Thursday, May 2, 2024

Delhi | ధరణిపై సర్కారు పలాయనం.. కేసీఆర్ పాలనపై కిషన్ రెడ్డి ధ్వజం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణలో వివాదాస్పదమైన ‘ధరణి’ పోర్టల్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం పలాయనవాదం అనుసరిస్తోందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. తమ తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం ప్రైవేట్ కంపెనీపై నెపం నెడుతున్నారని, ఈ తప్పులను ప్రశ్నించేవారిపై అప్రజాస్వామికంగా, నిరంకుశంగా అణచివేత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లండన్ పర్యటనలో ఉన్న కిషన్ రెడ్డి సోమవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు.

ప్రభుత్వ తప్పిదాలను ప్రసారం చేస్తున్న మీడియా సంస్థలపై కేసులు పెట్టి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అధికారం కోసం ఎంతకైనా తెగించడం, తమను ఎదిరించేవారిని అధపాతాళానికి తొక్కేయడం లక్ష్యంగా కేసీఆర్ సర్కారు పనిచేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు భరోసా కల్పించకుండా.. కల్వకుంట్ల కుటుంబం అహంకారపూరితంగా వ్యవహరిస్తుండటంతో.. ధరణి వంటి సమస్యలు మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయని అన్నారు.

- Advertisement -

వివాదాస్పదమైన ‘ధరణి’ అంశంలో తమకు ఏ తప్పు తెలియదని చేతులు కడుక్కున్న చందంగా కేసీఆర్ ఈ అంశంపై ఓ ఆంగ్ల దినపత్రికలో ప్రైవేట్ కంపెనీ ద్వారా ప్రకటనలు ఇప్పించారని మండిపడ్డారు. ధరణి కారణంగా తెలంగాణ ప్రజలు, మరీ ముఖ్యంగా 75 లక్షల మంది రైతులు.. తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు, ప్రజలు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులను కబ్జా చేసుకుంటున్న వారి నుంచి భరోసా కల్పించాల్సింది పోయి.. తన అసమర్థతను మరోసారి చాటుకుంటున్నారని ధ్వజమెత్తారు. మారుతున్న సాంకేతికత నేపథ్యంలో.. డేటా ప్రైవసీ (గోప్యత) ఓ కీలకమైన అంశంగా ఉంని, అయితే.. ప్రభుత్వ వెబ్‌సైట్‌‌లకు, ప్రభుత్వ సంబంధిత అంశాలకు సంబంధించిన డేటా విషయంలో.. సంపూర్ణ బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు.

వీటి విషయంలో ఎదురయ్యే ఏ సమస్యకైనా ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ధరణి విషయంలోనూ డేటా సంబంధిత విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని అన్నారు. కానీ ప్రభుత్వం ప్రజల సమస్యలు, రైతుల ఆందోళనలను పట్టించుకోకుండా.. పాత సమస్యలను తీర్చాల్సిందిపోయి.. కొత్త సమస్యలను సృష్టించిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల కారణంగా.. కలెక్టర్లపైనా అదనపు భారం పడిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఓవైపు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం ‘స్వమిత్వ యోజన’ ద్వారా పేదలకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు లేకుండా ఆస్తి ధృవీకరణ పత్రాలను, టైటిల్ డీడ్‌లను అందజేస్తోందని గుర్తుచేశారు. అదే సమయంలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం వైఫల్యాలను చవిచూస్తూ.. ప్రజల సమస్యలు పరిష్కరించకపోగా.. మరిన్ని ఇబ్బందుల పాలుచేస్తోందని విమర్శించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement