Sunday, April 28, 2024

స్మశానంలోనూ ధరల పట్టిక: కరోనా బాడీకి రూ.5,100

ఇల్లు కాలి ఒకడు ఏడిస్తే.. ఒళ్లు కాలి మరొకడు ఏడ్చాడంట. ప్రస్తుతం కరోనా పరిస్థితులు అలానే ఉన్నాయి. స్మశానాలు కూడా డెడ్ బాడీలను కాల్చడానికి రేట్లు నిర్ణయించాయి. ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా గుంటూరులోని ఓ స్మశానంలో డెడ్ బాడీ కాల్చేందుకు రేట్లతో ఓ బోర్డు ఏర్పాటు చేశారు. కరోనాతో మృతి చెందిన వారికి అంత్యక్రియలు చేయాలంటే రూ. 5,100, సహజ మరణానికైతే రూ. 2,200 చెల్లించాలంటూ పాత గుంటూరు హిందూ శ్మశాన వాటిక గోడలపై రాశారు.

గతంలో సాధారణ మరణానికి గరిష్ఠంగా రూ.1200 వసూలు చేసేవారు. ఇప్పుడు దానికి అదనంగా రూ. 1000 పెంచారు. నగరంలోని ఒక్కో శ్మశాన వాటికలో ఒక్కోలా వసూలు చేస్తున్నారని, అందుకనే శ్మశాన వాటికల పాలకవర్గాలతో చర్చించి ఉన్నతాధికారులు ఈ ధరలు నిర్ణయించినట్టు నగర పాలక కొవిడ్ మరణాల పర్యవేక్షణాధికారి, డిప్యూటీ కమిషనర్ టి.వెంకటకృష్ణయ్య తెలిపారు.

అయితే ఈ విషయంలో నగర పాలక సంస్థకు సంబంధం లేదని కమిషనర్ అనురాధ స్పష్టం చేశారు. ఆయా శ్మశాన వాటికల కమిటీల ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుందని స్పష్టం చేశారు. అనాథ శవాల అంత్యక్రియల బాధ్యత నగరపాలక సంస్థదేనని, ఎవరైనా అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు తప్పవని అనురాధ హెచ్చరించారు. కరోనా మృతుల దహన సంస్కారాలను అవసరమైతే ఉచితంగా చేయాలని ప్రభుత్వం చెబుతుంటే ఇలా ధరలు నిర్ణయించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement