Friday, May 3, 2024

TS | రాహుల్‌ సభకు అంతా రెడీ.. డిజిటల్‌ స్క్రీన్‌, సీటింగ్‌ గ్యాలరీ ఏర్పాటు

ఉమ్మడి ఖమ్మం, ప్రభన్యూస్‌ బ్యూరో: కాంగ్రెస్‌ అగ్రనేత, ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ పర్యటన కోసం ఖమ్మం నగరం సిద్ధమైంది. ఖమ్మం నగరంలోని ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌ వెనుక ప్రాంతంలో ఉన్న ఖాళీ స్థలంలో తెలంగాణ జనగర్జన పేరుతో కాంగ్రెస్‌ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించి రాష్ట్రంలో ఎన్నికల శంఖారావం పూరించనుంది. సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర ఆదివారంతో ముగియనుండగా, ఏఐసీసీ ఆదేశాలతో ముగింపు సభను ఏర్పాటు చేశారు. మార్చి 16, 2023న ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ నియోజకవర్గం నుండి భట్టి విక్రమార్క పీపుల్స్‌ మార్చ్‌ పేరుతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం 109 రోజులుగా పాదయాత్రతో ప్రజలను కలుస్తూ వారి కష్ట నష్టాలను ఆలకించారు.

ఏఐసీసీ ఆదేశాల మేరకు రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర స్పూర్తితో హాత్‌ సే హాత్‌ కార్యక్రమంలో భాగంగా మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీతో పాటు జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ కార్యదర్శులు, పలువురు సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు సభలో పాల్గొననుండటంతో భారీ స్థాయిలో వేదికను నిర్మించి హైటెక్‌ స్థాయిలో ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

డిజిటల్‌ స్క్రీన్‌, సీటింగ్‌ గ్యాలరీలతో ఏర్పాట్లు

ఖమ్మం ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌ వెనుక వంద ఎకరాల ఖాళీ స్థలంలో 5 లక్షల జన సమీకరణ ఏర్పాట్లతో సభా ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు. రెండు లక్షల మంది కూర్చునే విధంగా కుర్చీలు, ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు చెందిన ప్రత్యేక ఈవెంట్స్‌ ఆర్గనైజేషన్స్‌ ఆధ్వర్యంలో వేదికపై డిజిటల్‌ స్క్రీన్‌తో పాటు అధునాతనంగా ఆడియో, వీడియో, లైటింగ్‌ విజువల్స్‌ ఏర్పాటు చేసి మొత్తం సుమారు రూ. 30 కోట్లతో సభను తీర్చిదిద్దారు. ఖమ్మం-వైరా రోడ్డు, ఖమ్మం-ఇల్లందు- రఘునాథపాలెం లింకు రోడ్లను కలుపుతూ సభా వేదిక ప్రాంగణంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా బారికేడ్లు, ప్రత్యేక ర్యాక్‌లు, గ్యాలరీలతో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఖమ్మంలో జనవరి 18, 2023న జరిగిన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) జాతీయ పార్టీ ఆవిర్భావ సభకు ధీటుగా భారీ జనసమీకరణతో టి పిసీసీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తుండటంతో ఖమ్మం సభ రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారింది. కాగా ఏర్పాట్లను శనివారం టి పీసీసీ, ఏఐసీసీ నాయకులు జిల్లా కాంగ్రెస్‌ కమిటి అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, ఖమ్మం సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మహమ్మద్‌ జావిద్‌, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావుతో కలిసి పరిశీలించారు.

సభా ప్రాంగణంలోనే హెలిప్యాడ్‌

ఢిల్లి నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకోనున్న రాహుల్‌గాంధీ హెలికాప్టర్‌ ద్వారా ఖమ్మం సభకు వచ్చేందుకు సభా ప్రాంగణంలో ప్రత్యేకంగా హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. రాహుల్‌గాంధీ పర్యటన విజయవంతం అయ్యేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీగా జన సమీకరణ ఏర్పాట్లు చేశారు. ఖమ్మం నగరాన్ని ఫ్లెక్సీలు, తోరణాలు, కటౌట్లతో అలంకరించారు. ఖమ్మం నగరం అంతా కాంగ్రెస్‌ జెండాలతో మూడు రంగులమయంగా మారింది. రాహుల్‌గాంధీ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement