Sunday, April 28, 2024

విగ్రహం పెట్టినంత మాత్రాన దళిత జాతిని ఉద్దరించినట్టు కాదు : ఈటల రాజేందర్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడే ఉంటాడని చెప్పి ఉన్న ఒక్క దళిత ఉప ముఖ్యమంత్రి పదవిని తొలగించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శించారు. శుక్రవారం ఆయన న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… భారతరత్న, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ 132వ జయంతిని దేశవ్యాప్తంగా ప్రతి పల్లెలో నిర్వహించుకుంటున్నామని సంతోషం వ్యక్తం చేశారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో అంబేద్కర్ కన్న కలలు పూర్తిస్థాయిలో సాకారం కాలేదని ఆయన వాపోయారు.

దళితులను మాల, మాదిగలుగా విభజించి కేసీఆర్ వంచనకు పాల్పడుతున్నారని రాజేందర్ ఆరోపించారు. అధికారుల్లో కూడా దళిత అధికారులు లేరని తెలిపారు.125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం సంతోషకరమన్నారు. మహనీయుడి విగ్రహాన్ని పెట్టినంత మాత్రాన దళిత జాతిని ఉద్ధరించినట్టు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని తప్పు పట్టి మార్చాలని చెప్పిన వ్యక్తి కేసీఆర్ అని గుర్తు చేశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ ముందు క్షమాపణ చెప్పాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

దళితులకు 50-60 ఏళ్లుగా ఇచ్చిన భూములను గుంజుకున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. 5,800 ఎకరాల దళితుల భూమిని గుంజుకొని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని మండిపడ్డారు. అసైన్డ్ భూములపై దళితులకు సంపూర్ణ హక్కులు కల్పించాలని డిమాండ్ ఆయన డిమాండ్ చేశారు. కీలక విభాగాల్లో కూడా సముచితంగా దళితుల నియామకాలు ఉండాలని రాజేందర్ అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement