Friday, April 26, 2024

తీగ లాగితే క‌దిలిన‌… అంతరాష్ట్ర అక్రమ ఆయుధాల రవాణా డొంక ..

అనంతపురం (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : అనంతపురం జిల్లా డీ హీరేహళ ప్రాంతంలో పట్టుబడిన అక్రమ ఆయుధాల కేసు విచారణలో మధ్యప్రదేశ్ లో తొమ్మిది అక్రమ ఆయుధాల ముఠా కార్యకలాపాలు బట్టబయలయ్యాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలకు అక్రమ ఆయుధాలు, తూటలు తయారు చేసి అక్రమ రవాణా చేయడమే కాక మాదకద్రవ్యములు కూడా విక్రయిస్తున్నట్లు అనంతపురం పోలీసుల దర్యాప్తులో తేలింది. డీ హీరేహళ పోలీసు స్టేషన్ పరిధిలో గత డిసెంబర్ 25వ తేదీ నిర్వహించిన దాడుల్లో అక్రమ రవాణాకు సిద్దంగా ఉంచిన వివిధ రకాల తుపాకులు, తూటాలు పట్టుబడ్డాయి. ఆ సందర్భంగానే పోలీసులు నిందితులైన కర్నాటక రాష్ట్రానికి చెందిన జంషీద్, ముబారక్, అమీర్ పాషా, గోవాకు చెందిన రియాజ్ షేక్, మధ్యప్రదేశ్ కు చెందిన రాజ్ పాల్ సింగ్ జునే చోటు, చున్నిలాల్ @ నన్ను సుతార్ ఆదివాసీలను పోలీసులు అరెస్ట్ చేసి అక్రమ ఆయుధాలకు సంబంధించిన కేసులను నమోదు చేశారు.

కోర్టు ఆదేశాలతో వారిని అదుపులోకి తీసుకుని వారిచ్చిన సమాచారం మేరకు పోలీసు బృందాలు కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాలలో పలు ప్రదేశాలకు వెళ్ళి సాక్షాలు సేకరించారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బర్వాణి జిల్లా, వర్గ తాహసీల్, ఉమర్టీ గ్రామంలో అక్రమ ఆయుధాలు తయారు చేసే కేంద్రంపైన దాడి చేసి 4 పిస్తోల్స్, 2 తూటాలు, తుపాకులు తయారు చేయడానికి ఉపయోగించే యంత్ర పరికరములను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. అంతే కాక మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అక్రమంగా ఆయుధాలు తయారు చేసే 9 కేంద్రాల‌ను కూడా అనంతపురం పోలీసులు గుర్తించారు. అక్కడినుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు అక్రమ ఆయుధాలు, తూటాలు తయారు చేసి అక్రమంగా రవాణా చేయడమే కాకుండా గంజాయి వంటి మాదక ద్రవ్యములు కూడా విక్రయిస్తున్నట్లు ప్రత్యేక బృందం దర్యాప్తులో తెలిసిందని, మరింత దర్యాప్తు చేయాల్సి ఉందని శనివారం జిల్లా ఎస్పీ ఫకీరప్ప తెలిపారు.
ప్రత్యేక బృందాలకు రివార్డు…
అత్యంత చాకచక్యంగా అంతరాష్ట్ర ఆయుధాల ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 22 తుపాకులు, 97 తూటాలు, 31 కేజీల గంజాయి, 2 కార్లు స్వాధీనం చేసుకొన్నందుకు అనంతపురం పోలీసులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జెనరల్ ఆఫ్ పోలీసు రాజేంద్రనాధ్ రెడ్డి అభినందించి రూ.25,000 ల‌ నగదు రివార్డ్ ప్రకటించడం జరిగింది. ఈ దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు, రాయదుర్గం రూరల్ సర్కల్ ఇన్స్పెక్టర్ యుగంధర్, ఆర్ ఎస్ ఐ రాజశేఖర్ రెడ్డి, డి.హీరేహల్ ఎస్ఎస్ఐ రామకృష్ణారెడ్డి, బొమ్మనహాల్ ఎస్ఐ శివ, జిల్లా స్పెషల్ పార్టీ, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఫకీరప్ప అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement