Sunday, April 28, 2024

ఆఫ్గాన్ లో ఆర్థిక సంక్షోభం..న‌గ‌దును విడుద‌ల చేయ‌మంటోన్న తాలిబ‌న్లు..

ఆఫ్గానిస్థాన్ ని చేజిక్కించుకుని అక్క‌డ త‌మ ప్ర‌భుత్వాన్ని స్థాపించి పెత్త‌నాన్ని సాధిస్తున్నారు తాలిబ‌న్లు. వారు చేసే అర‌చ‌కాల‌కు అంతం లేకుండా పోతోంది. మ‌హిళ‌ల‌కి ప‌లు క‌ఠిన‌మైన ఆంక్ష‌లు విధించారు. వీరి పాల‌న వ‌చ్చాక ఆఫ్గానిస్థాన్ లో సినిమాథియేట‌ర్లు..బార్బ‌ర్ షాపులు మూత‌ప‌డ్డాయి..త‌మ ప్రాణాల‌ని ద‌క్కించుకునేందుకు ఇత‌ర దేశాల‌కు త‌ర‌లివెళ్ళారు ప‌లువురు. అయితే ఇప్పుడు ఆఫ్గాన్ లో ఆహార సంక్షోభం ఏర్ప‌డింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో నిల్వ ఉంచిన తమ డబ్బును తిరిగివ్వాలని తాలిబన్ల ప్రభుత్వం.. బ్యాంకులను కోరుతోంది.

అఫ్గాన్ లో నగదు నిల్వలు తగ్గిపోతుండటంతో పరిస్థితులు చేజారే అవకాశముందని అఫ్గాన్ సెంట్రల్ బ్యాంక్ బోర్డు సభ్యుడు షా మెహరబీ చెప్పారు. అఫ్గాన్ లో ఆర్థిక సంక్షోభాన్ని నిలువరించాలంటే నెలకు 150 మిలియన్ డాలర్లు అవసరం. ఈ ఏడాది చివరి వరకు అయితే సంక్షోభాన్ని నిలువరించగలం. ఇదే పరిస్థితి కొనసాగితే యూరప్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. అఫ్గాన్ కు వివిధ బ్యాంకుల్లో ఉన్న డబ్బును వినియోగించే అవకాశం ఇవ్వకపోతే అఫ్గాన్ ప్రజలు యూరప్ కి వలస వెళ్తారు అని మెహరబీ తెలిపారు. అమెరికాలోని బ్యాంకుల్లో అఫ్గాన్ కు చెందిన దాదాపు 9 బిలియన్ డాలర్ల నగదు నిల్వలు ఉన్నాయి. కానీ.. వాటిని విడుదల చేసేది లేదని యూఎస్ ప్రభుత్వం తెగేసి చెప్పింది. జర్మనీలోని కామ‌ర్జ్ బ్యాంక్ లో 431 మిలియన్ డాలర్లు.. జర్మనీ సెంట్రల్ బ్యాంక్ లో దాదాపు 94 మిలియన్ డాలర్లు ఉన్నాయి. స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో దాదాపు 660 మిలియన్ డాలర్లు ఉన్నాయి.

అఫ్గానిస్థాన్ గత ప్రభుత్వాలు బిలియన్ల కొద్ది డాలర్లను యూఎస్ ఫెడరల్ బ్యాంకు సహా యూరప్ లోని అనేక సెంట్రల్ బ్యాంకుల్లో నిల్వ ఉంచింది. అయితే ఆగస్టులో తాలిబన్లు ఆఫ్గానిస్థాన్ ను స్వాధీనం చేసుకోవడంతో ఆయా దేశాల ప్రభుత్వాలు ఆ డబ్బును తాలిబన్లు ఉపసంహరించుకోకుండా నిలుపుదల చేశాయి. దీనితో ఇప్పుడు ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని తాలిబన్ ప్రభుత్వం అభ్యర్థిస్తోంది. ఆ డబ్బంతా అఫ్గానిస్థాన్ దేశానిది. కాబట్టి మా డబ్బు మాకివ్వండి. నగదు నిల్వలను నిలుపుదల చేయడం అధర్మం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం అని అఫ్గాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం మహిళలకు విద్య సహా ..మానవ హక్కులను గౌరవిస్తుందని మానవత్వంతో చేసే పనులకు నిధులు విడుదల చేయాలని కోరారు. మ‌హిళ‌ల‌ల ప‌ట్ల విచ‌క్ష‌ణార‌హితంగా వ్య‌వ‌హ‌రించే తాలిబ‌న్ల మాట‌ని ఎవ‌రు న‌మ్ముతారు. మ‌రి తాలిబ‌న్ల అభ్య‌ర్థ‌న‌ని మ‌న్నించి బ్యాంకులు న‌గ‌దును విడుద‌ల చేస్తుందా అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement