Sunday, April 28, 2024

కమల దళంలో మాజీ ముఖ్యమంత్రి.. కాషాయ కండువా కప్పుకున్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఎంతో కష్టపడి, ఒడిదుడుకులను ఎదుర్కొని భారతీయ జనతా పార్టీ నేడు ఉన్నత స్థానానికి చేరుకుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకున్నారు. రాజ్యసభ సభ్యులు, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డా.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర-కేంద్ర వ్యవహారాల సమన్వయకర్త బాల్‌రాజ్ నూనె ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ముందుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. 1962 నుంచి తమ కుటుంబానికి కాంగ్రెస్‌తో అనుబంధం ఉందని, రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న తన తండ్రి చాలా చిన్న వయసులోనే చనిపోయారని గుర్తు చేసుకున్నారు.

ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రంలో కాంగ్రెస్ తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతోందని, ఎవరి సలహాలు తీసుకోవడం లేదని చెప్పుకొచ్చారు. అజమాయిషీ తప్ప బాధ్యత వద్దు అన్నట్టుగా అక్కడ పరిస్థితి ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీకి రెండోసారి రాజీనామా చేశానని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో రాజీనామా చేశానని, పార్టీని బలోపేతం చేద్దామనుకుని మళ్లీ కాంగ్రెస్‌లో చేరినా ఆ పరిస్థితి కనిపించలేదని ఆయన పెదవి విరిచారు. వైద్యుడి దగ్గరకు వెళ్లి టెస్టులు వద్దు, మందులు వద్దు అన్నట్టుగా కాంగ్రెస్ పని చేస్తోందని విమర్శించారు. ప్రజలు ఎందుకు బీజేపీని కోరుకుంటున్నారనేది కాంగ్రెస్ ఆలోచించడం లేదన్నారు. ఎవరు ఏ పని బాగా చేయగలరో ఆ పని అప్పగించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఓడిపోయిన వారు దానికి కారణమేంటో తెలుసుకుని, తప్పొప్పులను విశ్లేషించుకోవాలన్న కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లో అది జరగడం లేదని ఆరోపించారు.

ప్రజా తీర్పును కాంగ్రెస్ ఒప్పుకోలేకపోయిందని, ఓటు వేస్తున్న ప్రజలదే తప్పన్నట్టు, తమది ఏ తప్పూ లేదన్నట్టుగా ఆ పార్టీ వ్యవహరిస్తోందని విమర్శించారు. తాను పార్టీ వీడడానికి అదే ప్రధాన కారణమని కిరణ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక బీజేపీ గురించి మాట్లాడాల్సి వేస్తే నేషన్ బిల్డింగ్, అభివృద్ధి అనేదే గుర్తుకొస్తుందని చెప్పారు. 2 సీట్ల నుంచి బీజేపీ 303 సీట్లకు చేరుకుందని, ఎంతో శ్రమ, నిబద్దత వల్లే ఈ స్థాయికి వచ్చిందని కొనియాడారు. పార్టీలో, ప్రభుత్వంలో క్లారిటీ ఉందని, పేదలకు సేవ చేయడం, దేశానికి సేవ చేయడం అన్నట్టుగా బీజేపీ పని చేస్తోందని నొక్కి చెప్పారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం బీజేపీ – మోడీ సర్కారుకు ప్రామాణికంగా మారిందని అన్నారు. దేశం కోసం, యువత కోసం, పేదల కోసం అన్న నినాదంతో పార్టీ ముందుకెళ్తోందని వివరించారు. ప్రతి చోటా విజయం సాధించాలి అనే తపనతో బీజేపీ పనిచేస్తోందని అన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు, నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నారని, కొన్ని సమావేశాల్లో ఆయనను కలిశానని, అప్పటి నుంచే మోదీ అవినీతికి వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చారని గుర్తు చేసుకున్నారు.

- Advertisement -

కాంగ్రెస్‌లో ఇన్నింగ్స్-బీజేపీలో సూపర్ బ్యాటింగ్

దక్షిణ భారతదేశంలోని విశిష్ట నేత కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఆయనకు సాదర స్వాగతం పలుకుతున్నానని చెప్పారు. కిరణ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో ఏపీలో బీజేపీ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబంలో 3 తరాలు కాంగ్రెస్‌లో ఉన్నారని, ఆయన తండ్రి అమర్‌నాథ్‌రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే, మంత్రిగా పని చేశారని తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి 4 సార్లు ఎమ్మెల్యే, స్పీకర్, చీఫ్ విప్‌తో పాటు కీలక సమయంలో సీఎంగా పని చేశారని ప్రహ్లాద్ జోషి వివరించారు.

ఆయన మంచి క్రికెటర్ అని, రంజీ మ్యాచ్‌లు ఆడారని కేంద్రమంత్రి గుర్తు చేశారు. కాంగ్రెస్‌లో ఇన్నింగ్స్ ప్రారంభించిన కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీలో సూపర్ బ్యాటింగ్ చేస్తారని చమత్కరించారు. అవినీతిపై మోదీ సర్కార్ చేస్తున్న కార్యక్రమాలకు ఆయన ఆకర్షితుడై పార్టీలో చేరారని చెప్పుకొచ్చారు. ఒకసారి విమానాశ్రయంలో కలిసినప్పుడు ఈ విషయం తనతో చెప్పారని, మీలాంటి వారు మా పార్టీలో ఉండాలని తాను అప్పుడే అన్నానని ఆయన పేర్కొన్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి తమ పార్టీకి చాలా పెద్ద బలమని, ఆయన చేరిక ఏపీలో బిగ్ బూస్ట్ అవుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రాజకీయాల్లో కూడా పార్టీకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని ప్రహ్లాద్ జోషి అభిప్రాయపడ్డారు.

జేపీ నడ్డాతో భేటీ

సాయంత్రం ఆరు గంటల సమయంలో కిరణ్‌కుమార్ రెడ్డి, విష్ణువర్థన్ రెడ్డితో కలిసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసానికి చేరుకున్నారు. పార్టీలో చేరిన నేపథ్యంలో మర్యాదపూర్వకంగా ఆయనతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.

మాజీ సీఎంను బీజేపీ గూటికి రప్పించిందెవరు?

కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్ర విభజన జరిగింది. అధిష్టానంతో విభేదించి పార్టీకి రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమం చేపట్టారు. ఆ తర్వాత ఆయన మళ్లీ పార్టీలో చేరినా గతంలో మాదిరిగా చురుగ్గా పని చేయలేకపోయారు. చాలా ఏళ్ల విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామాతో ఈమధ్య మళ్లీ వార్తల్లోకెక్కారు. కిరణ్‌కుమార్ బీజేపీలో చేరతారని అప్పట్నుంచే ప్రచారం మొదలైనా… ఆయనను కమల దళంలో చేర్చడంలో కీలక పాత్ర పోషించింది మాత్రం ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి. ఈ ఇద్దరూ రాయలసీమకు చెందిన వారే. కిరణ్‌కుమార్ రెడ్డి చేపట్టిన సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న విష్ణువర్థన్‌రెడ్డి ఆయనకు సన్నిహితులయ్యారు. అప్పట్నుంచి  వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి.

గతంలో నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఉపాధ్యక్షుడిగా పని చేసిన విష్ణువర్థన్ రెడ్డికి జాతీయ నేతలతోనూ మంచి పరిచయాలున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి వంటి నిజాయితీ, నిబద్దత, సబ్జెక్ట్ కలిగిన సీనియర్ నాయకుడు బీజేపీకి బలం అవుతారని విష్ణువర్థన్‌రెడ్డి భావించారు. ఆయనతో పలుమార్లు భేటీ అయ్యి బీజేపీలో చేరితే కలిగే ప్రయోజనాలపై చర్చించారు. మరోవైపు బీజేపీ అధిష్టానంతోనూ ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూనే ఉన్నారు. మొత్తం మీద ఇరువైపులా ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించి కిరణ్‌కుమార్ రెడ్డి కమలదళంలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి, సమైక్యాంధ్ర ఉద్యమ నేత కిరణ్ కుమార్ రెడ్డి చేరిక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పార్టీకి బలంగా మారుతుందని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement