Saturday, May 18, 2024

ఢిల్లీ తెలంగాణ భవన్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం.. పాల్గొన్న మంద జగన్నాథం, కె.ఎం.సాహ్ని

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు త్యాగం చేసిన సమరయోధులను స్మరిస్తూ తెలంగాణ ప్రభుత్వం వజ్రోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని ఢిల్లీలోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి డా.మంద జగన్నాథం అన్నారు. సోమవారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ శబరి బ్లాక్‌లో 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు మంద జగన్నాథంతో, కె. ఎం సాహ్నిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత మహాత్మ గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మంద జగన్నాథం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంద జగన్నాథం మాట్లాడుతూ రాష్ట్రమంతా ఆగస్టు 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 15 రోజుల పాటు స్వతంత్ర భారత వజ్రోత్సవాలను నిర్వహిస్తోందని తెలిపారు. తెలంగాణా ప్రభుత్వం, ప్రజలందరిలో జాతీయ సమైక్యత పెంపొందేలా సమావేశాలు, ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, మొక్కలు నాటడం, ఫ్రీడం రన్, జాతీయ సమైక్యత రక్షా బంధన్, దేశభక్తి కార్యక్రమాలు, ఆటల పోటీలు, సామూహిక జాతీయ గీతాలాపన, కవి సమ్మేళనాలు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మన రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపారని సంతోషం వ్యక్తం చేశారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, డబుల్ బెడ్ రూం ఇళ్లు, రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్, దళిత బంధు, గ్రామీణ వృత్తి దారులను ప్రోత్సహించడం వంటి ఎన్నో వినూత్న పథకాలను అమలు పరుస్తూ అనతి కాలంలోనే వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించని తెలిపారు. సంక్షేమంలోనే కాక పారిశ్రామిక రంగంలోనూ రాష్ట్రం ముందుకెళ్తోందన్నారు. జాతీయ పండగలను తెలంగాణ భవన్ ఉద్యోగులందరూ కుటుంబాలతో ఘనంగా జరుపుకుంటూ రాష్ట్రం సంస్కృతి సంప్రదాయాలను ఉత్తరాది వారికీ తెలియజేయాలని మంద జగన్నాథం పిలుపునిచ్చారు. ఆర్సీ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఔన్నత్యాన్ని దేశ పౌరులందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడ్డప్పటికీ వినూత్న పథకాలతో అభివృద్ది, సంక్షేమ రంగాలలో ఇతర రాష్ఠ్రాలకు ఆదర్శంగా నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ దేశాభివృద్ది కోసం పాటుపడాలని తెలిపారు. ఈ వేడుకల్లో భవన్ ఓఎస్డీ విక్రమ్ సింగ్ మాన్, ఇతర అధికారులు, సిబ్బంది, మదర్సా విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement