Thursday, May 16, 2024

దేశ రక్షణ వ్యవస్థలో కీలకంగా హైదరాబాద్‌.. నిమ్జ్‌లో వెమ్‌ పరిశ్రమకు శంకుస్థాపన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దేశ రక్షణ వ్యవస్థలో హైదరాబాద్‌ నగరం కీలకంగా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ. రామారావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో రక్షణ రంగ వ్యవస్థ రోజురోజుకూ పెరుగుతోందని తెలిపారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని పరిశ్రమలు రావాలని, ఉపాధి అవకాశాలు పెరగాలని ఆకాంక్షించారు. అయితే పరిశ్రమలు పర్యావరణహితంగా నెలకొల్పబడాలని ఆకాంక్షించారు. అభివృద్ధిలో పరుగులు పెడుతున్న తెలంగాణ వంటి రాష్ట్రాలను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వానికి హితవు చెప్పారు.

హైదరాబాద్‌-బెంగళూరు మధ్య డిఫెన్స్‌ కారిడార్‌ పెట్టాలని కేంద్రాన్ని కోరినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢి ఫెన్స్‌ కారిడార్‌ను బుందేల్‌ఖండ్‌కు తరలించారని మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ నిమ్జ్‌ లో వీఈఎం పరిశ్రమ నిర్మాణానికి బుధవారం మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ… ” పరిశ్రమలు ఎక్కడ వేళ్లూనుకుని ఉన్నాయో అక్కడ కాకుండా… ఉత్తరప్రదేశ్‌లో ఓట్లు, సీట్లు ఉన్నాయని అక్కడే అభివృద్ధి పనులు చేస్తామంటే అది కరెక్టు కాదు. ప్రభుత్వం చేతిలో ఉంది కదా.. అని ఎలాంటి వసతులు, సదుపాయాలు లేని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపడతామంటే అది సరైన నిర్ణయం కాదు. ఇప్పటికైనా పునరాలోచించుకోవాలి.” అని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

వెమ్‌ టెక్నాలజీస్‌ రాష్ట్రానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. పరిశ్రమ ఏర్పాటుతో రెండు వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. వెమ్‌ టెక్నాలజీలో సెమీ స్కిల్డ్‌, అన్‌ స్కిల్డ్‌ ఉద్యోగాల్లో స్థానికులకు అవకాశం కల్పించాలన్నారు. సీఎస్‌ఆర్‌లో భాగంగా చుట్టుపక్కల గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

పెరిగిన ధరల ప్రకారమే నివ్జ్‌ నిర్వాసితులకు పరిహారం స్థానికులకు ఉద్యోగావకాశాలు..

తెలంగాణ వచ్చిన తర్వాత భూముల ధరలు భారీగా పెరిగాయన్నారు. భూమి కోల్పోయిన రైతుల కుటుంబాలకు నిమ్జ్‌ లోనే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పెరిగిన ప్రస్తుత ధరలకు అనుగుణంగా నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని చెప్పారు. సామాజిక బాధ్యతలో భాగంగా స్థానిక గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు నిర్దేశించారు. ” భూముల విలువ బాగా పెరిగిపోయింది. అలాంటి విలువైన భూములు ఇచ్చిన వారికి ఉపాధి అవకాశం కల్పించండి. నిర్వాసితులకు భరోసా కల్పిస్తే… వారు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటారు. నివ్జ్‌ు లో నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి నిర్వాసిత కుటుంబాల పిల్లలకు ఉద్యోగాలు ఇద్దాం.” అని అధికారులు, పరిశ్రమల యాజమాన్యాలకు పిలుపునిచ్చారు.

- Advertisement -

అభివృద్ధి, సంక్షేమాన్ని కలగలిపి ముందుకు తీసుకెళ్తున్న ఏకైక రాష్ట్రం…

అభివృద్ధి, సంక్షేమాన్ని కలగలిపి ముందుకు తీసుకెళ్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనని మంత్రి కేటీ. రామారావు స్పష్టం చేశారు. 65ఏళ్లుగా ఉమ్మడి ప్రభుత్వాలు మిగిల్చిన సమస్యలను, గబ్బును ఒక్కోటిగా ఎనిమిదేళ్లుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వదిలిస్తోందని చెప్పారు. జహీరాబాద్‌ పట్టణాన్ని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ చేయడంతోపాటు మొదటిసారిగా రూ.50కోట్ల నిధులను కేటాయించిన ఏకైక సీఎం కేసీఆరేనని స్పష్టం చేశారు. తెలంగాణ రాకముందు మున్సిపాలిటీలకు 50లక్షలు వస్తే సంబురాలు చేసుకునేవారని, ఇప్పుడు ఒక్క జహీరాబాద్‌కే సీఎం కేసీఆర్‌ రూ.50కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. జహీరాబాద్‌ నిమ్జ్‌లో కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

జహీరాబాద్‌ పట్టణానికి 2014 నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన నిధులు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు… వైకుంఠధామం, వెజ్‌-నాన్‌వెజ్‌ మార్కెట్‌ తదితర పనులను వివరించారు. చిన్నప్పుడు తాను చూసిన జహీరాబాద్‌కు తెలంగాణ వచ్చాక ఇప్పుడు చూస్తున్న జహీరాబాద్‌ పట్టణానికి అసలు పోలికే లేదని, గడిచిన ఎనిమిదేళ్లలో జహీరాబాద్‌ బాగా అభివృద్ధి చెందిందన్నారు. జహీరాబాద్‌ విలీన గ్రామాల అభివృద్ధికి రూ.66కోట్లను త్వరలో కేటాయించనున్నట్లు చెప్పారు. త్వరలోనే కోహిర్‌ పంచాయతీని మున్సిపాలిటీగా ప్రకటించేందుకు కృషి చేస్తానని చెప్పారు. పట్టణంలో ట్యాంక్‌ బండ్‌ నిర్మాణానికీ రూ.66కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి మున్సిపల్‌ పట్టణంలో అభివృద్ధి పనులతోపాటు కనీస మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నట్లు వివరించారు.

ఉమ్మడి పాలనలో జహీరాబాద్‌ నుంచి మంత్రిగా ఉన్న వాళ్లు కూడా పదవులకోసమే పాకులాడారు గాని… పట్టణ అభివృద్ధికి ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. ఎవరైనా చనిపోతే అంత్యక్రియల అనంతరం స్నానాల కోసం అర్ధగంట కరెంటు కావాలని నాడు అడుక్కునే దుస్థితి ఉండేదని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రతి పట్టణం, గ్రామానికి తాగునీటితోపాటు వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, ఏకైక సీఎం కేసీఆరేనని తేల్చి చెప్పారు. ఉమ్మడి పాలనలో జహీరాబాద్‌తోపాటు అనేక పట్టణాల్లో తాగునీరు రెండు, మూడురోజులకోసారి వచ్చేదని ఇప్పుడు ప్రతి నిత్యం తాగునీరు అందుబాటులో ఉందని గుర్తు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement