Tuesday, April 30, 2024

Big Story : తరుగు పేరిట నిలువుదోపీడీ.. బస్తాకు 4 కిలోల దాకా న‌ష్ట‌పోతున్న రైతు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సరైన పర్యవేక్షణ కొరవడడంతో ధాన్యం కొనుగోళ్ల విషయంలో వ్యాపారులు, రైసుమిల్లర్ల అక్రమాలకు అంతులేకుండాపోతోంది. నాణ్యత, తేమ, తూకాల పేరిట కొర్రీలు పెడుతూ బస్తాకు 3 నుంచి 4 కిలోల దాకా తరగు తీస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు ఊపందుకోకపోవడంతో చాలా మంది రైతులు తమ ధాన్యాన్ని ప్రయివేటు వ్యాపారులకు, రైసు మిల్లులకు నేరుగా విక్రయిస్తున్నారు. ఎక్కువ మంది రైతులు తమ గ్రామాల్లోనే ప్రభుత్వానికి ధాన్యం విక్రయిస్తుండడంతో ప్రయివేటు వ్యాపారుల కు గిరాకీ లేకుండా పోయింది.

ఈ నేపథ్యంలో నగదు అత్యవసరమై, లేక ధాన్యాన్ని ఆరబోయటం, తూర్పార బట్టడం వంటి పనులు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న కొంత మంది రైతులు మాత్రమే పంట కోసిన వెంటనే వ్యాపారుల కు విక్రయిస్తున్నారు. ధాన్యం విక్రయించేందుకు వచ్చిన ఆ కొద్దిమంది రైతుల నుంచే సీజన్‌కు సరిపడా లాభాలను దండుకోవాలన్న దురుద్దేశ్యంతో వ్యాపారులు నిలువుదోపీడీకి పాల్పడుతున్నారు. ధాన్యానికి సవాలక్షా కొర్రీలు పెడుతూ పెద్ద ఎత్తున తరగు తీస్తున్నారు. బస్తా ధాన్యానికి ఏకంగా మూడు నుంచి 5 కిలోల దాకా తరుగు తీస్తున్నారంటే వ్యాపారుల దోపీడీ ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. వ్యాపారుల చేతిలో రైతులు నిలువుదోపీడీకి గురవుతున్నా వ్యవసాయ మార్కెటింగ్‌, సివిల్‌ సప్లై అధికారులు పట్టించుకున్న దాఖలాలు కానరావడం లేదు.

- Advertisement -

ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 60శాతం మేర వరికోతలు పూర్తయ్యాయి. 40 కిలోల ధాన్యం సంచికి మూడు కిలోలు అదనంగా ఇస్తేనే అన్‌లోడ్‌ చేసుకునేందుకు వ్యాపారులు ఒప్పుకుంటున్నారు. లేనిపక్షంలో ధాన్యం ట్రాక్టర్లను వెనక్కు పంపిస్తామని స్పష్టం చేస్తున్నారు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో వ్యాపారుల పెడుతున్న షరతులకు అంగీకరించక తప్పడం లేదు. మరికొంత మంది వ్యాపారులు రైతులకు క్వింటా ధాన్యానికి మద్దతు ధర కంటే దాదాపు రూ.600 తక్కువ చెల్లించి దోపీడీకి పాల్పడుతున్నారు. ప్రస్తుతం ఏ గ్రేడ్‌ వరి ధాన్యానికి రూ.2060, బీ గ్రేడ్‌ ధాన్యానికి రూ.2040 మద్దతు ధరను ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే వ్యాపారులు మాత్రం రూ.1650 నుంచి రూ.1700కు మించి చెల్లించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ధాన్యం దిగుమతి చేసుకునే సమయంలో హమాలీలు సంచికి రూ.2చొప్పున రైతుల వద్ద నుంచి కరాఖండీగా వసూలు చేస్తున్నారు.

ఈ ఏడాది రాష్ట్రంలో 65లక్షల ఎకరాల్లో వరి సాగైంది. కిందటేడాది కన్నా మూడు లక్షల ఎకరాల్లో రైతులు అదనంగా ధాన్యాన్ని పండించారు. దీంతో దాదాపు 1.12కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాల శాఖ ప్రణాళిక రూపొందించింది. దాదాపు 7వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్లు, జిల్లా మార్కెటింగ్‌, పౌరసరఫరాలశాఖ అధికారులు స్పందించి వ్యాపారుల దోపీడీ నుంచి కాపాడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement