Wednesday, May 15, 2024

Delhi | సహకరించకపోయినా ప‌రవాలేదు.. మా అభివృద్ధిని అడ్డుకోకండి: మంత్రి కేటీఆర్‌

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: సహాయం చేయకపోయినా ఫర్వాలేదు.. కనీసం తెలంగాణ అభివృద్ధికి ఆటంకం కలిగించవద్దని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఢిల్లీ వచ్చిన ఆయన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. కంటోన్మెంట్‌లో రోడ్ల అభివృద్ధి, స్కైవేల నిర్మాణం తదితర అంశాలపై చర్చించి కేటీఆర్ ఆయనకు విమతిపత్రం సమర్పించారు. రక్షణ మంత్రితో సమావేశం అనంతరం ఆయన ఎంపీలు రంజిత్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథంతో కలిసి తుగ్లక్ రోడ్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ… రాష్ట్ర అభివృద్ధిని ప్రపంచానికి చాటేలా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని, ‘అమరులకు అసలైన నివాళి అభివృద్ధి’ అన్న నినాదంతో సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు ప్రారంభించారని చెప్పారు. కోచ్ ఫ్యాక్టరీకి భూమి పూజ, ఆసియాలో అతిపెద్ద హౌసింగ్ వంటివి అందులో ఉన్నాయని అన్నారు. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెబుతోందని అన్నారు. జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్రానికి మరింత చేయూతనివ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ ఇలా అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతితో ముందుకెళ్తున్న హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం సహకరించాలని అనేకసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం నుంచి అందింది గుండు సున్నా అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో రక్షణ శాఖకు మంత్రులుగా పని చేసే ఐదుగురుని పలుమార్లు కలిశామని గుర్తు చేశారు. దేశంలో జరుగుతున్న ఉద్యోగ కల్పనలో 44 శాతం ఉద్యోగాలు హైదరాబాద్ నుంచేనని చెప్పారు. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్ లలో మూడో వంతు హైదరాబాదులోనే తయారవుతూ గ్లోబల్ హబ్‌గా నిలిచిందని అన్నారు. ఇలా శరవేగంగా విస్తరిస్తూ అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో మౌలిక వసతులను ఆ మేరకు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

- Advertisement -

మౌలిక వసతుల కల్పనలో సహకరించాలని తొమ్మిదేళ్లుగా కేంద్రాన్ని అడుగుతున్నామని, ప్రధాని నుంచి మొదలుపెట్టి ఐదుగురు రక్షణ మంత్రులను పదే పదే అడిగామని గుర్తుచేశారు. అయినా ఇంతవరకు కేంద్రం నుంచి ఎలాంటి సహాయం అందలేదని కేటీఆర్ ఆరోపించారు. వరదల్లో హైదరాబాద్ నగరంలో అతలాకుతలమైన సమయంలో కూడా కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు.

సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ నుంచి రాజీవ్ రహదారికి కనెక్ట్ చేసే మార్గంలో ఒక ‘స్కైవే’ నిర్మించాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నామని అన్నారు. అయితే ఈ స్కై వే నిర్మాణం కోసం మార్గంలో ఉన్న కంటోన్మెంట్ ప్రాంతం నుంచి రక్షణ శాఖకు చెందిన 96 ఎకరాలు అవసరమవుతుందని, అలాగే ప్యాట్నీ సెంటర్ నుంచి నాగ్‌పూర్ హైవే వరకు 18.5 కి.మీ స్కై వే మేర నిర్మించ తలపెట్టిన మరో స్కైవే కోసం 56 ఎకరాల రక్షణశాఖ స్థలం కావాలని కేంద్రాన్ని చాలా కాలంగా కోరుతున్నట్టు చెప్పారు. రక్షణ శాఖ ఇచ్చే స్థలానికి సమాన మొత్తంలో మరోచోట స్థలాన్ని ఇస్తామని చెబుతున్నా సరే కేంద్రం నుంచి స్పందన లేదని అన్నారు.

మెహదీపట్నంలో రోడ్డు విస్తరణకు రక్షణ శాఖ నుంచి ఒక అర ఎకరం స్థలం కూడా కావాలని చెప్పారు. అలాగే నగరంలో 142 లింక్ రోడ్లు ప్లాన్ చేశామని, అందులో రెండు చోట్ల అడ్డు వస్తున్న రక్షణ శాఖ భూములను కూడా క్లియర్ చేసి సహకరించాలని రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరినట్టు చెప్పారు. స్కైవేల మాదిరే స్కై వాక్‌ల నిర్మాణాన్ని కూడా చేపడుతున్నామని, ఉప్పల్ స్కైవాక్ నిర్మాణం పూర్తయిందని, రక్షణ శాఖ పరిమితుల వల్ల మెహదీపట్నంలో ప్రారంభించిన ప్రాజెక్టు ఆగిపోయిందని మంత్రి విరించారు.

కంటోన్మెంట్‌లో నిరుపయోగంగా ఉన్న భూములను జీహెచ్ఎంసీకి అప్పగిస్తే అక్కడ ప్రజలకు అవసరమైన ఆస్పత్రులు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపడతామని కేటీఆర్ వెల్లడించారు. తమ వైపు నుంచి ప్రయత్న లోపం లేకుండా గత పది సంవత్సరాలుగా ఈ అంశాలన్నిటిని కేంద్రం దృష్టికి తీసుకొస్తున్నామని, ఈసారైనా సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. కంటోన్మెంట్ లీజు స్థలాలను కార్పొరేషన్‌కు బదలాయించాలని కోరినా తొమ్మిదేళ్లుగా కేంద్రం నుంచి స్పందన లేదన్నారు. తమ ప్రయత్న లోపం లేకుండా అయినను పోయి రావలె హస్తినకు అన్న చందంగా ఢిల్లీ వచ్చామని కేటీఆర్ వివరించారు.

శనివారం పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురిని కలిసి లక్డీకపూల్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు మెట్రో రైల్ విస్తరణ, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో వంటి అంశాల గురించి చర్చిస్తామని అన్నారు. ఈ అంశంపై ఇప్పటికే కేంద్రానికి అనేకసార్లు డీపీఆర్లు ఇచ్చామని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఎంఎంటీఎస్ కోసం అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినా కేంద్రం నుంచి స్పందన లేదని విమర్శించారు. ఎస్ఆర్డీపీ కింద అనేక కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశామని, రసూల్‌పురా వద్ద మూడు 4 ఎకరాల హోంశాఖ భూమి అందిస్తే అక్కడ ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిపారు. ఈ విషయంలో కిషన్ రెడ్డికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన స్పందన లేకపోవడంతో అమిత్ షాను కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు.

హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం కలిసి రావాలని పిలుపునిచ్చారు. పటాన్‌చెరు నుంచి హయత్ నగర్ వరకు మెట్రో విస్తరణ కూడా కేంద్రం సహకారమందించాలని ఆయన కోరారు. తొమ్మిదేళ్లుగా కేంద్రం తెలంగాణకు ద్రోహం చేస్తోందన్న ఆయన, ఇకనైనా వైఖరి మార్చుకోకుంటే ప్రజల్లో ఈ అంశాలను లేవనెత్తుతామని కె.తారక రామారావు హెచ్చరించారు. కిషన్‌రెడ్డి ఇటీవల ఇచ్చిన ప్రజెంటేషన్‌లో ప్రజలకు ఇచ్చిన అప్పును కూడా కేంద్రం ఇచ్చిన నిధులుగా చూపించారని, ఇది ఆయన అజ్ఞానమో, అమాయకత్వమో తెలియట్లేదని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో సుమారు 10 చిన్న పట్టణాలకు మెట్రోలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో మెట్రోకి ఎందుకు సహకరించాలడం లేదో చెప్పాలని నిలదీశారు.

హైదరాబాద్‌లో వరదలు వస్తే సహకరించని కేంద్రం, గుజరాత్ లేదా ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వరదలు వస్తే ఎందుకు నిధులిచ్చిందో కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత పేద రాష్ట్రాల అభివృద్ధిలోనూ తెలంగాణ రాష్ట్ర నిధులు ఉన్నాయని కేటీఆర్ నొక్కి చెప్పారు. జాతి నిర్మాణంలో తెలంగాణ సహాయకారిగా ఉన్నందుకు బీజేపీ నేతలు తెలంగాణ ప్రజలకు, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి మోడీకి అవకాశం ఇస్తే ఢిల్లీని కూడా తీసుకెళ్లి గుజరాత్‌లో పెడతారని విమర్శించారు.

రెండు పార్టీలకూ సమాన దూరం

పాట్నాలో విపక్షాల సమావేశం మీద మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ స్పందించారు. బీజేపీ, కాంగ్రెస్ దేశానికి తీరని నష్టం చేశాయన్నారు. అందుకే తాము ఆ రెండు పార్టీలకు దూరంగా ఉన్నామని చెప్పారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో దేశాన్ని అభివృద్ధి చేయడంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఘోరంగా విఫలమయ్యాయమని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికీ విద్యుత్, నీటి సరఫరా లేని గ్రామాలు కూడా దేశంలో ఉన్నాయంటే వాటి బాధ్యత పూర్తిగా ఈ రెండు జాతీయ పార్టీలదేనని స్పష్టం చేశారు. ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా ప్రజల్లో ఐక్యత రావాల్సిన అవసరం ఉందని, అంశాలవారీగా ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసే ప్రయత్నాన్ని కొనసాగిస్తామని మంత్రి తేల్చి చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని తెలంగాణ అభివృద్ధిని, నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకుంటున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్-బీజేపీ కుమ్మక్కైన విషయం అందరికీ తెలుసునని, ఎవరు ఎవరితో కుమ్మక్కవుతున్నారో ప్రజలకు తెలుసునని ఆయన విమర్శించారు. భారతదేశానికి ప్రధానులుగా పని చేసిన వారందరిలోకి నరేంద్రమోదీ బలహీన ప్రధాని అని ఆయన నొక్కి చెప్పారు. నరేంద్రమోదీ బలహీనతలను దేశంలో అందరికంటే ఎక్కువగా విమర్శించింది భారత రాష్ట్ర సమితేనని కేటీఆర్ అన్నారు. సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారులను తమ చెప్పుచేతల్లో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వ అర్దినెన్సు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో నిలబడతామని, ఉభయసభల్లో వ్యతిరేకంగా ఓటు వేస్తామని తెలిపారు. సమైక్య స్ఫూర్తికి వ్యతిరేకమైన ఈ ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో వాళ్లే చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తే పోరాటం తప్పదని కేటీఆర్ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement