Sunday, April 28, 2024

భారీ వర్షాలను ప్రకృతి విపత్తుగా ప్రకటించాలి.. పేదలకు ఆర్థికసాయమందించాలి

న్యూఢిల్లి, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి : దేశంలో వరుస వర్షాలు బీతావహ పరిస్థితిని సృష్టిస్తున్నాయి. వర్షపు నీరు పట్టణాలు, నగరాల్లో జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రమాదాన్ని పసిగట్టిన ప్రభుత్వాలు ముందస్తుగానే పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. మార్కెట్లు మూసేయమని ఆదేశించాయి. ఇది ఈ దేశంలో 30శాతానికి పైగా ఉన్న రోజువారి కూలీలు, చిరువ్యాపారుల ఉపాధికి తీవ్ర అడ్డంగా మారింది. భారత్‌లో 30శాతానికి పైగా అధికారికంగానే దారిద్య్రరేఖకు దిగువనున్నారు. వీరి రోజువారి సంపాదన రూ.177లు మాత్రమే. అది కూడా పని చేస్తేనే ఆదాయం లభిస్తుంది. లేనిపక్షంలో కుటుంబం మొత్తం పస్తులుండాల్సిందే.

వీరెవరికీ మర్నాటికి స రిపడే సొమ్ము నిల్వ ఉండదు. ఏ రోజుకారోజే సరుకులు తెచ్చుకుని ఆహారాన్ని సమకూర్చుకుంటారు. వీరెవరికీ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పుట్టవు. అలాంటివారంతా ఇప్పుడు అగమ్యగోచర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దేశంలో అక్కడా ఇక్కడా అని లేకుండా ప్రతిచోటా భారీ వర్షాలు కుమ్మరిస్తున్నాయి. దీంతో ఉపాధి లేని వారికి పస్తులు తప్పడం లేదు. జనం ఇళ్ళొదిలి రాకపోవడంతో చిరు వ్యాపారులు కూడా బయటకొచ్చే పరిస్థితిలేదు. వచ్చినా వ్యాపారాలు కొనసాగే అవకాశం లేదు.

- Advertisement -

అలాగే భవన నిర్మాణ కార్మికుల నుంచి రోజువారి కూలీల వరకు ప్రతి ఒక్కరు ఉపాధి కోల్పోయారు. నగరాలు, పట్టణాల్లో ఇప్పుడు మాల్స్‌, సూపర్‌బజార్ల సంస్కృతి పెరిగింది. కిరాణా దుకాణాలు తగ్గాయి. గతంలో వీధుల్లోని దుకాణాలు ఇలాంటి సందర్భాల్లో అరువులిచ్చి ఆదుకునేవి. కానీ ఇప్పుడవి లేకపోవడంతో ఆ విధంగా కూడా ఈ పేదలకు ఆహారం అందుబాటులో లేదు. ఉన్నవాటిలో కొన్ని చిల్లర దుకాణాలు మాత్రం రోజువారి కూలీలకు ఆహార దినుసుల్ని అరువిస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో వీరిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. కోవిడ్‌ సమయంలో ప్రభుత్వం ఉదారంగా ఉచితంగా బియ్యాన్ని సరఫరా చేసింది. అలాగే కొన్ని రాష్ట్రాలు కుటుంబాల వారీగా ఆర్థిక సాయాన్ని కూడా అందించాయి. భారీ వర్షాల్ని ప్రకృతి వైపరీత్యాలుగా పరిగణించి ప్రతి కుటుంబానికి రోజుకు కనీసం ఐదొందల చొప్పునైనా ఆర్థిక సాయాన్ని అందించాలి. ఆ విధంగా వారిని ఆదుకోలేని పక్షంలో ఆకలి మరణాలు సంభవించే ప్రమాదముందని సామాజిక నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement