Thursday, May 2, 2024

కరోనాతో మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కన్నుమూత

ఉమ్మడి ఏపీ మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కరోనాతో మంగళవారం ఉదయం కన్నుమూశారు. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, చంద్రబాబు వద్ద ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ఆయన కుటుంబం మొత్తం కరోనా బారినపడింది. దీంతో వారంతా హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చేరారు. ప్రసాద్ పెద్ద కుమారుడు ఐసీయూలో చికిత్స పొందుతుండగా, చిన్న కుమారుడు కోలుకుంటున్నాడు. ప్రసాద్ దంపతుల ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు ఇటీవల తెలిపాయి. పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం ఆయన కన్నుమూశారు. ప్రసాద్ భార్య పరిస్థితి కూడా విషమంగానే ఉందని సమాచారం.

1975 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ప్రసాద్ నెల్లూరు జిల్లా సబ్ కలెక్టర్‌గా కెరియర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత కడప, విశాఖపట్టణం జిల్లాల కలెక్టర్‌గానూ పనిచేశారు. అనంతరం పలు ప్రభుత్వ విభాగాలకు చైర్మన్‌గా, కార్యదర్శిగా, ముఖ్యకార్యదర్శిగా పనిచేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయికి చేరుకున్నారు. రోశయ్య హయాంలో సీఎస్‌గా పనిచేశారు. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement