Monday, April 29, 2024

నూతన సచివాలయ ప్రారంభం దసరాకు లేనట్టే? మరో రెండు నెలలు పట్టే అవకాశం!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ కొత్త సచివాలయ భవన సముదాయాల ప్రారంభోత్సవం ఈ దసరాకి అయ్యేలా కనిపించడంలేదు. నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుండటంతో ముహూర్తాన్ని వాయిదా వేసేందుకు రోడ్లు, భవనాల శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో భవనాల నిర్మాణ పనులు మరో రెండు మూడు నెలల్లో పూర్తవుతాయని.. అప్పుడు ప్రారంభ తేదీలను ఖరారు చేస్తారని ప్రభుత్వంలోని అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. బాహ్యపనులు పూర్తయ్యాయి.. కానీ అంతర్గత పనులు ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. ప్లాస్టింగ్‌ పనులు, లోపల రహదారుల పనులు పూర్తయినట్లు తెలిసింది. అయితే రెండ్రోజుల క్రితం సచివాలయ పనులను పరిశీలించిన రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి.. సచివాలయ పనులను త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులకు, నిర్మాణ ఏజెన్సీ సంస్థకు ఆదేశించినట్లు తెలిసింది. సచివాలయ పనుల ప్రారంభమప్పుడే ఈ ఏడాది దసరాకు సచివాలయాన్ని ప్రారంభిస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతే స్పీడ్‌లో పనులు జరగాయి.

2019 ఆగస్టు నెలలో సచివాలయ ఉద్యోగులను బీఆర్కే భవన్‌కు తరలించి ఆ తర్వాత కూల్చివేత పనులు మొదలు పెట్టారు. 150 -200 ఏండ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండేలా రూ.617 కోట్లతో 26 ఎరాల్లో తొమ్మిది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడు అంతస్తుల్లో తెలంగాణ జిల్లాల్లోని సంస్కృతి ఉట్టిపడేలా, కాకతీయ కళావైభవాలతో సచివాలయ నిర్మాణాన్ని చేపడుతున్నారు. నూతన సచివాలయ భవనంలోకి సహజ వెలుతురు, గాలి వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాజస్థాన్‌ నుంచి ప్రత్యేక రెడ్‌సాండ్‌స్టోన్‌ తీసుకొచ్చి నిర్మాణంలో వాడుతున్నారు. సీఎంఓ కార్యాలయం బుల్లెట్‌ ప్రూఫ్‌తో నిర్మాణమవుతోంది. కిటికీలు, డోర్‌లు బుల్లెట్‌ ప్రూఫ్‌తో ఏర్పాటు చేస్తున్నారు. సచివాలయంలో మొత్తం 34 డోములు ఏర్పాటు చేశారు. అయితే వీటి పనులు ఇంకా పూర్తి కాలేదు. సెక్రటేరియేట్‌లో దేవాలయం, మసీదు, చర్చి అన్ని వసతులతో నిర్మిస్తున్నారు. వీటిలోపలికి వెళ్లడానికి సచివాలయం బయటి నుంచి దారి ఏర్పాటు చేస్తున్నారు. సచివాలయంలో ఒకేసారి 500 కార్లు, 650 బైకులు పార్కింగ్‌ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లాస్టింగ్‌ చేసి వైట్‌ పెయింట్‌ వేస్తున్నారు. అయితే ప్రారంభ సమయం దగ్గర పడుతుండటంతో పనుల్లో వేగం తగ్గింది. అయితే దసరాకు మొత్తం సచివాలయ పనులు పూర్తికాకపోయినా… ఆరో అంతస్తులోని సీఎం కార్యాలయంతోపాటు మరో రెండు అంతస్థులను ముందస్తుగా ప్రారంభించాలని అధికారులు భావించారు. కానీ ప్రస్తుతం పనులు ఇంకా పూర్తి స్థాయిలో కాకపోవడంతో ప్రారంభించే ఆలోచనలో అధికారులు లేరని సమాచారం.

క్లారిటీ ఇచ్చేసిన కేటీఆర్‌!…

ఈనెల 21న రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సచివాలయ ప్రారంభానికి సంబంధించి ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు. హైదరాబాద్‌ నడిబొడ్డున తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభానికి సిద్ధమవుతోందని, కొద్ది నెలల్లోనే నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. దీంతోపాటు మరో రెండు మెగా ప్రాజెక్టుల గురించి కూడా కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. తెలంగాణ అమరమీరుల స్మారకం, 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని కూడా కొద్ది నెలల్లోనే సీఎం ప్రారంభిస్తారని ట్విట్టర్‌ వేదికగా కేటీఆర్‌ వెల్లడించారు. దసరాకు సచివాలయ ప్రారంభం ఉండదనే విషయాన్ని తన ట్వీట్‌లో కేటీఆర్‌ చెప్పకనే చెప్పారు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు…ఇంకా సచివాలయం ప్రారంభానికి మరో రెండు మూడు నెలలైనా పట్టే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement