Monday, April 29, 2024

ఫేక్‌ కరెన్సీ రాకెట్‌ గుట్టు రట్టు చేసిన టాస్క్‌ ఫోర్స్‌.. 7 లక్షల 54 వేల నకిలీ కరెన్సీ సీజ్‌

వరంగల్ క్రైమ్‌, ప్రభ న్యూస్‌: బిజినెస్‌లో లాస్‌ వచ్చింది. సొసైటీలో కాలర్‌ ఎగరేసి తిరగాలంటే మనీ కావాలి. ఆ మనీని తక్కువ టైంలో సంపాదించి, తన కేరీర్‌ను చాటుకోవడం కోసం ఫేక్‌ కరెన్సీ మార్పిడి చేయాలని నిర్ణయించుకున్నారు. తదనుగుణంగా లక్ష నికర మొత్తానికి 3 లక్షల నకిలీ కరెన్సీని మార్చుకొనే విధంగా అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం నోట్ల మార్పిడి చేసుకొంటున్నట్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్స్‌పెక్టర్‌ ఆర్‌.సంతోష్‌కు పక్కా సమాచారం అందుకున్నారు. ఫేక్‌ కరెన్సీ రాకెట్‌ ఇన్ఫర్మేషన్‌ అందుకున్న టాస్క్‌ ఫోర్స్‌ ఇన్స్‌పెక్టర్‌ సంతోష్‌ నేతృత్వంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా కేంద్రంలో గుట్టుగా సాగుతున్న ఫేక్‌ కరెన్సీ రాకెట్‌ ముఠా బాగోతాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. వరంగల్‌ అడిషనల్‌ డిసిపి, టాస్క్‌ఫోర్స్‌ ఇంచార్జి వైభవ్‌ గైక్వాడ్‌ నకిలీ నోట్ల ముఠా అరెస్ట్‌ విషయాలను పత్రికలకు విడదల చేశారు. వరంగల్‌ కేంద్రంగా సాగుతున్న నకిలీ నోట్ల ముఠాను పట్టుకోవడంతో కలకలం రేపుతోంది. హన్మకొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పెద్దమ్మగడ్డ వద్ద టాస్క్‌ ఫోర్స్‌ బృందం, హన్మకొండ పోలీసులతో కలిసి మాటు వేసి, రెడ్‌ హ్యాండెడ్‌గా నకిలీ 500 రూపాయలకు చెందిన1508 నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అయిదుగురు నకిలీ కరెన్సీని (పేపర్‌ నోటు కరెన్సీ) చెలామణి చేస్తున్నారనే సమాచారంపై రైడ్‌ చేసి పట్టుకున్నారు.

ఫేక్‌కరెన్సీని నిజమైన కరెన్సీగా ఉపయోగించాలనే ఉద్దేశ్యంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి, విద్యానగర్‌కు చెందిన కారు డ్రైవర్‌ సోర్లం ప్రసాద్‌ (32), ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం ప్రగళ్లపల్లికి చెందిన శ్రీకాంత్‌ నకిలీ కరెన్సీ చెలామణి చేశారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసువిచారణలో నిందితుడు సొర్లం ప్రసాద్‌ కారు డ్రైవర్‌గా చేస్తూనే ఫేక్‌ కరెన్సీ దందా చేస్తున్నట్లు అంగీకరించాడు. తక్కువ సమయంలో, సులభంగా ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఉద్దేశ్యంతోనే పేపర్‌ నోట్లను కొనుగోలు చేసి అసలు కరెన్సీగా చెలామణి చేసేందుకు ప్రయత్నించిన్నట్లు అంగీకరించాడు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం శేఖర్‌, శ్రీకాంత్‌తో కలిసి ప్రసాద్‌ కారులో వరంగల్‌ వచ్చారు. ఈ క్రమంలో తాము వ్యాపారంలో నష్టపోతున్నామని, ఏదైనా అక్రమ వ్యాపారంతో సులభంగా డబ్బు సంపాదించడానికి ఆలోచన ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే, ఒక లక్ష నిజమైన డబ్బుకు బదులుగా 3 లక్షల రూపాయల నకిలీ కరెన్సీని మార్చుకొనే అవకాశం ఉందని తెలుసుకున్నాడు. వారి పథకం ప్రకారం నకిలీ కరెన్సీని అంటే పేపర్‌ నోట్లను చెలామణి చేయడానికి బ్యాగ్‌లో ప్యాక్‌ చేసుకొని, పెద్దమ్మగడ్డ వద్ద గురువారం అందరూ కలుసుకున్నట్టు తెలుసుకొని, టాస్క్‌ఫోర్స్‌ బృందం సొర్లం ప్రసాద్‌, భాగ్యలక్ష్మితోపాటు రవీందర్‌ గౌడ్‌లను పట్టుకున్నారు. ఇంతలో శేఖర్‌, శ్రీకాంత్‌లు పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకున్నారు. కారును తనిఖీ చేయగా నల్లటి కాగితపు కట్టలు కనిపించాయి. 5 వందల నోట్లు 1508 నకిలీ కరెన్సీ 7 లక్షల 54 వేలను టాస్క్‌ ఫోర్స్ టీం స్వాధీనం చేసుకున్నారు. ఒక ఇటియస్‌ కారు, 5 స్మార్ట్‌ మొబైల్‌ ఫోన్లు, 4 కీప్యాడ్‌ ఫోన్లు, ఒక లక్ష అసలు నికర నగదు, బ్లాక్‌ పేపర్‌ బండిల్స్‌ను సీజ్‌ చేశారు. తదుపరి చర్యల కోసం హన్మకొండ పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement