Thursday, May 2, 2024

TS | సన్నాల రైతులకు కాసుల పంట.. భారీ డిమాండ్ !

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సన్నరకం వరి ధాన్యం సాగు చేసిన రైతులకు కాసుల పంట పడుతోంది. సన్నరకం వరి ధాన్యానికి కొనుగోలు కేంద్రాల్లో కంటే బహిరంగమార్కెట్లోనే అధిక లభిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు రైతులు కేవలం దొడ్డురకం ధాన్యాన్ని మాత్రమే తీసుకొస్తున్నారు. సన్నాలు సాగు చేసిన రైతుల కల్లాల వద్దకే వ్యాపారులు వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. మంచి ధర వస్తుండడంతోపాటు కల్లాల వద్దనే వ్యాపారులు కాంటా వేస్తుండడంతో రైతులు ప్రయివేటు వ్యాపారులకే ధాన్యాన్ని అమ్ముతున్నారు.

రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌ తదితర జిల్లాల్లో సాగైన సన్నరకం ధాన్యాన్ని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మరీ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారంటే డిమాండ్‌ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం సన్నాలకు ప్రభుత్వ మద్దతు ధర కంటే అధనంగా రూ.500 దాకా ఎక్కువ చెల్లించి మరీ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కోతలకు ముందుగానే సన్నాల రైతులకు వ్యాపారులు అడ్వాన్సు ఇస్తున్నారు. ధాన్యంలో తేమ 30శాతం ఉన్నా సరే క్వింటాకు రూ.3వేల దాకా వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు.

మద్దతు ధర కంటే అధిక ధర రావడంతోపాటు ధాన్యాన్ని ఆరబెట్టడం, తూర్పారబట్టడం, కొనుగోలు కేంద్రాలకు తీసుకొనిరావడం వంటి శ్రమ తగ్గుతుందోని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ వానకాలంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 80 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా ఇందులో సుమారు 20-25 లక్షల ఎకరాల్లో సన్నాలు సాగైనట్టు సమాచారం. తద్వారా సుమారు 50 లక్షల టన్నుల సన్నాలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నదని వ్యవసాయశాఖ అంచనా వేసింది. తెలంగాణ సన్నరకం ధాన్యానికి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మంచి డిమాండ్‌ ఉంది.

- Advertisement -

ఏటా సుమారు 20 లక్షల టన్నులకు పైగా సన్నాలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నట్టు అంచనా. రాష్ట్రంలోని మిల్లర్లు, ప్రైవేట్‌ వ్యాపారులు కూడా పెద్ద మొత్తంలో సన్నాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా డిమాండ్‌ పెరిగింది. పస్తుతం సన్నరకం ధాన్యం క్వింటాకు రూ.3200 వరకు ధర పలుకుతోంది. ధాన్యంలో తేమ ఉన్నప్పటికీ కల్లాల వద్దే మద్దతు ధర కంటే ఎక్కువకు కొనుగోలు చేస్తుండడంతో రైతులు వ్యాపారులకు అమ్మేందుకే మొగ్గు చూపుతున్నారు.

సాధారణంగా ప్రతి ఏటా ఖరీఫ్‌/వానా కాలం సీజన్‌లో సన్నాలను రైతులు ఎక్కువగా సాగు చేస్తుంటారు. వానాకాలం సీజన్‌లో అగ్గితెగులు సోకుతుండడంతో ప్రతి ఏటా సన్నాల దిగుబడితోపాటు సాగు వి స్తీర్ణం కూడా తగ్గుతూ వస్తోంది. తెలంగాణలో ఎక్కువగా ఆర్‌ఎన్‌ఆర్‌, కేఎన్‌ఎం, వర్షా, కావేరి, హెచ్‌ఎంటీ, చింట్లు, జైశ్రీరాం, బీపీటీ వంటి సన్నాలను రైతులు సాగు చేస్తున్నారు.

రాష్ట్రంలో సాగవుతున్న సన్నరకం వరి ధాన్యానికి జాతీయంగా, అంతర్జాతీయంగానూ భారీగా డిమాండ్‌ ఉంది. ఎక్కువగా సౌదీ తదితర దేశాలనుండి ఎక్కువ డిమాండ్‌ ఉంటుంది. భారీ డిమాండ్‌ను గమనించిన మిల్లర్లు ఆయా దేశాల్లో కార్యాలయాలను ప్రారంభించి, అక్కడ డిమాండ్‌కు అనుకుగుణంగా రాష్ట్రంలో సన్నల రకం బియ్యాన్ని సేకరిస్తున్నారు. దీనికొరకు మిల్లర్లు ప్రభుత్వ మద్దతు ధర కంటే అధికంగా చెల్లిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement