Wednesday, May 15, 2024

మోత మోగనున్న విద్యుత్ చార్జీలు..

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ వడ్డనకు రంగం సిద్ధమైంది. త్వరలోనే గృహ తదితర వినియోగ విద్యుత్‌ చార్జీల పెంపునకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు విద్యుత్‌ చార్జీల పెంపుపై ఏఆర్‌ఆర్‌, టారిఫ్‌ ప్రాతిపదికన డిస్కమ్‌లు ఈఆర్సీకి ప్రతిపాదనలను అందజేశాయి. ఈ ప్రతిపాదనల్లో భాగంగా గృహ వినియోగదారులకు యూనిట్‌కు 50పైసలు పెంచుకునేందుకు అనుమతి కోరుతూ ప్రతిపాదనలు సమర్పించాయి. శ్లాబుల వారీగా పెంపు వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు వెల్లడించారు. హెచ్‌టీవిని యోగదారులకు యూనిట్‌కు రూ.1ని పెంపు ప్రతిపాదనలను సమర్పించారు. ఈ చార్జీల పెంపుతో డిస్కంలకు రూ.6,831 కోట్ల ఆదాయం సమకూరనుందని టీఎస్‌ఎస్‌పీడీపీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి వెల్లడించారు. ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి, డిస్కమ్‌లు కోరాయి. ఈ మేరకు ఈఆర్సీకి డిస్కమ్‌లు తమ ఏడాది ఆదాయ వార్షిక నివేదికతోపాటు టారిఫ్‌ ప్రతిపాదనలను అందజేశాయి.

ఈ పెంపుపై వివిధ వర్గాల ప్రజాబిప్రాయం స్వీకరించిన తర్వాత ఈఆర్సీ అనుమతించనుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సబ్సిడీలు కొనసాగిస్తామని సీఎండీ రఘుమారెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ వినియోగదారులకు 50పైసలు పెంపు ప్రతిపాదనలు మాత్రమే వచ్చాయన్నారు. ఈ పెంపుతో రూ.2,110 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. మిగిలిన వినియోగదారులకు ఒక రూపాయి చొప్పున పెంచుతున్నామని తెలిపారు. అన్ని శ్లాబుల్లో టారిఫ్‌లు పెంచడం ద్వారా రూ.4,721 కోట్లు అదనంగా వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. అయితే రైతాంగానికి ఎప్పటిలాగానే ఉచిత విద్యుత్‌ అందజేస్తున్నామని, ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నట్లు చెప్పారు. హెయిర్‌ సెలూన్స్‌, లాండ్రీలకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ కొనసాగనుందన్నారు. పవర్‌లూమ్స్‌, స్పిన్నింగ్‌ మిల్లులకు యూనిట్‌కు రూ.2 చొప్పున సబ్సిడీ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

అయితే ఈ చార్జీలు ఎప్పటినుంచి అమలు అవుతున్నాయనే అంశం పేర్కొనలేదు. డిస్కంలు ఇప్పటికే పూర్తిస్థాయిలో ప్రతిపాదనలను సమర్పించాయి. ఈ నేపథ్యంలో డిస్కంల టారిఫ్‌లను వెబ్‌సైట్‌లో ఉంచి ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. ఆ తర్వాత పత్రికా ప్రకటనల ద్వారా వివరాలను వెల్లడిస్తారు. సెడ్యూల్‌ నిర్ణయించిన పిమ్మట మార్చి 31లోపు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి కమిషన్‌ నిర్ణయాన్ని వెల్లడించనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement