Saturday, April 27, 2024

Big Story: బెల్లం ధర ఢ‌మాల్‌.. ఆన్‌లైన్ ట్రేడింగ్‌తో రైతుల‌కు ఇబ్బందులు

అమరావతి, ఆంధ్రప్రభ : ఒకప్పటి బెల్లంపల్లి.. ఇప్పటి పిలుపు అనకాపల్లి. ఈ పేరంటనే తియ్యని బెల్లం గుర్తొస్తుంది. ఆ తియ్యదనం అలా నోట్లో నీళ్లూరిస్తుంది. విశాఖపట్నం జిల్లాలో ముఖ్యమైన నియోజకవర్గాల్లో ఒకటైన ఈ అనకాపల్లి ఆసియాలో బెల్లం ఎగుమతులకు ఫేమస్‌. కానీ.. అదే బెల్లంపల్లి ఇప్పుడు సంక్షోభం వైపు నడుస్తోంది. బెల్లంపల్లి ఇక చరిత్ర అయిపోయే రోజులు ఎంతదూరంలో లేవంటున్నారు స్థానికులు. బెల్లం 10 కేజీల దిమ్మె రూ. 400 పలికే ధర ప్రస్తుతం రూ. 300 నుండి రూ. 330 వరకూ పలుకుతోందని, ఇది బెల్లం రైతులను నష్టాలవైపునకు నెట్టేస్తున్నదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా చెరకు సాగు తగ్గడం.. దిగుబడి లేకపోవడం.. వేల ఎకరాల్లో, హెక్టార్ల బెల్లం తయారీ తగ్గిపోవడం, వ్యాపారులే నేరుగా తక్కువ ధరలకు కొనుగోలు చేయడం, ఆన్‌లైన్‌ మార్కెట్‌ కారణంగా వ్యాపారులు సిండికేట్‌గా మారడం వంటివి కారణాలుగా రైతులు పేర్కొంటున్నారు. దీంతో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అనకాపల్లి బెల్లం మార్కెట్‌ ప్రస్తుతం కళా విహీనంగా మారింది.

బెల్లం మార్కెట్‌కు వచ్చే బెల్లం దిమ్మల సంఖ్య రోజుకు రోజుకు తగ్గిపొతున్నాయి. అనకాపల్లి బెల్లం మార్కేట్‌ ఏర్పడి దాదాపు 120 సంవత్సరాలు అవుతుంది. అక్కడ రద్దీ ఎక్కువ కావడంతో 2002లో ప్రస్తుతం ఉన్న ప్రాంతానికి మార్చారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ మొత్తం విస్థీర్ణం 32 ఎకరాలు ఉంది. ఈ భూమిని ఎకరాకు రెండు లక్షల చొప్పున చెల్లించి రైతుల వద్ద నుంచి సేకరించారు. నర్సీపట్నం, అనకాపల్లి, మాడుగుల, యలమంచిలి, చోడవరం, పెందుర్తి నియోజకవర్గాల పరిధిలో వేలాది హెక్టార్లలో చెరకు పంటను రైతులు పండిస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకోనే ప్రత్యేకంగా బెల్లం మార్కెట్‌ అనకాపల్లిలో ఏర్పాటు చేశారు. పండించిన పంటను బెల్లంగా మార్చి 13, 15, 18 కేజీల బెల్లం దిమ్మెలుగా మార్చి మార్కెట్‌ కు తీసుకువస్తారు రైతులు. ఇదిలా ఉండగా ఇక్కడి బెల్లాన్ని కలియుగ వైకుంట దైవం అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాల్లో వినియోగించేవారు.

ప్రస్తుతం ఆ ప్రసాదాల తయారీలోనూ ఈ బెల్లం వాడక పోవడంతో రైతులనుండి కొనుగోలు దారులు తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ నుంచి రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పాటుగా అటు తెలంగాణ, ఇటు పశ్చిమ బెంగాల్‌, ఒడిస్సా, ఛత్తీస్‌ ఘడ్‌ రాష్ట్రాలకు ఎగుమతులు అవుతాయి. అందుకనే అనకాపల్లి బెల్లం మార్కెట్‌ను షుగర్‌ బౌల్‌ ఆఫ్‌ ఏపీగా పిలుస్తారు. దేశంలో బెల్లం ఎగుమతులలో రెండో స్థానంలో అనకాపల్లి బెల్లం మార్కెట్‌ ఉండేది. ఇక్కడి బెల్లంకు ఉన్న అవశ్యకతను గుర్తించిన ప్రభుత్వాలు అనకాపల్లి వ్యవసాయ పరిశోధన కేంధ్రంలో ప్రత్యేకంగా చెరకు దాని మీద వచ్చే ఉత్పత్తులను పెంచడానికి ప్రత్యేక పరిశోధనా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. రైతులు మార్కెట్‌కు తీసుకు వచ్చిన బెల్లాన్ని స్పెషల్‌, ప్యూర్‌ వైట్‌, గులాబి, ఛాలు, బ్లాక్‌, చితికిన బెల్లం గా గ్రేడింగ్‌ చేస్తారు.

మొదలైన సీజన్‌

ప్రతి సంవత్సరం నవంబర్‌ నుంచి ఏప్రెల్‌ వరకూ బెల్లం మార్కెట్‌ సీజన్‌ నడుస్తుంటుంది. రైతులు పండించిన చెరకును గానుగల్లో బెల్లంగా మార్చి మార్కెట్లకు తీసుకు రావడం జరిగుతుంది. అయితే అనకాపల్లి మార్కెట్‌లో బెల్లం లావాదేవీలు ఏటేటా తగ్గిపోతున్నాయి. గత కొద్ది సంవత్సరాల నుంచి మార్కెట్‌ చరిత్రలోనే నిరాశను మిగిల్చింది. సాధారణంగా ఏటా రూ.150 కోట్ల వరకూ లావాదేవీలు ఉంటాయి. రూ. వంద కోట్ల మేర మాత్రమే లావాదేవీలు జరిగాయంటే బెల్లం ఉత్పత్తి తగ్గినట్లే. అలాంటిది 2018-19 ఆర్థిక సంవత్సలంలో కేవలం రూ. 91.08 కోట్లకే పరిమితం కావడం మార్కెట్‌ వర్గాలను కలవరపరుస్తోంది. అనకాపల్లి జిల్లాలో చెరకు సాధారణ సాగు విస్తీర్ణం 45వేల హెక్టార్లు కాగా ప్రస్తుతం అది 34వేల హెక్టార్లకు పడిపోయింది. ఒక వైపు రైతులకు గిట్టుబాటు కాకపోవడం, చెరకు పంటకు పసుపు తెగులు వ్యాపించడం సమస్యకు కారణమని రైతులు పేర్కొంటున్నారు. మార్కెట్‌లో తెల్ల బెల్లాన్ని మొదటి రకంగా భావిస్తారు. దీని తయారీలో సల్ఫర్‌ వినియోగం ఉంటోందంటూ ఫుడ్‌ కంట్రోల్‌ అధికారుల దాడులతో రైతులు, వర్తకులు ఇబ్బంది పడుతున్నారు. అలాగని నల్లబెల్లం తయారు చేస్తే ధర పడిపోతోంది. ఈక్రమంలో రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

- Advertisement -

పడిపోతున్న దిగుబడులు

చెరకు వంగడాలను రూపొందించినప్పుడు హెక్టార్‌కు 150 టన్నులు ఉత్పత్తి అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హెక్టార్‌కు కొన్ని ప్రాంతాల్లో 75 టన్నులు, మరికొన్ని చోట్ల 50 టన్నులకు మించడం లేదు. ఇక బెల్లం దిగుబడి కూడా బాగా తగ్గిపోతోంది. అనకాపల్లి మార్కెట్‌కు 2011-2012లో 8.17లక్షల క్వింటాళ్ల బెల్లం వచ్చింది. ఇదే రికార్డు. ఇక వ్యాపార పరంగా 2016-17 సీజన్‌లో అత్యధికంగా రూ.146 కోట్ల వ్యాపారం జరిగింది. గత ఆర్ధిక సంవత్సరంలో కేవలం 16.64 లక్షల దిమ్మలు మాత్రమే అమ్మాకానికి వచ్చాయి. చెరకు సాగు తగ్గడం, పంటకు పసుపు తెగులు సోకడంతో పాటు కారోనా కారణంగా యార్డుకు వచ్చే చెబ్లం దిమ్మలు తగ్గుతున్నాయి. గతంలో సీజన్‌ సమయం ప్రారంభంలో మొదటి మూడు నెలల్లోనే 20 లక్షలకుపైగా బెల్లం దిమ్మలు అమ్మకానికి వచ్చేవి. ఈసారి ఏడాది పొడవునా అమ్మకాలు చేపట్టినా అంత సరకు యార్డుకు రాకపోవడం గమనార్హం. గత ఆర్ధిక సంవత్సరంలో కేవలం 16 లక్షల దిమ్మెలు మాత్రమే రావడంతో రూ. 77.53 కోట్ల వ్యాపారం జరిగింది. గత సీజన్‌తో పోల్చుకుంటే రూ. 1.21 కోట్లు- తక్కువ. గత పుష్కర కాలంలో ఇంత తక్కువ వ్యాపారం జరగడం ఇదే తోలిసారి.

సెస్‌ నుంచి తప్పించుకునేందుకు సిండికేట్‌

ఇటీవల కాలంలో రైతుల వద్దకు నేరుగా వెళ్లి వ్యాపారుకు బెల్లం కొనుక్కుంటున్నారు. దీంతో బెల్లం మార్కేట్‌కు ఎవ్వరూ రావడం లేదు. సాధారణంగా రైతులు బెల్లం మార్కెట్‌కు వచ్చి బెల్లం అమ్మితే వచ్చిన ధరలో రూ. 100కు రూపాయి వంతు మార్కెట్‌ కటిటీకి సెస్‌(సుంకం) రూపంలో వ్యాపారులు కట్టాల్సి ఉంటుంది. ఉదాహరణకు లక్షరూపాయాల వ్యాపారం చెస్తే మార్కెట్‌కు రూ.వెయ్యి సెస్‌ రూపంలో కట్టాల్సి ఉంటుంది. ఆసెస్‌ ద్వారా వచ్చే అదాయం మీదనే మార్కెట్‌ కమిటీ దానిలోని 25 మంది కుటు-ంబాలు అధారపడి జీవిస్తున్నాయి. ఈసెస్‌ నుంచి తప్పించుకోవడానికి వ్యాపార్ధులు నేరుగా రైతుల వద్దకు వెళ్లి బెల్లం కొనుక్కుంటున్నారు. ఇదే సమయంలో బెల్లంకు ప్రత్యామ్నాయంగా వాడుతున్న బెల్లం పౌడర్‌ మహారాష్ట్ర నుంచి ఇటీవల కాలంలో బాగా దిగుమతి అవుతుంది. గత ఏడాది వెయ్యి లారీలకుపైగా దిగుమతి జరిగినట్లు తెలుస్తుంది. పౌడర్‌ రావడం వల్ల స్థానికంగా ఉన్న బెల్లాన్ని ఎవ్వరూ కొనడం లేదు.

ప్రస్తుతం మార్కెట్‌ పరిస్థితి ఇది.

దశాబ్ధాలుగా ఓ వెలుగు వెలిగిన అనాకాపల్లి బెల్లం రైతులు ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. అనకాపల్లిలో ఉన్న వ్యవసాయ పరిశోధన కేంధ్రంలో బెల్లం ఉత్పత్తులపై పరిశోధనలు సాగుతున్నా వాటికి సరైన మార్కెటింగ్‌ సదుపాయాలు లేవు. బయట నుంచి వచ్చే బెల్లం పౌడర్‌కే ఎక్కువ డిమాండ్‌ ఉంటుంది. రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పిస్తే రైతులు ఎక్కువగా మార్కెట్‌కు వచ్చే అకాశం ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో అనకాపల్లి బెల్లానికి జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్నప్పటికీ చంద్రన్న కానుక కోసం అవసరమైన బెల్లాన్ని సరఫరా చేసే టెండర్‌ను గుజరాత్‌ వర్తకులకు అప్పగించారు. ఇక్కడే అసలు సమస్య ప్రారంభం అయింది. కోనుగోలులన్నీ ఆన్‌ లైన్‌ పద్దతిలో జరిగాలని కేంద్ర ప్రభుత్వం అదేశాలు జారీ చేయడంతో అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో కూడా ఆన్‌ లైన్‌ ద్వారా బెల్లం ట్రేడింగ్‌ చెయ్యాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో అటు రైతులు ఇటు వర్తకులు తీవ్ర స్థాయిలో తమ అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు రావడం జరిగింది.

అన్‌లైన్‌ ట్రేడింగ్‌తో ఇబ్బందులు

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ కాబట్టి వ్యాపారులంతా సిండికేట్‌గా మారే అవకాశం ఉంది అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా మన రైతులు పెట్టు-బడి దారుల వద్ద పెట్టుబడులు తీసుకొని దానితో వ్యవసాయం చేస్తారు అనకాపల్లి బెల్లం వ్యాపారుల దగ్గర నుంచి రైతులు పెట్టుబడులకు డబ్బులు తీసుకొని దానిద్వారా వ్యాపారం చేయడం జరుగుతుంది గత కొన్ని దశాబ్దాలుగా రైతులకు వ్యాపారులకు ఒక రకమైన బంధం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన విధానం వల్ల ఇప్పుడు ఆఅవకాశం లేదు. దీంతో గతకొద్దికాలంగా బెల్లం రైతులు మార్కెట్లో వ్యాపారం చేసే వర్తకులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు.

తగ్గిపోతున్న బెల్లం రాక

వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న మార్కెట్‌ కు ఇంత తక్కువ సరకు రావడం ఇదే తోలిసారి 1987-88 సీజన్‌లో 84.63 లక్షల దిమ్మలను విక్రయించారు.1997-98 మధ్య 35.89 లక్షలు, 2007-08లో 37.46 లక్షల దిమ్మెలు, 2017-18లో 22.13 లక్షల దిమ్మెలు, 2018-19లో 22.62 లక్షలు, 2019-20లో 16.85 లక్షల దిమ్మెలు మార్కెట్‌ కు రాగా.., 2020-21 ఆర్ధిక సంవత్సరంలో కేవలం 16.64 లక్షల బెల్లం దిమ్మెలు మాత్రమే అనకాపల్లి మార్కెట్‌ కు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement