Sunday, April 28, 2024

Delhi | ఆర్ 5 జోన్ అంశంపై వచ్చే వారం విచారణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆర్ 5 జోన్‌పై అమరావతి రైతులు దాఖలు చేసిన ఎస్‌ఎల్పీ(స్పెషల్ లీవ్ పిటిషన్)పై సుప్రీంకోర్టు వచ్చే వారం విచారణ జరపనుంది. ఆర్ 5 జోన్‌లో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాల కేటాయింపుపై రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని, రాష్ట్ర ప్రభుత్వ జీవోలను రద్దు చేయాలని రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రైతుల తరఫు న్యాయవాదులు సోమవారం కోర్టు కార్యకలాపాలు  ప్రారంభం కాగానే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసన ముందు ఆర్‌5 జోన్ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

వచ్చే వారం ఈ అంశంపై విచారణ చేపడతామని న్యాయస్థానం వెల్లడించింది. అమరావతి మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవోలు తీసుకొచ్చిందని రైతులు దాఖలు చేసిన మధ్యంతర అప్లికేషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది. కోర్టు తుది ఉత్తర్వులకు లోబడి వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు విముఖత చూపుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.

దీంతో రైతులు సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్పీ దాఖలు చేశారు. గతంలో ఈ అంశంపై హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వలేదని, తగిన ఉత్తర్వులు జారీ చేయాలని సన్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్‌ను వారు వెనక్కి తీసుకున్నారు. హైకోర్టు ఇచ్చే ఉత్తర్వుల ఆధారంగా మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై నేతృత్వంలోని ధర్మాసనం అవకాశం కల్పించింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement