్షంలో 2018లో జరిగినట్టగా ఈ ప్రాంతీ య పార్టీ ఒక కింగ్‌ మేకర్‌గా ఆవిర్భవిస్తుందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఈసారి కూడా జరుగుతున్నది. పార్టీ నుంచి వలసలు, అంతర్గత కుమ్ములాటలతో పాటుగా ‘కుటుంబ పార్టీ’ అనే ముద్ర వేసుకున్న దేవెగౌడ కుమారుడు కుమారస్వామి వయోవృద్ధుడైన తన తండ్రిని వెనక సీట్లో కూర్చొబెట్టుకొని ఒంటిచేత్తో పార్టీ ఎన్నికల ప్రచారాన్ని రాష్ట్రమంతటా సాగిస్తున్నారు.

మొదట్లో వయోభారం, వృద్ధాప్యానికి సంబంధిం చిన రుగ్మతలతో ప్రచారాన్ని దూరంగా ఉన్న 89 ఏళ్ళ దౌవగౌడ కొద్ది వారాలుగా జేడీ(ఎస్‌) అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా పార్టీకి పెట్టని కోట లాంటి ఓల్డ్‌ మైసూరు ప్రాంతంలో భావోద్వేగ స్వరంతో ప్రచారం సాగిస్తున్నారు. తమ పార్టీపై కాంగ్రెస్‌, బీజేపీ చేస్తున్న దాడులను తిప్పికొడుతున్నారు.
జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ రెండు కూడా జేడీ(ఎస్‌) పార్టీని ప్రత్యర్థి జాతీయ పార్టీకి ‘బీ టీమ్‌’గా ఆరోపిం చడం విశేషం. హంగ్‌ అసెంబ్లి ఏర్పడిన పక్షంలో ప్రభుత్వ ఏర్పాటులో ఒక కీలకమైన పాత్రను పోషించడానికి కేవలం 35 నుంచి 40 సీట్లు గెలిస్తే చాలనే ఆశాభావంలో జేడీ(ఎస్‌) ఉంది. ఇలా ఎన్ని రకాల విమర్శలు చుట్టుముట్టినప్పటికీ రైతులు, పేదల సంక్షేమంతోపాటుగా ప్రాంతీయ ఆత్మాభిమానం, కన్నడిగుల అస్తిత్వం, తదితర అంశాలపై కుమారస్వామి ఎప్పట్లాగానే ప్రచారం సాగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement