Saturday, May 4, 2024

శ్రీలంకలో పెట్టుబడులకు అదానీ గ్రూప్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

అదానీ గ్రూప్‌కు చెందిన రెండు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్‌లకు శ్రీలంక ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌లపై శ్రీలంకలో అదానీ ఎనర్జీకి 442 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు దీంతో అవకాశం లభించింది. హిండెన్‌బర్గ్‌ నివేదిక తరువాత తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్‌కు ఇది ఊరట కలిగించే అంశమని భావిస్తున్నారు.
అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు భారీగా పతనం కావడంతో కొత్త పెట్టుబడుల విషయంలో అదానీ గ్రూప్‌ అచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటికే కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభించే విషయంలో వెనక్కి తగ్గింది. ప్రస్తుత తరుణంలో కొత్త వాటిని చేపటడడంలేదని, నడుస్తున్నవాటిని పూర్తి చేస్తామని ఇటివలే అదానీ గ్రూప్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో శ్రీలంకలో పెట్టుబడుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

- Advertisement -

శ్రీలంకలోని మన్నార్‌ ప్రాంతం లో 250 మెగావాట్ల సామర్ధ్యంతో పవన విద్యుత్‌ ప్లాంట్‌ను నిర్మించాలని అదానీ గ్రూప్‌ గతంలో నిర్ణయించింది. పూనెరిన్‌లో 100 మెగావాట్ల సామర్ధ్యంతో మరో ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అదానీ ప్రతిపాదనలను పరిశీలించిన శ్రీలంక ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డు అనుమతులు ఇస్తూ లెటర్‌ ఆఫ్‌ అప్రూవల్‌ జారీ చేసింది. 350 మెగావాట్ల విద్యుత్‌ సామర్ధ్యం ఉన్న ఈ రెండు ప్రాజెక్ట్‌లను రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. 2025 నాటికి శ్రీలంక నేషనల్‌ గ్రిడ్‌కు అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌ల వల్ల 2 వేల మంది వరకు ఉపాధి లభిస్తుందని అంచనా. ఈ వారం ప్రారంభంలో శ్రీలంక ఇంధన శాఖ మంత్రి కాంచన విజిశేఖరతో అదానీ గ్రూప్‌ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ రెండు ప్రాజెక్ట్‌లపై చర్చించారు. ప్రస్తుతం అదానీ గ్రూప్‌ శ్రీలంకలోని కోలంబో పోర్టులోని పశ్చిమ కంటైనర్‌ టెర్మినల్‌లో పెట్టుబడులు పెట్టింది.

మీడియాను నియంత్రించలేమన్న సుప్రీం..

అదానీ, హిండెన్‌బర్గ్‌ వ్యవహారంలో కోర్టు తీర్పు వచ్చే వరకు ఈ అంశంపై వార్తలు రాకుండా మీడియాను నిలువరించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఇలాంటి ఆదేశాలు మీడియాకు జారీ చేయలేమని ఈ కేసును విచారిస్తున్న ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం నాడు స్పష్టం చేసింది. షేర్‌ మార్కెట్‌ను కుదిపేసిన హిండెన్‌బర్గ్‌ నివేదిక వివాదం నేపథ్యంలో నియంత్రణ సంస్థలను మరింత బలోపేతం చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. దీనిపై ఒక నిపుణుల కమిటీని వేయాలని కూడా ఆదేశించింది. ఈ నిపుణుల కమిటీలో ఉండే వారి పేర్లతో కేంద్ర ప్రభుత్వం సీల్డ్‌వర్‌ను సుప్రీంకోర్టుకు సమర్పించింది. దీన్ని తిరస్కరించిన కోర్టు తామే నిపుణుల కమిటీని నియమిస్తామని స్పష్టం చేసింది. దీనిపై కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది.

అదానీ- హిండెన్‌బర్గ్‌ వ్యవహారంపై ఇప్పటి వరకు 4 ప్రజాప్రయోజన వాజ్యాలు దాఖలయ్యాయి. వీటిన్నింటినీ కలిపి సుప్రీం ధర్మాసనం విచారిస్తోంది. ఈ విషయంలో సెబీ వాదనలను తోసిపుచ్చిన కోర్టు, లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సంపదన నష్టపోతున్నారని, వారి ప్రయోజనా పరిరక్షణకు, భవిష్యత్‌లో ఇలాంటివి మళ్లిd జరగకుండా ఉండేందుకు నిపుణుల కమిటీ నియమించాలని సుప్రీం సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement