Monday, April 29, 2024

జూన్‌లో వడ్డీ రేట్ల పెంపు?

అధిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో రాబోయే జూన్‌ సమావేశంలో పాలసీ వడ్డీ రేట్లను రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) పెంచే అవకాశం ఉంది. ఆర్బీఐ 50 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణం ఈ ఏడాది మూడోసారి ఆర్బీఐ గరిష్ఠస్థాయి ఆరుశాతాన్ని అధిగమించింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఇంధన ధరలు ఇంకా పెరిగితే సెప్టెంబర్‌ నాటికి ద్రవ్యోల్బణం ఏడుశాతానికి దగ్గరగా ఉంటుందని ఆర్థికవేత్తల అంచనా. ఈ నేపథ్యంలో ఆగస్టులో నిర్వహించే పరపతి సమీక్ష సమావేశంలో పెంపు ఉంటుందని నిపుణులు ఇంతకుముందు వ్యాఖ్యానించినా జూన్‌లోనే పెంపు ఉండవచ్చని భావిస్తున్నారు. ద్రవ్యోల్బణంపై దృష్టి సారిస్తున్నామని ఆర్బీఐ ఇటీవల ప్రకటించింది. ఈనేపథ్యంలో జూన్‌ నెలలో వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి.

కాగా జూన్‌ సమీక్షలో ఆర్బీఐ కనీసం 25బేసిస్‌ పాయింట్ల మేర రెపోరేటును పెంచవచ్చని ఎస్బీఐకి చెందిన ఎకోరావ్‌ నివేదిక పేర్కొంది. గతవారం ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపోరేటును 4శాతం యథాతథంగా కొనసాగించింది. జూన్‌ సమీక్షలో 25బేసిస్‌ పాయింట్లు, ఆగస్టులో మరో 25బేసిస్‌ పాయింట్లు మేర వడ్డీ రేట్లను రిజర్వ్‌బ్యాంక్‌ పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు నివేదికలో పేర్కొంది. ఆహారోత్పత్తుల ధరల పెరగడంతో మార్చిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.95శాతానికి చేరిందని, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ద్రవ్యోల్బణం పెరిగిందని ఆర్బీఐ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement