Friday, April 26, 2024

నదుల అనుసంధానంపై రేపు ఉన్నతస్థాయి సమావేశం.. గోదావరి జలాల తరలింపుకు తెలంగాణ ఆక్షేపణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో నదుల అనుసంధానం సాధ్యం కాదనీ, ఇచ్చంపల్లి నుంచి గోదావరిజలాలను కృష్ణాలోకి తరలించడాన్ని అంగీకరించమని పదే పదే స్పష్టం చేస్తున్నప్పటికీ ఎన్‌ డబ్ల్యూ డిఏ సోమవారం జలసౌధలో ఈ అంశం పై సమావేశం ఏర్పాటు చేయడాన్ని రాష్ట్ర నీటి పారుదల శాఖ ఆక్షేపించింది. గత ఉమ్మడిపాలనలోనే ఈ ప్రతిపాదనలు తెరమీదకు వస్తే ఛత్తీస్‌ గడ్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అభ్యంతరం తెలపడంతో ఈ అంశం వాయిదా పడింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే కేంద్రప్రభుత్వ ఆధీనంలోని నేషనల్‌ వాటర్‌ డెవెలఫ్‌ మెంట్‌ ఏజెన్సీ టాస్క్‌ ఫోర్స్‌ తిరిగి ఈ అంశాన్ని తెరమీదకు తెచ్చి సమావేశాలు నిర్వహిస్తూ ఏకాభిప్రాయంకోసం ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో సోమవారం సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆంధ్ర, ఛత్తీస్‌ గడ్‌, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ప్రతినిధులను ఎన్డీడబ్ల్యూఏ ఆహ్వానించింది. ప్రధానంగా ఇచ్చంపల్లి సమ్మక్క బ్యారేజ్‌ ప్రాంతంలోని జానం పేట నుంచి నాగార్జున సాగర్‌, అక్కడినుంచి పెన్నా మీదుగా కావేరికి మళ్లించాలని ఎన్డీడబ్ల్యూఏ చేసిన అధ్యయనంపై ఈ సమావేశేంలో చర్చించేందుకు ఏజెండాను రూపొందించారు.

- Advertisement -

అయితే ఈ ప్రతిపాదనలను ఇప్పటికే తెలంగాణ ఆక్షేపించడంతో ఇతర ప్రతిపాదనలపై చర్చించే అవకాశాలున్నాయి. అయితే తరలించిన నీటిలో ప్రవాహక నష్టాలు పోగా ఏపీకి 81 టీఎంసీలు, తెలంగాణకు 66 టీఎంసీలు, తమిళనాడుకు 83 టీఎంసీల నీటి ప్రతిపాదనలను ఎన్డీడబ్ల్యూ ఏ తీసుకువచ్చింది. ఇచ్చంపల్లి బేసిన్‌ నుంచి 175 టీఎంసీలు తరలించి 66టీఎంసీ లపై హక్కు కల్పిస్తామని ఎన్డీడబ్ల్యూఏ ప్రతిపాదనలు మరోసారి తెలంగాణ జలవిధానానికి గండి కొట్టే విధంగా ఉన్నయని నీటిపారుదల అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇచ్చంపల్లి గోదావరి జలాలపై ఆధారపడి నిర్మిస్తున్న దేవాదుల, సీతారామ, సమ్మక్క బరాజ్‌ లకు నీటి అవసరాలు 158 టీఎంససీలు కావల్సిన నేపథ్యంలో ఇచ్చంపల్లి లోని మిగులు జలాలను నదుల అనుసంధానం పేరుతో తరలించేందుకుచేస్తున్న ప్రయత్నాలను తెలంగాణ తప్పుబడుతుంది. నదుల అనుసంధానం పేరుతో గోదావరి జలాలను తరలిస్తే తెలంగాణ లో నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని జలనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలో ప్రతిపాదిత ప్రాజెక్టులు పూర్తి కాకుండా నీటి తరలింపుసాధ్యం కాదని తెలంగాణ స్పష్టం చేస్తున్నప్పటికీ టాస్క్‌ పోర్స్‌ సమావేశాలు ఏర్పాటు చేయడం ప్రశ్నార్థకంగా మిగిలింది. అయితే ఒకవైపు గంగ, బ్రహ్మపుత్ర మిగులు జాలాలను తరలించే అంశం మరుగునపడగా మరోవైపు గోదావరి నదీ అనుసంధానం తెరమీదికి తీసుకురావడం పట్ల నీటిపారుదల శాఖ విచారం వ్యక్తం చేసింది. ఈ సమావేశంలో తెలంగాణ అభ్యంతరాలను మరోసారి ఎన్డీ డబ్ల్యూ డిఏ ముందు స్పష్టం చేసేందుకు తెలంగాణ సిద్ధమైంది. కృష్ణానదీలో ఏపీతో సమానంగా వాటా తేల్చాలని తెలంగాణ ఒకవైపు డిమాండ్‌ చేస్తుండగా మరోవైపు కేంద్రం రాష్ట్రాని చెందిన గోదావరి జలాలను కృష్ణలో కలిపి కావారి మహా డ్యాంకు తీసుకువెళ్లే ప్రతిపాదనలు చేయడం సమస్యను పక్కదారికి మల్లించడమేనని జలనిపుణులు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement