Wednesday, May 8, 2024

Delhi | మంత్రివర్గ విస్తరణకు కసరత్తు.. ఎన్నికల ఏడాదిలో జోడు పదవులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: వరుసగా మూడోసారి గెలిచి కేంద్రంలో హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అగ్రనాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల ఏడాదిగా పరిగణించే ఈ చివరి సంవత్సరంలో అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో భారీ మార్పుల దిశగా చేపట్టిన కసరత్తు తుదిదశకు చేరుకుంది. సోమవారం జరగనున్న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో ప్రధాన మంత్రి యావత్ మంత్రివర్గాన్ని ఉద్దేశించి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ ప్రసంగంలో మార్పులు-చేర్పుల గురించి పరోక్ష సంకేతాలిచ్చే అవకాశం ఉంది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎవరి అంచనాలకు అందకుండా నిర్ణయాలు తీసుకుంటున్న మోదీ-షా ద్వయం ఈసారి మార్పుల విషయంలోనూ అలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

అయితే మార్పులు చేర్పులపై పార్టీ వర్గాల్లో మాత్రం విస్తృతంగా చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఈ ఏడాది చివర్లో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు లిట్మస్ టెస్టులా మారిన నేపథ్యంలో అధినేతలిద్దరూ పకడ్బందీ వ్యూహాలతో కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. పైగా ఈమధ్యనే జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారపర్వం పూర్తిగా తమ భుజాల మీద మోసినప్పటికే ఫలితం లేకపోయింది. రాష్ట్ర నాయకత్వం బలంగా లేనప్పడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఎన్నికల్లో జాతీయ నాయకత్వం ఎంత శ్రమించినా ఫలితం ఉండదని తేలింది. బీజేపీ సైద్ధాంతిక మాతృసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) అధికారిక పత్రికలో కర్ణాటక వైఫల్యంపై చేసిన నిర్మాణాత్మక విమర్శలను అధినేతలు పరిగణలోకి తీసుకున్నట్టు సమాచారం. ఆ క్రమంలోనే ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ.. తదనుగుణంగా కేంద్ర మంత్రివర్గంలోనూ మార్పులు, చేర్పులు చేయనున్నట్టు తెలుస్తోంది.

కర్ణాటక నేర్పిన పాఠం ఏంటి?

- Advertisement -

కర్ణాటకలో రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్‌ నాయకత్వాన్ని ధీటుగా ఎదుర్కొనే రాష్ట్ర స్థాయి నాయకత్వం లేకపోవడంతో కేంద్ర నాయకత్వమే ప్రచార బాధ్యతలు భుజానికెత్తుకోవాల్సి వచ్చింది. అక్కడ పార్టీని తన ఒంటి చేత్తో నడిపిస్తూ వచ్చిన యెడ్యూరప్పను ముఖ్యమంత్రి పీఠంపై నుంచి దింపిన తర్వాత ఆ స్థాయి నేతను బీజేపీ తయారుచేయలేకపోయింది. తన ప్రభుత్వంపై చేసిన అవినీతి ఆరోపణలను ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై తిప్పికొట్టలేకపోయారు. కాంగ్రెస్‌లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ రూపంలో ఇద్దరు బలమైన నేతలు కనిపించగా.. బీజేపీ నుంచి వారిని ఢీకొట్టే నాయకత్వం లేకపోయింది. ఈ స్థితిలో అంతా తానే అయిన చందంగా ప్రధాని మోదీ వ్యవహరించినప్పటికీ.. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొనేది ఆయన కాదు కదా అన్నట్టుగా ప్రజలు తీర్పునిచ్చారు.

ఇదే తరహా తీర్పు 2018లో జరిగిన మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ వచ్చింది. మూడు రాష్ట్రాల్లో ఆనాటి వరకు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు చోట్లా ఓటమిపాలైంది. ఆరు నెలలు తిరగకుండా జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీకి తిరుగులేని మెజారిటీ ఇచ్చారు. అంటే స్థానికంగానూ మోదీ తరహా నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని దీన్ని బట్టి అర్థమైంది. అందుకే త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది.

రాష్ట్రాలకు మంత్రులు!

రాష్ట్రాల నాయకత్వాన్ని బలోపేతం చేయాలంటే ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీల ముఖ్యమంత్రులకు ధీటైన ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రజల ముందుంచాలి. అంటే వారికి రాజకీయానుభవంతో పాటు పాలనా అనుభవం కూడా ఉంటే సమర్థవంతమైన నేతగా చూపొచ్చు. ఈ క్రమంలో కేంద్ర మంత్రులను ఆయా రాష్ట్రాలకు అధ్యక్షులుగా పంపించాలని అధిష్టానం నిర్ణయించినట్టు తెలిసింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థులుగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వంటి బలమైన నేతలిద్దరు కనిపించగా.. బీజేపీ తరఫున సిట్టింగ్ సీఎం బస్వరాజ్ బొమ్మై తేలిపోయారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి కూడా ఆ స్థాయి లేకపోయింది. మాజీ సీఎం యెడ్యూరప్ప ఒక్కరే బలమైన నేతగా కనిపించగా.. ఆయన్ను గరిష్ట వయోపరిమితి కారణంగా పార్టీ క్రియాశీల రాజకీయాల నుంచి దూరం పెట్టిన విషయం తెలిసిందే.

ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వ ద్వయాన్ని ఢీకొట్టగలిగే బలమైన నేత రాష్ట్రంలో ఉన్నట్టయితే మరీ ఇంత ఘోర ఓటమి ఎదురయ్యేది కాదని కమలనాథులు విశ్లేషించుకుంటున్నారు. ఈ పరిస్థితి మిగతా రాష్ట్రాల్లో తలెత్తకుండా ఉండేందుకు రాజకీయానుభవంతో పాటు పాలనలో అనుభవం గడించిన నేతలకు రాష్ట్ర పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగిస్తే మెరుగైన ఫలితాలు ఆశించవచ్చని భావిస్తోంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్ర సింగ్ తోమర్, ఒడిశాకు ధర్మేంద్ర ప్రధాన్, తెలంగాణ – కిషన్ రెడ్డి, రాజస్థాన్‌కు గజేంద్ర సింగ్ షెకావత్‌ లేదా అశ్విని వైష్ణవ్‌ను అధ్యక్షులుగా పంపించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. కర్ణాటకలో ఓటమికి బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర అధ్యక్షుడు రాజీనామా చేసిన నేపథ్యంలో అక్కడ కొత్త అధ్యక్షుడితో పాటు బీజేపీ శాసనసభాపక్ష నేత (ప్రతిపక్ష నేత)ను కూడా ఇదే కసరత్తులో భాగంగా ఖరారు చేయనున్నట్టు తెలిసింది.

తెలంగాణలో జోడు పదవులు?

ఎన్నికలకు తేదీలు సమీపిస్తున్న సమయంలో తెలంగాణ వంటి రాష్ట్రంలో నాయకత్వ మార్పు అనూహ్యం పరిణామమే అవుతుంది. రాష్ట్ర నాయకత్వంలో ఎలాంటి మార్పు ఉండదని ఇప్పటికీ పలువురు నేతలు చెబుతున్నారు. కానీ రాష్ట్ర నాయకత్వంలో మార్పు గురించి మాత్రం విస్తృత చర్చ జరుగుతోంది. బండి సంజయ్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పిస్తే అది ఆత్మహత్యా సదృశ్యమేనని కొందరు, రాష్ట్రస్థాయిలో ముఖ్యనేతల మధ్య విబేధాల పరిష్కారానికి తప్పించడమే ఏకైక మార్గమని మరికొందరు చెబుతున్నారు. గ్రామస్థాయి కార్యకర్తల వరకు ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో జరుగుతున్న చర్చ ప్రకారం తెలంగాణ రాష్ట్ర నాయకత్వంలో అగ్రనేతల మధ్య లుకలుకలు, విబేధాలు పార్టీలో వర్గపోరుకు దారితీశాయని అధిష్టానం గ్రహించింది. పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన కొత్త నేతలకు, మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలకు మధ్య గ్యాప్ ఉందన్న విషయం బహిరంగంగా అందరికీ తెలిసిన విషయమే. ఈ పరిస్థితుల్లో పాత – కొత్త నేతల మధ్య సమన్వయం సాధిస్తూ.. అందరినీ కలుపుకుపోయే నేత కోసం పార్టీ అన్వేషించింది.

మృదుస్వభావి, వివాదరహితుడుగా పేరున్న కిషన్ రెడ్డే సరైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నట్టు తెలిసింది. కిషన్ రెడ్డికి ఇష్టం లేకపోయినా సరే గురుతర బాధ్యతను ఆయనకు అప్పగిస్తూ రాష్ట్రానికి పంపించనున్నట్టు చర్చ జరుగుతోంది. ఈ వార్తలను కిషన్ రెడ్డి ఖండిస్తున్నప్పటికీ.. కమలనాథులు రాష్ట్రాలకు మంత్రులను పార్టీ అధ్యక్షులుగా పంపే కసరత్తు చేస్తుండడంతో ఒకట్రెండు రోజుల్లో ఈ అంశంపై స్పష్టత రావొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా పంపించే క్రమంలో ఆయన్ను కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించి, ఆయన స్థానంలో బండి సంజయ్ లేదా డా. లక్ష్మణ్‌కు చోటు కల్పించవచ్చని కొందరు చెబుతుంటే.. ఎన్నికల ఏడాది బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో నేతల పర్యటనలకు ఇబ్బంది లేకుండా కేంద్ర మంత్రి పదవి ప్రొటోకాల్ ఉంటేనే మంచిదన్న అభిప్రాయంలో అధిష్టానం ఉందని మరికొందరు చెబుతున్నారు. పెద్దగా పనిభారం లేని శాఖలను కిషన్ రెడ్డి దగ్గర ఉంచి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే సమయంలో కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్ని బండి సంజయ్ వదులుకోవాల్సి వస్తే ఆయన్ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని రాష్ట్రంలో తన మార్కు ప్రచారాన్ని కొనసాగించేందుకు వీలు కల్పిస్తారని తెలుస్తోంది. అదే సమయంలో బండి సంజయ్‌తో అహంతో ముడిపడ్డ సమస్యలున్న నేతలకు పార్టీలో ఇబ్బంది లేకుండా ఉంటుందని, తద్వారా పోటీపడి పార్టీ గెలుపు కోసం పనిచేసే సామరస్య వాతావరణం నెలకొంటుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో రాజకీయంగా బలమైన సామాజిక వర్గమైన రెడ్డి వర్గం నేతలను పూర్తిగా కాంగ్రెస్ వైపు ఆకర్షితులు కాకుండా అడ్డుకట్ట వేయవచ్చని కూడా లెక్కలు వేస్తున్నారు. ఇన్ని సమీకరణాలు, అంచనాల నడుమ తెలంగాణపై చేస్తున్న కసరత్తు తుదిదశకు చేరుకుందని, సోమవారం నాటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలోనే ప్రధాని ఆ మేరకు సంకేతాలు ఇవ్వవచ్చని చర్చ జరుగుతోంది.

2021 తరహాలో…

రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించింది. అప్పుడు కూడా విస్తృతంగా కసరత్తు చేసింది. వివాదాలు, అసమర్థత, అవినీతి ఆరోపణలున్న మంత్రులకు ఉద్వాసన పలికింది. ప్రకాశ్ జవడేకర్, రవిశంకర్ ప్రసాద్, హర్షవర్థన్ సహా మొత్తం 12 మంది నాటి విస్తరణలో మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురయ్యారు. అలాగే 17 మంది కొత్తవారికి చోటు కల్పించగా వారిలో జ్యోతిరాదిత్య సింధియా, శర్బానంద్ సోనోవాల్‌తో పాటు అశ్విని వైష్ణవ్ వంటి బ్యూరోక్రాట్ కూడా ఉన్నారు. అప్పటి వరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి ఏకంగా కేబినెట్ ర్యాంకుకు పదోన్నతి కల్పిస్తూ పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలను అప్పగించారు. ఈ మూడు శాఖలకు కలిపి ఆయనకు ఐదుగురు సహాయ మంత్రులను ఇచ్చారు. మొత్తంగా రెండేళ్ల క్రితం చేపట్టిన మంత్రివర్గ విస్తరణ అనంతరం ఏకంగా 27 మంది ఓబీసీలకు చోటు కల్పించి దేశ చరిత్రలో ఇంత మంది ఓబీసీలున్న కేంద్ర మంత్రివర్గంగా రికార్డు సృష్టించారు.

ఆ తర్వాత ఈ ఏడాది మే నెలలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్న కిరెన్ రిజిజును తప్పించడం మినహా రెండేళ్లలో మంత్రివర్గంలో పెద్దగా ఎలాంటి మార్పులు చేయలేదు. అందుకే ఇప్పుడు ఎన్నికల ఏడాది చేసే కసరత్తు రెండేళ్ల క్రితం కసరత్తును మించి ఉంటుందని తెలుస్తోంది. అప్పుడు జూన్ 30న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం నిర్వహించిన ప్రధాని, జులై 7, 8 తేదీల్లో మంత్రివర్గ విస్తరణను పూర్తి చేశారు. ఈ ఏడాది జులై 3న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం ఏర్పాటు చేసిన ప్రధాని వారం రోజుల్లోగా మిగతా కసరత్తు పూర్తిచేస్తారని తెలుస్తోంది. ఈసారి కూడా దేశ జనాభాలో సగం కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న ఓబీసీలకు అగ్రపీఠం వేయనున్నట్టు తెలుస్తోంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement