Monday, April 29, 2024

తొలిసారి మానవ చర్మం సేకరణ..ఉస్మానియా డాక్ట‌ర్ల‌ అరుదైన ఘనత

హెటిరో డ్రగ్స్‌, రోటరీ క్లబ్‌ సాయంతో దాదాపు రూ.70 లక్షలు వెచ్చించి ఉస్మానియా ఆసుపత్రిలో ఇటీవల చర్మనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జీవన్‌దాన్‌ ట్రస్టు ఆధ్వర్యంలో బ్రెయిన్‌డెడ్‌ అయిన వారి నుంచి చర్మాన్ని సేకరించి ఇక్కడ భద్రపర్చి, అవసరమైన వారికి వినియోగిస్తారు. తొలిసారి ఉస్మానియాలో ఇలాంటి బ్యాంకు అందుబాటులోకి రావడం విశేషమని డాక్టర్‌ నాగేందర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఒకసారి సేకరించిన చర్మాన్ని ఐదేళ్ల వరకు భద్రపరిచే అవకాశం ఉస్మానియా కేంద్రంలో ఉందని ప్లాస్టిక్‌ సర్జన్‌ డాక్టర్ ..ప్రొఫెస‌ర్ నాగప్రసాద్‌ తెలిపారు. కాగా హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రి అరుదైన ఘనత సాధించింది.

తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారికి మానవ చర్మాన్ని సేకరించి భద్రపరిచింది. బ్రెయిన్‌డెడ్‌ అయిన ఓ మహిళ నుంచి చర్మాన్ని సేకరించి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన చర్మనిధి బ్యాంకులో వైద్యులు భద్రపరిచారు. 53ఏళ్ల మహిళ ఇటీవల రోడ్డుప్రమాదంలో గాయపడింది. జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆమె బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబసభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. కిడ్నీ, మూత్రపిండాలతో పాటు చర్మదానానికీ అంగీకరించారు. దీంతో ఉస్మానియాకు చెందిన చర్మనిధి నిపుణులు అపోలో ఆసుపత్రిలో ఆమె చర్మాన్ని సేకరించి ఉస్మానియా చర్మనిధి కేంద్రానికి తరలించారు.

దీనికి సంబంధించిన వివరాలను ఉస్మానియా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌ మీడియాకు వెల్లడించారు. బ్రెయిన్‌ డెడ్‌ అయిన మహిళ నుంచి 16 స్కిన్‌ గ్రాఫ్ట్‌లను సేకరించినట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఆసుపత్రులు గుండె, కాలేయం, కిడ్నీ, ఊపిరితిత్తుల మార్పిడి చికిత్సలు చేస్తున్నా.. చర్మాన్ని సేకరించి భద్రపరిచే సాంకేతికతను ఏ ఆసుపత్రి నిర్వహించడం లేదని ఆయన తెలిపారు. కాలిన గాయాలకు చికిత్స అందిస్తున్న ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఈ తరహా ఏర్పాట్లు లేవన్నారు. ఇది ఉస్మానియా ఘ‌న‌త‌గా అభివ‌ర్ణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement