Sunday, May 5, 2024

మే 10న ఇంటర్‌..మే 15న టెన్త్‌ ఫలితాలు? కసరత్తులు చేస్తున్న విద్యాశాఖ అధికారులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలపై అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ షురూ కావడంతో ఇక ఫలితాల విడుదలపై అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఎంసెట్‌, నీట్‌, జేఈఈ ప్రవేశ పరీక్షలు ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఇంటర్‌ వాల్యుయేషన్‌ ప్రక్రియను పూర్తి చేసి మే 10వ తేదీన ఇంటర్‌ ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్‌ బోర్డు భావిస్తోంది. ఫస్ట్‌ ఇయర్‌, సెకండియర్‌ కలిపి దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు ఈసారి ఇంటర్‌ పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్‌ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు జరిగిన విషయం తెలిసిందే. ఇక పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 3న మొదలై 11తో ముగిశాయి.

తెలంగాణలో జూన్‌ 1 నుంచి ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్‌ 21 వరకు మూల్యాంకనం చేపట్టి, ఆ తర్వాత టాబ్యులేషన్‌ నిర్వహించి మే 15న టెన్త్‌ ఫలితాలను వెల్లడించేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. పదో తరగతి పరీక్షలకు 4,84,384 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అయితే దీనిపై అధికారుల నుంచి ఇంకా పూర్తిస్థాయి స్పష్టత రావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement