Tuesday, May 28, 2024

VIZAG: ఎన్నికల నేపథ్యంలో సొంతూళ్లకు తరలి వెళ్తున్న జనం

రద్దీగా మారిన రైళ్లు, బస్సులు
ప్రత్యేక బస్సులతో పాటు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్న అధికారులు !
హైవే పై కనిపిస్తున్న వాహనాల రద్దీ
టోల్ ప్లాజాలు వద్ద బారులు తీరిన వాహనాలు
మళ్ళీ మొదలైన పల్లెల్లో పండగ వాతావరణం

విశాఖ సిటీ, ప్రభ న్యూస్ : ఎన్నికల నేపథ్యంలో విశాఖ నుంచి తమ సొంతూళ్లకు వేలాదిగా జనం తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో బస్సులన్నీ జనంతో నిండిపోయి కనిపిస్తున్నాయి. అలాగే రైళ్లు కూడా కిటకిటలాడుతున్నాయి. చాలామందికి రిజర్వేషన్ దొరక్క‌పోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దీనిని తమకు అనుకూలంగా మార్చుకొని ప్రైవేటు వాహన యజమానులు జనం నుంచి భారీగా వసూలు చేస్తున్నారు.

కొందరు తమ సొంత వాహనాలతో బయలుదేరుతున్నారు. మరికొందరు ఇక తప్పనిసరి అని భావించి ప్రైవేట్ వాహనాల్ని ఆశ్రయిస్తున్నారు.రహదారులన్నీ కూడా రద్దీగా మారాయి. ముఖ్యంగా హైవే పై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. విశాఖలో ఉపాధి కోసం వలస వచ్చిన వారు అలాగే ఇక్కడ చదువుకుంటున్న కొందరు ఇతర ప్రాంత విద్యార్థులు తప్పనిసరిగా తమ సొంత ఊరిలో ఓటు వినియోగించుకునేందుకు శనివారం ఇక్కడి నుంచి బయలుదేరారు. వీకెండ్ కావడంతో ఒకరోజు ముందే తమ సొంతూళ్లకు ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటి వరకు నాయకులు, రాజకీయ పార్టీల మధ్య ఎన్నికల ప్రచారం హడావిడి కనిపించింది. అయితే శనివారం సాయంత్రం 6 గంటలతో ప్రచారానికి తెరపడనుంది.

ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త సందడి నెలకొంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తమ నియోజకవర్గాలకు పయనమయ్యారు. దీంతో విశాఖ నగరం ఎటు చూసినా బస్ స్టాపులు, రైల్వే స్టేషన్ల వద్ద బ్యాగులు పట్టుకుని యువత దర్శనమిస్తున్నారు. అటు విశాఖ నుండి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలు ప్రాంతాలకు వెళ్ళేందుకు రైల్వేస్టేషన్లలో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఏపీకి వెళ్లే రైళ్ల దగ్గర జనజాతర కనిపిస్తోంది. ఇప్పటికే బస్సులన్నీ రిజర్వేషన్ అయిపోవడంతో ఖాళీ ఎక్కడా దొరక్క ట్రైన్స్‌కు వెళ్తున్నారు జనం. రైలులో సీటు కోసం ఆరాటపడుతున్నారు. ఏపీకి వెళ్లే రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు రైల్వే అధికారులు. అలాగే విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వరకు అదనంగా పలు రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది!

- Advertisement -

ఇదిలా ఉంటే కొందరు తమ సొంత వాహనాల్లో పెద్ద ఎత్తున ఊర్లకు తరలివెళ్తున్నారు. దీంతో ఆగనంపూడి, నక్కపల్లి, రాజమండ్రి, విజయవాడ-హైదరాబాద్ హైవేపై వాహనాల రద్దీ కనిపిస్తోంది. వీకెండ్, ఓట్ల జాతర రెండూ కలిసి రావడంతో ఉదయం నుంచే భారీగా వెళ్తున్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదే అదనుగా భావించి కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ పెద్ద ఎత్తున టికెట్ ధరలను పెంచేశాయి. దీనిపై ట్రాన్స్ పోర్ట్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు విజ్ఙప్తి చేస్తున్నారు. అయితే ఆర్టీసీ బస్సు సర్వీసులు పరిమితంగా ఉన్నప్పటికీ ఎన్నికల కోసం మరిన్ని బస్సులు అందుబాటులో ఉంచుతామని చెబుతోంది ఆర్టీసీ. అవసరానికి అనుగుణంగా బస్సు సర్వీసులను అందుబాటులో ఉంచుతామని, ప్రయాణికులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదంటున్నారు ఆర్టీసీ అధికారులు. పెద్ద ఎత్తున రద్దీగా ఉండే నగరాలు ఓట్ల జాతర నేపథ్యంలో బోసిపోయి తక్కువ ట్రాఫిక్ కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement