Saturday, May 4, 2024

హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్

హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థిగా టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాద‌వ్‌ను ఖ‌రారు చేస్తూ సీఎం కేసీఆర్ ప్ర‌క‌ట‌న చేశారు. ద‌ళిత బంధు ప్రారంభ స‌మావేశం సంద‌ర్భంగా ఈ నెల 16న హుజూరాబాద్‌లో నిర్వ‌హించే బ‌హిరంగ స‌భ‌లో గెల్లు శ్రీనివాస్ యాద‌వ్‌ను నియోజక‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ ప‌రిచ‌యం చేయ‌నున్నారు.

గెల్లు శ్రీనివాస్ నేపథ్యం ఏంటి?
కరీంనగర్ జిల్లా వీణ‌వంక మండ‌లం హిమ్మ‌త్ న‌గ‌ర్ గ్రామానికి చెందిన గెల్లు మ‌ల్ల‌య్య‌, ల‌క్ష్మీ దంప‌తుల‌ కుమారుడు గెల్లు శ్రీనివాస్ యాద‌వ్. ఆయన 1983, ఆగ‌స్టు 21న జ‌న్మించారు. ఓయూలో ఎంఏ, ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. ఇదే యూనివ‌ర్సిటీలో రాజ‌నీతి శాస్త్రంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. ఇంట‌ర్ వ‌ర‌కు క‌రీంన‌గ‌ర్ జిల్లాలోనే చ‌దివిన శ్రీనివాస్.. ఉన్న‌త విద్య కోసం హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. గ‌గ‌న్ మ‌హ‌ల్‌లోని ఏవీ కాలేజీలో బీఏ చ‌దువుతున్న రోజుల్లోనే విద్యార్థి రాజ‌కీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. అంబ‌ర్‌పేట‌లోని ప్ర‌భుత్వ బీసీ హాస్ట‌ల్‌లో ఉంటూ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం 2003 నుంచి 2006 వ‌ర‌కు హాస్ట‌ల్ అధ్య‌క్షుడిగా కొన‌సాగారు. ఆ కాలంలో బీసీ విద్యార్థుల స‌మ‌స్య‌ల‌పై పోరాడారు. డిగ్రీ చ‌దువుతున్న సమయంలో కేసీఆర్ ప్ర‌సంగాల‌కు ఆక‌ర్షితుడై ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా ప‌ని చేశారు. 2010లో ఉస్మానియా యూనివర్సిటీ టీఆర్ఎస్వీ అధ్యక్షుడిగా గెల్లు శ్రీనివాస్‌ను బాల్క సుమ‌న్ నియ‌మించారు. 2017 నుండి టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: లోక్​సభ నిరవధికంగా వాయిదా

Advertisement

తాజా వార్తలు

Advertisement