Friday, May 17, 2024

సిబిల్‌ పాసైతేనే రైతు రుణాలు.. బ్యాంకు అధికారుల కొత్త తీరు

మహబూబాబాద్‌, ప్రభన్యూస్‌: గృహ, వాహన రుణాల మాదిరిగానే ఇక రైతులు పంట రుణాలు పొందాలనుకుంటే వారికి సిబిల్‌ స్కోర్‌ ఉండాల్సిందే. లేదంటే బ్యాంకు అధికారులు తిరస్కరిస్తారు. రైతులకు పంట రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు పెట్టిన కొత్త నిబంధన ఇది. ప్రస్తుతం వానాకాలం సీజన్లో పంట రుణాల కోసం వాణిజ్య బ్యాంకుల వద్దకు వెళ్లిన రైతులకు బ్యాంకర్లు కొత్త మెలిక పెట్టారు.

రూ.1లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని ఐదేళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన హామీతో బ్యాంకులకు సకాలంలో రుణాలు చెల్లించని రైతులకు సిబిల్‌ పేరుతో ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. రుణగ్రహీతల ఆర్థిక క్రమశిక్షణకు ఇది సరైన మార్గమే అయినప్పటికీ, వాణిజ్య అవసరాలకు పెట్టిన నిబంధనను పంట రుణమాఫీకి వర్తింపజేయడంతో రైతులు పెట్టుబడి కోసం ఇబ్బంది పడుతున్నారు.

మూడేళ్లు చెల్లించకుంటే నో ప్రొటెక్ట్‌..

వ్యాపార, వాణిజ్య, గృహనిర్మాణ అవసరాలకు ఇచ్చే రుణాలకు తప్ప సిబిల్‌తో సంబంధం లేకుండా బ్యాంకులు రైతులకు పంట రుణాలను మంజూరు చేసేవి. ఈ ప్రక్రియలో కొన్ని బ్యాంకులు పట్టాదారు పాస్‌ పుస్తకాలను బ్యాంకులోనే ఉంచుకొని రుణాలు ఇవ్వగా, ఇంకొన్ని బ్యాంకులు కేవలం పట్టాదారు పాస్‌ పుస్తకంపై స్టాంప్‌ వేసి తిరిగి దాన్ని రైతులకే ఇచ్చేవారు. పట్టాదారు పాస్‌ పుస్తకంలో సదరు రైతు పేరిట ఉన్న భూ విస్తీర్ణం పరిమితి మేరకు బ్యాంకర్లు పంట రుణాలను ఇస్తారు.

- Advertisement -

అయితే బ్యాంకుల నిబంధనల ప్రకారం రైతులు పంట రుణాలు పొందిన నాటి నుంచి ఏడాది లోపు రుణాలను వడ్డీతో సహా తీర్చాలి. అయితే ప్రభుత్వం రుణమాఫీ ప్రకటిస్తుందనే ఉద్దేశంతో కొందరు రైతులు కనీసం వడ్డీ కూడా చెల్లించలేదు. ఫలితంగా సదరు రైతుకు సిబిల్‌ స్కోర్‌ తగ్గింది. పైగా వరుస మూడేళ్లు లావాదేవీలు లేని ఖాతాలు ఎన్పీ (నో ప్రొటెక్ట్‌) పరిధిలోకి వెళ్తున్నాయి.

పూచీకత్తు ఇవ్వాల్సిందే..

పంట రుణాలు పొందడానికి బ్యాంకర్లు సిబిల్‌తో పాటు కొత్త కొర్రీని కూడా జోడించినట్టు తెలుస్తోంది. ఇదివరకైతే సంబంధిత రైతు పట్టాదారు పాస్‌ పుస్తకం, వన్‌ బీ, పహాణీని రుణ దరఖాస్తు ఫారానికి జతపరిస్తే సరిపోయేది. భూ విస్తీర్ణాన్ని బట్టి పరిమిత మేరకు పంట రుణాలను బ్యాంకర్లు ఇచ్చేవారు. కాగా, తాజాగా పంట రుణాలకు వీటితో పాటు జామీను(పూచీకత్తు)ను కూడా ఇవ్వాలని షరతు పెడుతున్నట్టు సమాచారం. పంటరుణం పొందాలంటే కుటుంబ సభ్యులలో వారసులైన వారు లేదా ప్రభుత్వ ఉద్యోగులతోనైనా జామీను సంతకం చేయించే నిబంధనను అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

హామీలతో సిబిల్‌ డీలా..

పంట రుణాలకు సిబిల్‌ ఎలా సాధ్యమని పలువురు ప్రశ్నిస్తున్నారు. పంటల సాగుకు బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తామని రాజకీయ పార్టీలు పోటీపడి ప్రకటిస్తుంటే సహజంగా ఏ రైతు కూడా బ్యాంకులో తెచ్చుకున్న పంటరుణ అప్పును తీర్చాలనుకోడు. ప్రభుత్వం చెల్లించేంత వరకు వేచి చూస్తారు. ఈ క్రమంలో వరుసగా మూడేళ్లు రుణం రీషెడ్యూల్‌ కాకున్నా, కనీసం వడ్డీ కూడా చెల్లించని పక్షంలో ఆ రైతు ఖాతా ఎన్పీ (నో ప్రొటెక్ట్‌) పరిధిలోకి చేరుతున్న పరిస్థితుల్లో సదరు రైతుకు సిబిల్‌ స్కోర్‌ ఎలా వస్తుందనేది కొందరి వాదన. ఏదిఏమైనా పంట రుణాలకు బ్యాంకర్లు కొత్త కొత్త నిబంధనలు పెడుతుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement