Sunday, April 28, 2024

తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు

తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. ఈ మేరకు వాతావ‌ర‌ణ కేంద్రం ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పశ్చిమ మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు ఉన్న ఉపరితల ద్రోణి బలహీనపడగా, నైరుతి దిశ నుంచి తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి గాలులు వీస్తున్నాయని తెలిపింది.

ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 27 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసిందని, పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. రాష్ట్రంలో అత్యధికంగా సిద్దిపేట జిల్లా చాట్లపల్లిలో 10 సెంటీ మీటర్ల వర్షం, హన్మకొండ జిల్లా ధర్మసాగర్‌లో 9, వరంగల్ జిల్లా శాయంపేటలో 8, సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో 7, జనగామ జిల్లా నర్మెట్ట, సిద్దిపేట జిల్లా కొండపాక 5 సెంటీమీటర్ల వర్షం కురిసిన‌ట్టు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement