Friday, April 26, 2024

Focus | కమలం పార్టీలో అంతర్గత క‌ల‌హాలు.. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పోటాపోటీ!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సాధార‌ణ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ బీజేపీ నేతల మధ్య అంతర్గత లుకలుకలు తీవ్రమవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో అధికార బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని పైకి గంబీరంగా చెబుతున్నప్పటికీ అది అంత ఈజీ కాదని కమలనాథులే అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. పార్టీలో సమష్టి బాధ్యత లోపించిందని, అధికార పార్టీ నేతల విమర్శలకు, ఎత్తులు, పైఎత్తులను నేతలే వ్యక్తిగతంగా ఎదుర్కోవాల్సి వస్తోందని సీనియర్‌ నేతలు వాపోతున్నారు. రాజకీయాల్లో సీనియర్లమైనా తామే ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకుంటే ఇక క్షేత్రస్థాయి, ద్వితీయశ్రేణి నేతల పరిస్థితి ఏంటి? అన్న ప్రశ్నలను వారు లేవనెత్తుతున్నారు.

తాము పార్టీపరంగానే ప్రత్యర్థుల విమర్శలకు కౌంటర్లు ఇవ్వడం, ఎదురుదాడి చేస్తున్నామని, అయితే ఆ పరిణామాలతో తమకేమి సంబంధం లేదన్నట్లుగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం అట్టిముట్టనట్లు వ్యవహరించడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ఏ రాష్ట్రంలోనైనా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట జాతీయ పార్టీ అయినప్పటికీ సమష్టి బాధ్యత లోపిస్తే ఎదుర్కోవడం కష్టమన్న అసంతృప్తి నేతల్లో క్రమక్రమంగా పెరుగుతోంది. అధికార బీఆర్‌ఎస్‌పై చేస్తున్న విమర్శలకు ఆ పార్టీ నేతలు సమష్టిగా ఎదురుదాడి చేస్తున్నారని, ఆ పార్టీ సీనియర్‌నేతలు రంగంలోకి దిగి గంటల వ్యవథిలోనే కౌంటర్‌ ఇస్తున్నారని, నేతలను ప్రత్యర్థుల విమర్శల దాడుల నుంచి డిఫెన్స్‌ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.

బీజేపీలోకి చేరికల విషయంలోనూ రాష్ట్ర నాయకత్వం పరిమితులు విధించడంతో పార్టీ బలోపేతం మాటలకే పరిమితమవుతోందన్న అసంతృప్తి సీనియర్‌ నేతల్లో వ్యక్తమవుతోంది. ఇతర పార్టీల్లో కీలక స్థానాల్లో ఉండి, అసంతృప్తితో ఉన్న నేతలను బీజేపీలోకి చేర్చుకోవాలంటే వారి రాజకీయ భవిష్యత్‌కు తగిన హామీ ఇవ్వని పరిస్థితులు నెలకొన్నాయని, ఇలా అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి అభ్యర్థులు కూడా కరువవడం ఖాయమని ఓ సీనియర్‌ నేత కరాఖండీగా చెబుతుండడం గమనార్హం. ఇదే విషయాన్ని మహబూబ్‌నగర్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోనూ నేతలు జాతీయ నేతల ముందు ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

- Advertisement -

రాష్ట్రంలో బలమైన సామాజికవర్గంగా ఉన్న యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓ నేతను పార్టీలో చేర్చుకునే విషయమై ఓ కీలక నేత అంతా సిద్ధం చేయగా అతని చేరికకు రాష్ట్ర నాయకత్వం అనుమతి ఇవ్వలేదని ఓ ముఖ్య నేత వాపోయారు. మరోవైపు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలోనూ బీజేపీ సీనియర్‌ నేతల మధ్య గ్రూప్‌ వార్‌ నడుస్తోన్నట్లు జోరుగా చర్చ సాగుతోంది. పార్టీ అధ్యక్ష పదవి కోసం పలువురు సీనియర్‌, ముఖ్యనేతలు పోటీ పడుతున్నారని, ఎవరికి వారే తాము ఈ సారి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలను చేపట్టడం ఖాయమని ప్రచారం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అధిష్టానం వద్ద కూడా వారు తమకు అనుకూలంగా పరిణామాలను మలుచుకునే ప్రయత్నాలను జోరుగా సాగిస్తున్నట్లు సమాచారం. పాలమూరు జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్‌ నేతలు, కరీంనగర్‌ జిల్లాకు చెం దిన ఓ నేత, హైదరాబాద్‌ నగరానికి చెందిన మరో ఇద్దరు నేతలు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాల కోసం పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలోని పలువురు ద్వితీయ శ్రేణి నేతలు రాష్ట్ర నాయకత్వం తీసుకునే నిర్ణయాలు, కార్యక్రమాల అమలులో అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పలు విభాగాలకు చెందిన మోర్చాల పనితీరుపై ముఖ్యనేతలు పెదవి విరుస్తున్నారు. అధికార బీఆర్‌ఎస్‌ కార్యక్రమాలను ధీటుగా ఎదుర్కొనే విషయంలో మోర్చాలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయడంలో పార్టీ రాష్ట్ర నాయకత్వం సఫలం కావడం లేదన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement