Tuesday, April 30, 2024

Credit Cards | ఉందిగా క్రెడిట్‌కార్డు.. వాడేస్తే పోలా!

భారతదేశ క్రెడిట్‌ కార్డ్‌ మార్కెట్‌ వేగంగా వృద్ధి చెందుతోంది, ఏప్రిల్‌ 2023 నాటికి 8.6 కోట్లకు పైగా క్రెడిట్‌ కార్డ్‌లు చెలామణిలో ఉన్నాయి. గతేడాది 7.5 కోట్ల కార్డ్‌లతో పోల్చితే 15 శాతం పెరుగుదలను సూచిస్తుంది. ఒక్కో కార్డుకు సగటు నెలవారీ ఖర్చు 9.37 శాతం పెరిగింది. ఈ మేరకు బ్యాంక్‌బజార్‌ ఒక నివేదికలో పేర్కొంది. ఏప్రిల్‌ 2023లో సగటున ఒక్కో వినియోగదారుడు ఒక్కో లావాదేవీకి రూ. 5,120 చొప్పున మొత్తంగా నెలలో రూ 15,388 ఖర్చు చేసినట్లు తేలింది.

ఏప్రిల్‌ 2022లో, సగటు లావాదేవీ విలువ రూ.4,731 ఉండగా, సగటు ఖర్చు రూ.14,070గా నమోదైంది. ఈ ఏడాది చివరి నాటికి దేశంలో క్రెడిట్‌ కార్డుల సంఖ్య 100 మిలియన్‌ మైలురాయిని చేరుకునే అవకాశం ఉందని ఈ నివేదిక పేర్కొంది. పెరుగుతున్న క్రెడిట్‌ కార్డుల సంఖ్యతో పాటు, ఈ కార్డులపై ఉన్న అప్పులు 30 శాతం పెరిగి రూ. 1.54 లక్షల కోట్ల నుంచి రూ. 2 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

- Advertisement -

డెబిట్‌ కార్డ్‌ల స్థానంలో యూపీఐ

ప్రయాణం, ఎలక్ట్రానిక్స్‌, డైనింగ్‌, షాపింగ్‌ వంటి పెద్ద ఖర్చులలో క్రెడిట్‌ కార్డ్‌ ఆధిపత్యం ఉన్నప్పటికీ, చిన్నమొత్తం కిరాణా ఖర్చులు వంటి లావాదేవీలలో గణనీయమైన ప్రాబల్యాన్ని పొందింది. ఏప్రిల్‌ 2023లో, యూపీఐ ద్వారా 886 కోట్ల లావాదేవీల ద్వారా రూ. 14 లక్షల కోట్లు చెల్లింపులు జరిగాయి. సగటున ప్రతి లావాదేవీ విలువ రూ.1,600గా ఉంది. గతేడాది యూపీఐ 558 కోట్ల లావాదేవీల్లో రూ.9.8 లక్షల కోట్ల చెల్లింపులే జరిగాయి. యూపీఐ చెల్లింపుల వృద్ధి కారణంగా డెబిట్‌ కార్డ్‌ లావాదేవీలు లావాదేవీల విలువలో 16 శాతం, లావాదేవీల సంఖ్యలో (23 కోట్లు) 30 శాతం క్షీణించింది.

క్రెడిట్‌ కార్డ్‌ మార్కెట్‌లో టాప్‌ ప్లేయర్స్‌ ఎవరు?

క్రెడిట్‌ కార్డ్‌ జారీచేసేవారిలో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌, ఎస్‌బిఐ, ఐసిఐసిఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌లు ఆధిపత్య మార్కెట్‌ వాటాను కలిగి ఉన్నాయి. మొత్తం క్రెడిట్‌ కార్డ్‌లలో 71 శాతం వాటా ఈ బ్యాంకులదే కావడం విశేషం. క్యాథలిక్‌ సిరియన్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌, సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌లు సగటున ఒక కార్డుకు నెలకు నాలుగు ఖర్చులతో అత్యంత తరచుగా ఉపయోగించే క్రెడిట్‌ కార్డ్‌లుగా నిలుస్తున్నాయి. మరోవైపు, కరూర్‌ వైశ్య, ఇండస్‌ఇండ్‌, సిటీబ్యాంక్‌ రూ. 27000 చొప్పున ఒక్కో కార్డుకు అత్యధిక నెలవారీ ఖర్చుతో కొత్త రికార్డులను బ్రేక్‌చేస్తున్నాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వంటి కొన్ని ప్రభుత్వ బ్యాంకులు 63 శాతం వృద్ధి రేటును సాధించగా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, కెనరా బ్యాంకులు తమ క్రెడిట్‌ కార్డ్‌ ఆఫర్‌లను తగ్గించుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement