Saturday, May 11, 2024

రిజర్వాయర్ల వద్ద చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు.. గొర్రెల పంపిణీకి ఏర్పాట్లు : మంత్రి తలసాని

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిజర్వాయర్ల వద్ద చేప పిల్లల ఉత్పత్తి , విక్రయ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి కార్యచరణను రూపొందించాలని మత్స్యశాఖ అధికారులను పశుసంవర్థ, మత్య్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని మత్స్య భవన్‌లో మత్స్య, పాడిపరిశ్రమ అభివృద్ధి, గొర్రెల పంపిణీ కార్యక్రమాల అమలుపై అధికారులతో సమీక్షను మంత్రి తలసాని నిర్వహించారు. ఈ సమీక్షలో గొర్రెల ఫెడరేషన్‌ ఛైర్మన్‌ దూదిమెట్ల బాలరాజ్‌ యాదవ్‌, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అధార్‌ సిన్హా , పశు సంవర్థక శాఖ డైరెక్టర్‌ ఎస్‌. రామచందర్‌, మత్స్యశాఖ కమిషనర్‌ లచ్చిరాం భూక్యా తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత కులవృత్తులను ప్రోత్సహించేలా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి అవసరమైన చేపపిల్లలను తెలంగాణలోనే ఉత్పత్తి చేసే అంశంపై దృష్టి సారిస్తామన్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వం ఆధీనంలో ఉన్న మహబూబ్‌నగర్‌ జిల్లాలోని బీమారం, నిర్మల్‌ జిల్లాలోని కడెం, సంగారెడ్డి జిల్లాలోని మంజీర,అదిలాబాద్‌ జిల్లాలోని సాత్నాల చేపల పిల్లల ఉత్పత్తి కేంద్రాలను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్దతిలో అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేసి నివేదికను సమర్పించాలని అధికారులను ఆయన ఆదేశించారు.

రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన వివిధ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన 159 ఎకరాల భూమిని గుర్తించినట్లు చెప్పారు. ఆ భూమిలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. అందుకు సంబంధించి సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. మత్స్య కళాశాల్లోని విద్యార్థులకు ఈ ప్రాజెక్టులో ఉద్యోగ, ఉపాధి కల్పించే అవకాశాలను పరిశీలిస్తామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement