Saturday, May 4, 2024

మిర్చి అ’ధర’హో..! క్వింటా గరిష్ట ధర రూ.26 వేలు

అమరావతి, ఆంధ్రప్రభ: గత ఏడాది తామరపురుగు ధాటికి తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయిన మిర్చి రైతులకు ఈ ఏడాది ఊరట కలుగుతోంది. విదేశీ ఎగుమతి ఆర్డర్లు భారీగా రావటంతో మిర్చి ధర ఘాటెక్కుతోంది. గత ఏడాది ఇదే సమయంతో పోల్చుకుంటే ధరలు క్వింటాకు రూ.7 వేల నుంచి రూ.11 వేలు పెరగటంతో రైతులు సంతోషంగా ఉన్నారు. దీంతో కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ ఉంచిన మిర్చి బస్తాలను బయటకు తీసి యార్డుకు తరలించి విక్రయిస్తున్నారు. తేజ రకం మిర్చి క్వింటా ధర గరిష్టంగా రూ.22 వేలు పలుకుతోంది. గత ఏడాది ఇదే సమయానికి కేవలం రూ.15 వేలు మాత్రమే ఉంది. సిజెంటా బాడుగ రకం రూ.23 వేలు ఉండగా గత ఏడాది రూ.14 వేలకు మించి లేదు. 355 బాడిగ రకం మిర్చి ధర రూ.23 వేలు పలుకుతుండగా గత ఏడాది ధర రూ.15 వేలు మాత్రమే. 341 రకం మిర్చి ధర ఏకంగా క్వింటా రూ.26 వేలకు చేరింది. గత ఏడాది ఇదే సమయానికి రూ.15 వేలు మాత్రమే ఉంది. తామరపురుగు సోకటంతో గత ఏడాది దిగుబడి గణనీయంగా తగ్గటం, ఇపుడు విదేశాలకు భారీగా ఎగుమతులు చేయాల్సి రావటంతో మార్కెట్లో మిర్చి ధరకు రెక్కలొచ్చాయి. చైనా, బంగ్లాదేశ్‌, వియత్నాం, థాయ్‌లాండ్‌లతో పాటు అమెరికాకు కూడా మిర్చి ఎగుమతవుతోంది. దేశీయంగా పండే మిర్చిని గరిష్టంగా 40 శాతం ఇక్కడి అవసరాలకు వినియోగిస్తుండగా మిగతా 60 శాతం విదేశాలకు ఎగుమతవుతోంది.

మన దేశం తరువాత ఎక్కువగా చైనాలో మిర్చిని పండిస్తున్నప్పటికీ ఏపీ, తెలంగాణాల్లో పండించే తేజ రకం మిర్చిని ఆ దేశం ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. ఎక్కువకాలం నిల్వ ఉండటంతో పాటు ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఔషధాల తయారీ కోసం వినియోస్తుండటంతో తేజ రకం మిర్చికి విదేశాల్లో అధిక డిమాండ్‌ ఏర్పడింది. ప్రతి ఏటా అత్యధిక ధర పలికే రకంగా ఉన్న తేజకు మించి ఈ ఏడాది 341 రకం మిర్చికి డిమాండ్‌ ఏర్పడింది. ఇపుడు 341 రకం మిర్చికి తేజ రకానికి మించి మార్కెట్లో వ్యాపారులు ధర చెల్లిస్తున్నారు. 341 రకం క్వింటా ధర గరిష్టంగా రూ.26 వేలకు చేరటం విశేషం. గుంటూరు, కర్నూలుతో పాటు ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో 341 రకం మిర్చిని రైతులు అధికంగా సాగు చేశారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్ల్రోని మరికొన్ని ప్రాంతాల్లోనూ 341 రకాన్ని సాగు చేశారు. విదేశాల కన్నా దేశీయంగా 341కు మంచి డిమాండ్‌ ఏర్పడింది. మిర్చిలో రారాజుగా ఉన్న తేజ రకానికి మించి చిక్కటి ఎరుపులో ఉండటంతో పచ్చళ్ళ తయారీతో పాటు గృహావసరాల కోసం 341 రకాన్ని అత్యధికంగా వినియోగిస్తున్నారు. కొత్త పంట దిగుబడి కోసం నవంబరు-డిసెంబరు దాకా ఆగాల్సి రావటంతో ఇపుడు మార్కెట్లో ఉన్న పంటకు డిమాండ్‌ పెరిగింది. మార్చి నెలలో రూ.21 వేల దాకా ఉన్న క్వింటా ధర ఇపుడు గరిష్టంగా రూ.26 వేలకు చేరింది.

గత ఏడాది ఖరీప్‌ సీజన్‌ లో 3.7 లక్షల ఎకరాల్లో మిర్చి సాగవ్వాల్సి ఉండగా అంతకుముందు సీజన్‌ లో ధరలు బాగా ఉండటంతో అదనంగా మరో లక్ష ఎకరాల్లో పంట పండించినట్టు అంచనా. ధరలు స్థిరంగా, లాభసాటిగా ఉండాలంటే రైతులు మార్కెట్‌ పరిస్థితులపై కూడా అవగాహన పెంచుకోవాలనీ.. నిర్దేశించిన సాగు విస్తీర్ణ లక్ష్యానికి మించి పంట పండించే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement