Monday, April 29, 2024

రైతుల‌కు పసిడి పంట, అమాంతం ఎగబాకిన ఎర్ర బంగారం ధర.. క్వింటాలుకు రూ.80వేల

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: అమాంతం పెరిగిన ఎర్ర బంగారం ధర రైతుల్లో ఆనందోత్సాహాలు నింపుతోంది. రికార్డు స్థాయిలో క్వింటాలు మిర్చి ధర రూ.80వేల నుంచి రూ.90 వేల వరకు పలికింది. వరంగల్‌ జిల్లా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో కేవలం గంట వ్యవధిలో 3వేల బస్తాలు అమ్మకం జరిగింది. మార్కెట్లో దేశీయ కొత్త మిర్చి రికార్డు సృష్టించింది. ప్రారంభంలోనే క్వింటాలుకు రూ.80,100 లు పలికింది. ఈ సందర్భంగా మార్కెట్‌ యార్డు కార్యదర్శి రాహుల్‌ మాట్లాడుతూ, మార్కెట్‌ చరిత్రలోనే ఇప్పటి వరకు కొత్త మిర్చికి ఈ ధర పలకలేదని అన్నారు. రైతులు ఇంత వరకు కూడా మిర్చీని మార్కెట్‌కు తక్కువ మోతాదులో తీసుకొని వస్తున్నారని.. ఆరబెట్టిన మిర్చిని మాత్రమే తీసుకొని రావాలని అని తెలిపారు. గంటన్నరలోపే 3 వేల రూపాయల బస్తాలను వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

తద్వారా చరిత్రలోనే కాదు రికార్డు ధరతో, అమ్మకాలతో దేశీయంగా రికార్డు నెలకొల్పిందని వ్యాపారులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లా రైతు నాలుగు బస్తాలు కొత్త దేశీ మిర్చి తీసుకొచ్చాడని దానికి 80,000 పై చిలుకు ధర పలికిందని పేర్కొన్నారు. తేమ శాతం తక్కువ ఉన్న మిర్చీని రైతులు తీసుకొని వచ్చి అధిక ధర పొందగలరని ఆయన కోరారు. హనుమకొండ జిల్లా పరకాల మండలానికి చెందిన ఓ రైతు తన పంటను క్వింటాకు రూ.90 వేలకు చొప్పున అమ్మాడు. ఇదే ఇప్పటి వరకు రికార్డ్‌ ధర అని అధికారులు తెలిపారు. ఇంతటి ధర పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశీ రకానికి డిమాండ్‌ పెరగడం, ఆఫ్‌ సీజన్‌ కావడంతో ఈ రేటు- వచ్చిందని అధికారులు చెప్తున్నారు. లక్షకు చేరువలో మిర్చి ధర పలకడంతో మిర్చి రైతులు సంతోషంగా ఉన్నారు.

రెండు వారాల క్రితం మిర్చి ధర క్వింటా రూ.65 వేలు పలికింది. దేశీ మిర్చికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్‌ ఉండడంతో ధర అమాంతం పెరిగింది. ఈ మిర్చిని పచ్చళ్లలో అధికంగా వినియోగిస్తారు. గతేడాది అకాల వర్షాలతో ఎండు మిర్చి దిగుబడులు తగ్గాయి. తెగుళ్లు కూడా మిర్చి పంటపై తీవ్ర ప్రభావం చూపాయి. ఏడాదికి 25, 30 క్వింటాళ్లు వచ్చే దిగుబడి కేవలం 10 నుంచి 15 క్వింటాళ్లు వచ్చాయి. దీంతో మార్కెట్లో మిర్చి స్లప తగ్గిపోయింది. దీంతో రైతులు కాస్త మంచి ధరకే పంటను అమ్ముకున్నా దిగుబడి తగ్గిపోవడంతో నష్టాలు తప్పలేదు. మంచి ధరకోసం పంటను కోల్డ్‌ స్టోరేజీలలో దాచుకున్న రైతుల పంట పడింది. తాజాగా మంచి రేటు- పలకడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement