Monday, April 29, 2024

రోడ్డు మీద ఉమ్మితే.. జరిమానా తప్పదు

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే ఫైన్​వేసేందుకు బల్దియా అధికారులు సిద్ధమయ్యారు. కరోనా నియంత్రణలో భాగంగా జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్​ ఓ సర్క్యూలర్ జారీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నేరమని జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేశారు. కరోనా వైరస్ ఎక్కువ ఉమ్మి లేదా నోటి నుంచి వచ్చే స్రావాల ద్వారా సోకుతుందని, ఇది తెలిసినా ప్రజలు అప్రమత్తం కాకపోవడంతో సెక్షన్ 51- 60, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కింద ఉమ్మి వేసినవారికి రూ.1000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. జరిమానా విధించని పక్షంలో ఐపీసీ సెక్షన్ 189 ప్రకారం అరెస్టు చేసి శిక్షిస్తామని ఆదేశాల్లో పేర్కొన్నారు.

అటు ఆఫీసుతో పాటు, పబ్లిక్ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్​ ధరించాలని అడిషనల్ కమిషనర్లు, హెచ్​వోడీలు, జోనల్, డిప్యూటీ కమిషనర్లను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో కనీసం రెండు గజాల దూరాన్ని పాటించేలా చూడాలని సూచించారు. ఆఫీసులు, సెక్షన్లలో విజిటర్లను నియంత్రించాలని, ప్రవేశ ప్రాంతాల్లో థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. లిఫ్టుల వినియోగాన్ని సాధ్యమైనంత తగ్గించాలన్నారు. ఎమర్జెన్సీ మినహా ఫైళ్లన్నింటిని ఈ -ఆఫీస్ ద్వారానే పంపించాలన్నారు. ఎయిర్ కండీషన్లు, కూలర్ల వినియోగాన్ని తగ్గించాలని ఆ సర్క్యూలర్​లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement