Thursday, April 18, 2024

పెట్రోల్‌పై లాభం.. డీజిల్‌ పై నష్టం

చమురు విక్రయ సంస్థలు లీటర్‌ పెెట్రోల్‌ పై ప్రస్తుతం 10 రూపాయల లాభం పొందుతున్నాయన ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ నివేదిక తెలిపింది. డీజిల్‌ అమ్మకాలపై లీగర్‌కు 6.50 రూపాయల నష్టాన్ని భరిస్తున్నాయి. పెట్రోల్‌పై లాభం వస్తున్నప్పటికీ, రిటైల్‌ ధరల్ని మాత్రం కంపెనీలు తగ్గించడంలేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చిన నష్టాలను, ప్రస్తుతం వస్తున్న లాభాలతో భర్తీ చేసుకోవడానికే కంపెనీలు ధరల్ని తగ్గించడం లేదని నివేదిక తెలిపింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌) హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) 15 నెలలుగా అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోల్‌, డీజిల్‌ రిటైల్‌ ధరలకు అనుగుణంగా సవరించడంలేదు. ఈ కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బాగా తగ్గిన సందర్భాలు ఉన్నాయి. 2022 జూన్‌ 24తో ముగిసిన వారంలో కంపెనీలు లీటర్‌ పెట్రోల్‌పై 17.4 రూపాయలు, డీజిల్‌పై లీటర్‌కు 27.7 రూపాయల నష్టాన్ని ఎదుర్కొన్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ నివేదిక తెలిపింది.

తరువాత కాలంలో అంతర్జాతీయ మార్కెట్‌లో రేట్లు క్రమంగా తగ్గాయి. అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో లీటర్‌ పెట్రోల్‌పై 10 రూపాయల లాభాన్ని ఆర్జించినట్లు ఈ నివేదిక వెల్లడించింది. లీటర్‌ డీజిల్‌పై నష్టం కూడా లీటర్‌కు 6.5 రూపాయలకు తగ్గినట్లు తెలిపింది. ఈ మూడు చమురు కంపెనీలు 2022 ఏప్రిల్‌ 6 నుంచి ధరలను సవవరించడం నిలిపివేశాయి. అదే నెలో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ చమురు ధర 102.97 డాలర్ల నుంచి 116.01 డాలర్లకు పెరిగింది. జూన్‌ నాటికి ఇది 78.09 డాలర్లకు పడిపోయింది. చమురు రేట్లు గరిష్టానికి చేరుకున్నప్పటికీ, దేశీయంగా కంపెనీలు రేట్లను సవరించకపోవడంతో భారీగా నష్టాలు వచ్చాయి. ఏప్రిల్‌- సెప్టెంబర్‌ త్రైమాసికంలో మూడు కంపెనీలు

కలిపి 21,201.18 కోట్ల రూపాయల నష్టాలను ఎదుర్కొన్నాయి. ప్రభుత్వం ఈ కంపెనీలకు 22 వేల కోట్ల ఆర్ధిక సాయం అందించింది. అయినప్పటికీ ఈ నష్టాలు నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు గత కొన్నేళ్లుగా తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. 2020 లో కరోనా వ్యాప్తి తీవ్రమైన సమయంలో ధరలు భారీగా పడిపోయాయి. 2022లో తిరిగి వాణిజ్య కార్యకలాపాలు పుంజుకోవడం, రష్య-ఉక్రెయిన్‌ యుద్ధంతో మళ్లి వీటి ధరలు పెరుగుతూ వచ్చాయి. మార్చి నెలలో బ్యారెల్‌కు 140 డాలర్లకు, 14 సంవత్సరాల గరిష్టానికి చేరాయి. చమురును భారీగా దిగుమతి చేసుకునే చైనాలో గిరాకీ మందగించడంతో ఎగువ స్థాయిల నుంచి మళ్లి చమురు ధరలు తగ్గాయి. మన దేశ చమురు అవసరాల్లో 85 శాతానికిపైగా దిగుమతులపైనే ఆధారపడుతున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement