Monday, April 29, 2024

G20 | భారత్‌ టూర్‌ నాకెంతో స్పెషల్‌.. భారత్‌కు అల్లుడు అని సంబోధించడంపై బ్రిటన్‌ ప్రధాని హ్యాపీ

భారత్‌ పర్యటన తనకెంతో ప్రత్యేకమైనదిగా బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ తెలిపారు. న్యూఢిల్లికి విమానంలో వస్తుండగా విలేకరులతో మాట్లాడుతూ తనను భారత్‌కు అల్లుడు సంబోంధించడం పట్ల ఆయన హాస్యమాడారు. భారత్‌ సంతతికి చెందిన తొలి బ్రిటన్‌ ప్రధానిగా వాసికెక్కిన రిషి సునాక్‌ ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షిత మూర్తిని వివాహమాడారు. కాగా భారత్‌ పర్యటన నిమిత్తం పాలమ్‌ విమానాశ్రయానికి శుక్రవారం చేరుకున్న రిషి సునాక్‌, అక్షిత మూర్తి దంపతులకు కేంద్ర మంత్రి అశ్విని కుమార్‌ చౌబే స్వాగతం పలికారు. దంపతులను ‘జై శ్రీరామ్‌’ అంటూ పలకరించారు. వారికి ఒక రుద్రాక్ష, భగవద్గీత, హనుమాన్‌ చాలీసా పుస్తకాలను బహుకరించారు. భారత్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో బ్రిటన్‌ ప్రధాని ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు.

ఉక్రెయిన్‌కు బ్రిటన్‌ మద్దతు

మరికాసేపట్లో రిషి సునాక్‌ ఢిల్లికి బయలుదేరుతారనగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడైమైర్‌ జెలెన్‌స్కీ, బ్రిటన్‌ ప్రధాని కలిసి ఉన్న ఒక ఫొటో కూడిన జీ-20 పోస్టర్‌ను యుకే ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ఢిల్లిdలో జరిగే శిఖరాగ్ర సదస్సుపై దృష్టి పెడుతున్నట్టుగా సదరు పోస్టర్‌పై ‘అంతర్జాతీయ ఆహార భద్రత’ అని రాసి ఉంది. భారత్‌కు బయలుదేరడానికి ముందు సదరు పోస్టర్‌ను బ్రిటన్‌ ప్రధాని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ”ఒక స్పష్టమైన దృక్కోణంతో జీ-20 నేతల శిఖరాగ్ర సదస్సుకు వెళుతున్నాను. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించాలి. అంతర్జాతీయ సంబంధాలను నిర్మించాలి. అత్యంత దుర్బలతకు అండగా ఉండాలి. జీ-20కి పుతిన్‌ (రష్యా అధ్యక్షుడు) మరోసారి ముఖం చాటేశారు. కానీ ఉక్రెయిన్‌కు మా మద్దతును మేం చాటుకుంటాం” అని కామెంట్‌ చేశారు.

త్వరలో భారత్‌కు ఛత్రపతి శివాజీ పులిపంజా బాకు

- Advertisement -

బ్రిటన్‌లో ఉన్న ‘వాఘ్‌ నాఖ్‌’ అనే పులిగోళ్లను పోలిన ఒక బాకును త్వరలో భారత్‌కు తెప్పించనున్నారు. సదరు వాఘ్‌ నాఖ్‌ ఛత్రపతి శివాజీ మహరాజ్‌కు చెందినది. 1659లో బీజాపూర్‌ సుల్తానేట్‌ జనరల్‌ అఫ్జల్‌ ఖాన్‌ను హతమార్చడానికి శివాజీ వాఘ్‌ నాఖ్‌ను వాడారు. అంతటి ప్రసిద్ధి చెందిన వాఘ్‌ నాఖ్‌ ప్రస్తుతం లండన్‌లోని విక్టోరియా అండ్‌ ఆల్బెర్ట్‌ మ్యూజియంలో భద్రంగా ఉంది. వాఘ్‌ నాఖ్‌ను భారత్‌కు తీసుకురావడంలో మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్‌ ముంగన్‌తివార్‌ ప్రమేయం ఉంది. అందులో భాగంగా విక్టోరియా అండ్‌ మ్యూజియంతో ఒక అవగాహన ఒప్పందం(ఎంవోయూ)పై మంత్రి సంతకం చేస్తారు. ప్రసిద్ధి చెందిన ఛత్రపతి శివాజీ పులిగోళ్ళను పోలిన బాకును తీసుకురావడానికి మహారాష్ట్ర సీఎం షిండే రూ.50 లక్షలు మంజూరు చేశారు. వాఘ్‌ నాఖ్‌ను తీసుకురావడం కోసం సాంస్కృతిక వ్యవహారాల మంత్రి నేతృత్వంలో ఒక అధికారిక బృందం సెప్టెంబర్‌ 29 నుంచి అక్టోబర్‌ నాల్గవ తేదీ వరకు లండన్‌లో విక్టోరియా అండ్‌ ఆల్బెర్ట్‌ మ్యూజియమ్‌తో పాటుగా ఇతర మ్యూజియమ్‌లను సందర్శిస్తుంది.

అందరితో కలిసి పనిచేస్తాం: చైనా

జీ-20 నేతల శిఖరాగ్ర సదస్సు ద్వారా ఒక సానుకూలమైన ఫలితాన్ని సాధించడం కోసం సభ్యదేశాలందరితో కలిసి పనిచేస్తామని చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్‌ శుక్రవారం తెలిపారు. చైనా కారణంగా ఉక్రెయిన్‌ సంక్షోభంతో పాటుగా పలు అంశాలపై ఒక ఒప్పందం కుదుర్చుకోవడంలో ఆలస్యం అవుతున్నదంటూ బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ నిందించిన నేపథ్యంలో జీ-20 సభ్యులందరితో కలిసి పనిచేయడానికి చైనా సుముఖత వ్యక్తం చేయడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement