Monday, May 6, 2024

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన ఎంపీ గురుమూర్తి..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తిరుపతి కేంద్రంగా జాతీయ పర్యాటక ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయవలసినదిగా వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని పార్లమెంట్‌లోని ఆయన కార్యాలయంలో కలిసి పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు. భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధ ఆలయ నగరమైన తిరుపతికి ఏటా కోట్ల మంది యాత్రికులు వస్తుంటారని చెప్పుకొచ్చారు. ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధిని మెరుగుపరచడానికి తిరుపతిలో జాతీయ పర్యాటక ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయవలసినదిగా కిషన్ రెడ్డిని అభ్యర్థించారు. అలాగే భక్తులు, సందర్శకుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న శివాలయం గుడిమల్లంను సాయంత్రం 8 గంటల వరకు తెరిచి ఉంచవలసినదిగా కోరారు.

ఇతర దేశాల నుంచి భారత ప్రభుత్వం వెలికితీసిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పురాతన వస్తువులను రాష్ట్రంలో భద్రపరచడానికి, ప్రదర్శించడానికి చర్యలు చేపట్టవలసినదిగా అభ్యర్థించారు. సూళ్లూరుపేట పరిధిలోని బౌద్ధుల కాలం నాటి కోస్తా బౌద్ధ క్షేత్రాన్ని ‘ప్రాజెక్ట్ మౌసం’ కింద పురావస్తు శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిరక్షణలోకి తీసుకోవాలసినదిగా వినతిపత్రంలో పేర్కొన్నారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఆంధ్రప్రదేశ్‌లోని మల్లయ్యగారి పల్లి, పిడికిటిమల, ఎగువకణతల చెరువు, కదిరిరాయని చెరువు, ఇరలబండ మొదలైన ప్రాంతాల బాధ్యతలను చేపట్టవలసినదిగా ఎంపీ కోరారు.

- Advertisement -

భారతీయ సంస్కృతి, వారసత్వం, చరిత్ర గురించి తెలిపే తాళపత్రాల రక్షణకు చేపట్టవలసినదిగా ఎంపీ గురుమూర్తి అభ్యర్థించారు. ఇప్పటికే అనేక తాళపత్రాలు కనిపించకుండాపోయాయని, రస్తుతం ఉన్న రాతప్రతులు వాతావరణ మార్పులు, చెదల కారణంగా పూర్తిగా పనికి రాని స్థితికి చేరుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతిలోని విద్యాసంస్థలు, వివిధ పత్రికల నుంచి సేకరించిన లక్షలాది రాతపత్రులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్నాయని తెలిపారు. తాళపత్రాలను పరిరక్షించడం, భవిష్యత్ తరానికి అందించడానికి డిజిటలైజ్ చేయడానికి తగిన చర్యలు చేపట్టాలని కిషన్ రెడ్డికి వివరించారు. ఎంపీ విజ్ఞప్తులపై తగిన చర్యలు చేపడతామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement