Saturday, May 11, 2024

Followup: బీసీసీఐకి కాసుల పంట, ప్రసార హక్కుల ఆదాయం 48,390కోట్లు

భారత క్రీడాచరిత్రలో రికార్డు స్థాయిలో ఆదాయం లభించిన ఘట్టం మంగళవారం ఆవిష్కృతమైంది. ప్రత్యేకించి 2023-27 మధ్య కాలంలో క్రికెట్‌ (ఐపీఎల్‌) ప్రసార హక్కుల వేలంలో ఎన్నడూ లేని రీతిలో రూ.48, 390 కోట్ల మేర ఆదాయం సమకూరినట్లు బీసీసీఐ సెక్రటరీ జయ్‌ షా మంగళవారం ప్రకటించారు. ఇది భారత క్రీడారంగ చరిత్రలో అత్యధిక మొత్తమని వెల్లడించారు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రసార హక్కులను నాలుగు కేటగిరీలుగా విభజించి వేలం వేశారు. ఆదాయంలో ఇప్పటికే రికార్డులు సృష్టించిన ఐపీఎల్‌ ఇప్పుడు తన రికార్డును తానే బద్దలు కొట్టింది. 2023-27 మధ్య కాలంలో ఐపీఎల్‌ ప్రసార హక్కులకు వేలం ప్రక్రియను ముంబైలో మూడు రోజులుగా నిర్వహించారు. ఆ వివరాలను జై షా మంగళవారం ప్రకటించారు. ప్రఖ్యాత చానల్‌ డిస్నీ స్టార్‌ స్పోర్ట్స్‌ ఐపీఎల్‌ టీవీ ప్రసార హక్కులను 23,575 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక ఐపీఎల్‌ డిజిటల్‌ ప్రసార హక్కులను వయాకామ్‌ 18 సంస్థ రూ. 23,758 కోట్లకు కైవసం చేసుకుంది. 2018-22 సీజన్‌ ప్రసార హక్కుల ఆదాయంతో పోలిస్తే ఇప్పుడు మూడురెట్లు అధికంగా వచ్చింది. అయితే డిజిటల్‌ హక్కుల ఆదాయంలో ఏకంగా 12 రెట్లు పెరుగుదల నమోదైంది. అప్పట్లో రూ.16,347.50 కోట్లు ఆదాయం రాగా ఇప్పుడు ఏకంగా రూ.48,390 కోట్లు వసూలైంది. ఇప్పటికీ అత్యంత సంపన్న క్రికెట్‌ బోర్డుగా బీసీసీఐకు పేరుంది. ఐపీఎల్‌ క్రికెట్‌ విధానం అందుబాటులోకి వచ్చాక బీసీసీఐ ఆర్థికంగా మరింత బలీయంగా తయారైంది. ప్రస్తుతం డిజిటల్‌ సాంకేతికతే ప్రపంచాన్ని శాసిస్తోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ డిజిటల్‌ ప్రసార హక్కులను భారీ మొత్తంతో వయాకామ్‌ – 18 పొందింది. భారత ఉపఖండంలో ఒక్కో మ్యాచ్‌కు రూ. 50 కోట్ల చెప్పున చెల్లించి ప్రసారం చేసేందుకు హక్కులు పొందింది. ఇక భారత ఉపఖండంలో 410 మ్యాచ్‌ల టీవీ ప్రసార హక్కును స్టార్‌ స్ప్రోర్ట్స్‌ పొందింది. సగటున ఒక్కో మ్యాచ్‌కు రూ.57.4 కోట్ల చొప్పున చెల్లించి ఐదేళ్ల పాటు ఐపీఎల్‌ మ్యాచ్‌లను ప్రసారం చేసే హక్కును పొందింది. ఇక విదేశాల్లో టీవీ, డిజిటల్‌ ప్రసారాలకు సంబంధించిన బిడ్‌ను వయాకామ్‌ 18, టైమ్స్‌ ఇంటర్నెట్‌ కైవసం చేసుకున్నాయి. ఆస్ట్రేలియా, సౌత్‌ ఆఫ్రికా, యూకే ప్రాంతాల్లో వయాకామ్‌- 18, యూఎస్‌, ఎమ్‌ఈఎన్‌ఏ రీజియన్లలో టైమ్స్‌ ఇంటర్నెట్‌ డిజిటల్‌ ప్రసార హక్కులు సాధించాయి.

దేశవాళీ క్రికెట్‌కు ప్రాధాన్యం : జై షా

ఐపీఎల్‌ ప్రసార హక్కుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని దేశవాళీ క్రికెట్‌ అభివృద్ధికి వెచ్చిస్తామని బీసీసీఐ సెక్రటరీ జై షా ప్రకటించారు. ప్రధానంగా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన భారతీయ క్రికెట్‌ వసతులను మరింత అభివృద్ధి చేస్తామని, క్రికెట్‌ వీక్షకులు మరింత సంతోషంగా మ్యాచ్‌లను చూసే వీలు కల్పిస్తామని, ఈ విషయంలో ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు, క్రికెట్‌ అసోషియేషన్‌లు కలసి రావాలని పిలుపునిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement