Friday, April 26, 2024

బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్.. తాజాగా గ్రీన్ ఫంగస్

కరోనా సెకండ్ వేవ్ నుంచి మనదేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కానీ అంతలోనే కొత్త కొత్త ఫంగస్‌లు జనాలను భయపెడుతున్నాయి. ఇప్పటికే బ్లాక్, వైట్, యెల్లో ఫంగస్ కేసులు నమోదవగా.. తాజాగా గ్రీన్ ఫంగస్ కూడా వెలుగులోకి వచ్చింది. భారత్‌లో మొట్ట మొదటి గ్రీన్ ఫంగస్ కేసు మధ్యప్రదేశ్‌లో నమోదయింది. ఇండోర్‌లోని శ్రీ అరబింద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రిలో ఈ ఫంగస్ ఇన్‌ఫెక్షన్‌ను ఛాతీ వ్యాధుల విభాగాధిపతి డాక్టర్ రవి దోసి గుర్తించారు. ఇటీవలే కోవిడ్ నుంచి కోలుకున్న ఓ వ్యక్తికి గ్రీన్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్ సోకింది.

34 ఏళ్ల ఓ వ్యక్తికి రెండు నెలల తర్వాత కరోనా నుంచి కోలుకున్నాడు. ఐతే ఇటీవల అతడి ముక్కు నుంచి రక్తం కారింది. జ్వరం కూడా ఎక్కువగా ఉంది. బ్లాక్ ఫంగస్ సోకిందేమోనని డాక్టర్లు అనుకున్నారు. పరీక్షలు చేయగా ఊపిరితిత్తుల్లో గ్రీన్ ఫంగస్ ఉన్నట్లు తేలింది. గ్రీన్ ఫంగస్ కారణంగా అతడి ఊపిరితిత్తులు, సైనసెస్ భాగాలు బాగా దెబ్బతిన్నాయని డాక్టర్ రవి దోసి తెలిపారు. అతడిలో బ్లడ్ ఇన్‌ఫెక్షన్ కూడా ఉందని చెప్పారు. గ్రీన్ ఫంగస్ బారినపడిన వ్యక్తిని అత్యవసర చికిత్స కోసం ఇండోర్ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేశారు. ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రీన్ ఫంగస్.. ఒకరమైన ఆస్పెర్‌గిలోసిస్ ఇన్‌ఫెక్షన్. కరోనా లాగే ఇది కూడా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. మనుషుల్లో చాలా అరుదుగా ఇలాంటి ఇన్‌ఫెక్షన్ వస్తుందని డాక్టర్లు తెలిపారు. ఈ వ్యాధిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement