Tuesday, April 30, 2024

Big story : భద్రాద్రిలో భారీగా గంజాయి పట్టివేత.. రూ.1.18 కోట్ల విలువుంటుంద‌ని అంచనా

భద్రాచలం క్రైం, (ప్రభన్యూస్‌): భద్రాచలంలో ఆదివారం సాయంత్రం భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. సోమవారంనాడు మీడియా సమావేశంలో ఏఎస్పీ రోహిత్‌రాజ్‌ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. భద్రాచలంలోని బ్రిడ్జి రోడ్‌లో గల ఫారెస్టు చెక్‌పోస్టు వద్ద ఆదివారం సాయంత్రం గం.3.30ల సమయంలో ఎస్‌ఐ మధు ప్రసాద్‌, తన సిబ్బంది రామారావు, లక్ష్మణ్‌లతో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో భద్రాచలం నుండి సారపాక వైపు టయోటా ఇన్నోవా(ఏపీ 39సీఏ 0149), మారుతి సుజుకి స్విప్‌ ్ట(ఏపీ 35ఏఎఫ్‌-0378) రెండు కార్లు వెళ్తుండగా ఆయా వాహనాలను ఆపి పోలీసులు తనిఖీ చేశారు. స్విఫ్ట్‌ కారులో ఉన్న ఇరువురు వ్యక్తులు కారు దిగి పారిపోయారు. ఇన్నోవా కారులో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ రెండు కార్లలో రూ.1,18,80,000-ల గంజాయి పట్టుబడింది.

297 ప్యాకెట్లలో ఒక్కొక్క ప్యాకెట్‌లో 2కేజీల చొప్పున 594కేజీల గంజాయి లభించింది. కారులోని వ్యక్తి బూర్గంపాడు మండలం సారపాక తాళ్ళగొమ్మూరుకు చెందిన ములగాడ అన్వేష్‌గా పోలీసులు గుర్తించారు. పారిపోయిన ఇరువురు వ్యక్తులు గడిగట్ల కుమార్‌, పల్లంటి ప్రవీణ్‌లుగా విచారణలో తేలినట్లు ఏఎస్పీ వివరించారు. వీరు ముగ్గురు కలిసి మోతుగూడెం దగ్గరలోని సుకుమామిడి వద్ద రాము, మహేందర్‌ అనే వ్యక్తుల నుండి గంజాయిని తీసుకుని చెన్నైకు చెందిన జయకుమార్‌కు అప్పగించేందుకు వెళ్తున్నట్లు లోతైన విచారణలో తేలినట్లు ఏఎస్పీ వెల్లడించారు. నిందితుడితో పాటు రెండు కార్లు, గంజాయిని స్వాదీనం చేసుకున్నట్లు ఏఎస్పీ వివరించారు. ఈ మేరకు పట్టణ సీఐ నాగరాజురెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వ‌రంగ‌ల్ జిల్లాలోనూ భారీగా పట్టుబడిన గంజాయి , ముగ్గురు అరెస్ట్

వరంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్) : ఆంధ్ర ప్రదేశ్ నుండి ఇతర రాష్ట్రాలకు భారీగా గంజాయిని తరలిస్తున్న ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ , హాసన్ పర్తి పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వీరి నుండి సుమారు 38లక్షల రూపాయల విలువగల గంజాయితో పాటు తరిలిస్తున్న కారు, మోటార్ సైకిల్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లాకి చెందిన పల్లపు రాజు, పల్లపు రాజు 2, బోడ సుమన్ ని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివ‌రాల‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులు ముగ్గురు కూడా నాలుగు సంవత్సరాలుగా భద్రాచలం, డొంకరాయి, సీలేరు, ధారకొండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఒడిశా రాష్ట్రాలలో ట్రాక్టర్ తో భూమిని చదును చేసే పనికి వెళ్తుంటారు. అక్క‌డ భూమి కౌలుకు తీసుకుని గంజాయి సాగుచేసి ర‌వాణా చేస్తున్న‌ట్టు పోలీసుల విచార‌ణ‌లో తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement