Saturday, April 27, 2024

Delhi | జూన్‌ నాటికి తిరుపతి ఐఐటీ క్యాంపస్‌ సిద్ధం.. వెల్లడించిన కేంద్రం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఈ ఏడాది జూన్‌ 30 నాటికి తిరుపతి ఐఐటి క్యాంపస్‌లో నిర్మాణాలన్నింటినీ సిద్ధం చేసి అప్పగిస్తామని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్‌ సుభాస్‌ సర్కార్‌ వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ తిరుపతి ఐఐటి క్యాంపస్‌లో నిర్మాణ పనులు ఈ నెలాఖరులోగా పూర్తి కావలసి ఉందని తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి దేశంలోని ఐఐటిలు అన్నింటికి కలిపి రూ. 9,361 కోట్లు కేటాయించినట్లు మంత్రి చెప్పారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో తమకు రూ. 407 కోట్లు కేటాయించవలసిందిగా తిరుపతి ఐఐటి యాజమాన్యం కోరింది. అయితే తిరుపతి ఐఐటికి ఎంత మొత్తం కేటాయించాలన్న అంశం ఇంకా మంత్రిత్వ శాఖ పరిశీలనలోనే ఉందని ఆయన పేర్కొన్నారు. ఐఐటిలకు కేటాయించిన రూ. 9,361 కోట్ల నుంచే సిబ్బంది జీతభత్యాలు, పెన్షన్లు, స్కాలర్‌షిప్‌లు, కాంట్రాక్ట్‌ సిబ్బందికి వేతనాలు, చిన్న చిన్న పరికరాలు, లైబ్రరీ పుస్తకాలు, వడ్డీ చెల్లింపులు వంటి వాటి చెల్లింపుల కోసం ఉద్దేశించినవని మంత్రి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement