Tuesday, May 7, 2024

పది రోజుల పాటు ఉచితంగా గాంధీ చిత్ర ప్రదర్శన.. 582 థియేటర్లలో ఏర్పాట్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా ఈ నెల 14 నుంచి 24వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో ఉచితంగా గాంధీ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చెప్పారు. బుధవారం ఇక్కడి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయంలో చిత్ర ప్రదర్శనకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విద్యార్థుల్లో జాతీయ స్ఫూర్తిని చాటే విధంగా రాష్ట్రంలోని 582 స్క్రీన్‌లలో గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తున్నామని పేర్కొన్నారు.

విద్యార్థులను థియేటర్ల వద్దకు ఉచితంగా తీసుకొచ్చి, క్షేమంగా వారి గమ్యస్థానాలకు తీసుకెళ్లే విధంగా థియేటర్ల నిర్వాహకులు, విద్యాశాఖ, రవాణా శాఖ తదితర శాఖలకు చెందిన అధికారులతో సమన్వయం చేసుకొంటూ ఏర్పాట్లను పర్యవేక్షించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వజ్రోత్సవాల ప్రారంభ సమయంలో కూడా గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించగా లక్షలాది మంది విద్యార్థులు వీక్షించారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో ఎఫ్‌డిసి చైర్మన్‌ అనిల్‌ కుమార్‌ కూర్మాచలం, తెలంగాణ స్టేట్‌ ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు సునీల్‌ నారంగ్‌, కార్యదర్శి అనుపమ్‌ రెడ్డి, తెలుగు ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు దిల్‌ రాజు, కార్యదర్శి దామోదర్‌ ప్రసాద్‌, హోం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్‌, ఎఫ్‌డీసీ ఎండీ అశోక్‌ రెడ్డి, న్యాయశాఖ అదనపు కార్యదర్శి మన్నన్‌, ఎఫ్‌డిసి ఈడీ కిశోర్‌ బాబు, పివిఆర్‌ ప్రతినిధులు శ్రీనివాస్‌, సాయిరఘురామ్‌, ప్రదీప్‌, సందీప్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement