Thursday, March 28, 2024

తెలంగాణ‌లో మూడు రోజుల దాకా వాన‌లుంట‌య్‌.. హెచ్చ‌రించిన వాతావ‌ర‌ణ శాఖ‌

ఉత్త‌రాది నుంచి వాప‌స్ వ‌స్తున్న‌ నైరుతి రుతుప‌వ‌నాల ఎఫెక్ట్ తెలంగాణ‌పై ఉంటుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. దీనికి తోడు బంగాళాఖాతంలో ఏర్ప‌డ్డ‌ ఆవ‌ర్త‌నం కార‌ణంగా కూడా వాతావ‌ర‌ణంలో మార్పులుంటాయి. దీంతో ఈ నెల 30వ తేదీ దాకా రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. ఆ త‌ర్వాత ఒక‌టి రెండు రోజులు పొడి వాతావ‌ర‌ణం ఉంటుంద‌ని, ఆ త‌ర్వాత మ‌ళ్లీ వ‌ర్షాలు కురిసే చాన్స్ ఉంద‌ని అధికారులు తెలిపారు.

రేపు ఏ జిల్లాల్లో వ‌ర్షాలుంటాయంటే..
కొమురంభీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాల‌పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రేపు (బుధ‌వారం) ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది.

దంచికొట్టిన వాన‌
గడిచిన 24 గంటల్లో హైదరాబాద్‌, యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌-మల్కాజిగిరి, కొమురంభీమ్‌ ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నల్లగొండ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్లు అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో అక్టోబర్‌ 1వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీంతో మ‌ళ్లీ వాన‌ల ఎఫెక్ట్ ఉంటుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement