Tuesday, April 30, 2024

2021-22లో చైనా నుంచి భారీగా తగ్గిన దిగుమతులు..

గడచిన ఆర్థిక సంవత్సరంలో భారత్‌ దిగుమతుల్లో చైనా వాటా భారీగా తగ్గింది. భారత్‌కు వచ్చిన విదేశీ షిప్‌మెంట్‌లను పరిశీలిస్తే చైనా నుంచి వచ్చిన దిగుమతులు బాగా తగ్గాయని తేలింది. 2020-21తో పోలిస్తే 1.05 శాతం మేర చైనా వాటా మరింత తగ్గినట్లు తేలింది. ప్రధానంగా చైనానుంచి భారత్‌ టెలికమ్‌, విద్యుత్‌ రంగాలకు సంబంధించిన ఉపకరణాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఫార్మా రంగానికి చెందిన ముడి సరుకులు దిగుమతి చేసుకుంటోంది. కాగా ఇటీవలి కాలంలో ప్రత్యమ్నాయ మార్కెట్లపై దృష్టి సారించిన భారత్‌ చైనాపై ఆధారపడటం తగ్గించింది. యాక్టివ్‌ ఫార్మస్యూటికల్‌ ఇన్‌గ్రెడింట్స్‌ (ఏపీఐ)గా చెప్పే ముడి ఔషధాలను దిగుమతి చేసుకోక తప్పడం లేదు.

కోవిడ్‌ సమయంలో ఐటీ, వైద్యం, ఆరోగ్యం, సైన్స్‌ సాంకేతిక పరిజ్ఞానం వంటి రంగాల్లో దిగుమతుల అవసరం పెరిగింది. ఈ నేపథ్యంలో నౌకల రవాణా నిలిచిపోవడం, చైనాతో సరిహద్దు వివాదం వంటి కారణాలవల్ల దిగుమతుల్లో తగ్గుదల నమోదైంది. మరోవైపు చైనాకు ఎగుమతులు మాత్రం గణనీయంగా పెరిగాయి. భారత్‌నుంచి 2021-22లో చైనాకు 21.2 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. అమెరికా, యూఏఈ తరువాత భారత్‌ ఎక్కువగా ఎగుమతి చేసింది చైనాకే. 2014-15లో చైనాకు భారత్‌ ఎగుమతుల విలువ కేవలం 11.9 బిలియన్లే కావడం గమనార్హం. కాగా చైనా నుంచి ఫోన్ల దిగుమతులు గణనీయంగా తగ్గాయి. దాదాపు 55 శాతం మేర, అంటే 626 మిలియన్ల విలువైన ఫోన్ల దిగుమతి తగ్గిందన్నమాట.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement