Monday, April 29, 2024

ఈశాన్యంపై ‘మోఖా’ తుఫాను ప్రభావం.. భారత వాతావరణ శాఖ ప్రకటన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ ‘మోఖా’ తుఫాను ప్రభావం అండమాన్ – నికోబార్ దీవులతో పాటు ఈశాన్య రాష్ట్రాలపై ఉంటుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. గురువారం విడుదల చేసిన ప్రకటనతో పాటు ‘మోఖా’ తుఫానుపై ఎప్పటికప్పుడు బులెటిన్లు విడుదల చేస్తోంది. గురువారం అండమాన్-నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురిశాయని, ఈ నెల 14 వరకు అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. తుఫాను గమనం భారత తూర్పు తీరానికి దూరంగా కదులుతూ బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల్లో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాలకు తుఫాను ముప్పు లేదని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్-మయన్మార్ (బర్మా) సరిహద్దుల్లో తీరాన్ని దాటిన తర్వాత బలహీనపడుతూ ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, మిజోరాం మీదుగా మణిపూర్, దక్షిణ అస్సాం నాగాలాండ్ వరకు ప్రయాణిస్తుందని, ఫలితంగా ఈ రాష్ట్రాల్లో ఈ నెల 14 వరకు చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

- Advertisement -

భారత తూర్పు తీరంపై పెద్దగా ప్రభావం లేనప్పటికీ ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, గంటకు గరిష్టంగా 120 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ప్రాంతాల్లో సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులను వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరించింది. తుఫాను తీరం దాటిన తర్వాత వీచే బలమైన ఈదురు గాలుల ప్రభావం త్రిపుర, మిజోరాం, దక్షిణ మణిపూర్‌పై ఉంటుందని, బలహీన నిర్మాణాలు, పూరి గుడిసెలు దెబ్బతినే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఈదురుగాలుల కారణంగా చెట్ల కొమ్మలు విరిగిపడడం, భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

పశ్చిమ తీరం – పూర్తి భిన్నం

బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుఫాను ప్రభావం ఈశాన్య రాష్ట్రాలకు వర్షాలను మోసుకొస్తూ ఎండ వేడి నుంచి ఉపశమనాన్ని కల్గిస్తుంటే.. దేశంలో పశ్చిమ, దక్షిణ భూభాగాలు మాత్రం తీవ్రమైన వేడి, ఉక్కపోతను ఎదుర్కోనున్నాయి. కొంకణ్ తీరంతో పాటు కేరళ, తమిళనాడులో రానున్న 5 రోజుల పాటు తీవ్ర ఉక్కపోత, వేడితో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. గుజరాత్, మధ్య మహారాష్ట్ర, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు రాజస్థాన్, కోస్తా ఆంధ్రా, యానాం ప్రాంతాల్లో వడగాలులు ఉంటాయని ఉంటాయని, ఈ నెల 15 వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement