Wednesday, May 8, 2024

Count Down | ఆసియాకప్‌కు స‌ర్వం సిధ్దం.. తొలి మ్యాచ్ లో పాక్, నేపాల్ ఢీ

ఎన్నో రోజులుగా క్రికెట్ ల‌వ‌ర్స్ ఎదురు చూస్తున్న ఆసియా కప్‌-2023 వన్డే టోర్నీ రేప‌టినుంచి (ఆగస్టు 30) ప్రారంభం కానుంది. శ్రీలంక, పాకిస్తాన్‌ సంయుక్తంగా హైబ్రిడ్‌ విధానంలో ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. ముల్తాన్‌ వేదికగా జరిగే టోర్నీ ఆరంభపు మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో నేపాల్‌ తలపడనుంది. 2022లో జరిగిన ఆసియాకప్‌ టీ20 సమరంలో శ్రీలంక విజేతగా నిలిచింది. ఫైనల్లో ఓడిన పాకిస్తాన్‌ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా సెమీస్‌లోనే వెనుదిరిగింది. కానీ ఈసారి వన్డే టోర్నీని ఎలాగైన గెలిచి విజేతగా నిలవాలనే పట్టుదలతో మైదానంలో అడుగుపెట్టనుంది.

ప్రస్తుతం రోహిత్‌ శర్మ సారథ్యంలోని భారత జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అగ్ర శ్రేణి ఆటగాళ్లు ఉండటంతో టీమిండియా అంచనాలు భారీగా పెరిగాయి. పాకిస్తాన్‌, శ్రీలంక నుంచి భారత్‌కు గట్టి పోటీలు ఉంటాయని క్రీడ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. రేపటి నుంచే ఈ మెగా సమరం ఆరంభంకానుంది. భారత్‌ తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఢీ కొననుంది. భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ సెప్టెంబర్‌ 2న శ్రీలంకలోని క్యాండి వేదికగా జరగనుంది. ఆసియాకప్‌ వన్డే టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఆ జట్లను (గ్రూప్‌-ఏ, గ్రూప్‌-బి) రెండు గ్రూపుల్లో విభజించారు. ఈ గ్రూప్‌లలో టాప్‌ రెండు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్‌-4 మ్యాచ్‌లకు అర్హత సాధిస్తాయి.

- Advertisement -

ఏ గ్రూపులో ఏ జట్టు ఉందో ఓసారి చూద్దాం.

గ్రూప్‌-ఏ (జట్లు): భారత్‌, పాకిస్తాన్‌, నేపాల్‌.
గ్రూప్‌-బి (జట్లు): శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్తాన్‌.
ఆసియా కప్‌-2023 టోర్నీ ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్‌ 17 వరకు జరుగనుంది. ఈ టోర్నీ పూర్తి షెడ్యూల్‌ను ఓసారి చూద్దాం.

ఆసియా కప్‌-2023 పూర్తి షెడ్యూల్‌ వివరాలు..

గ్రూప్‌ మ్యాచులు
ఆగస్టు 30: పాకిస్తాన్ x నేపాల్‌ (వేదిక: ముల్తాన్‌-పాకిస్తాన్‌)
ఆగస్టు 31: బంగ్లాదేశ్ x శ్రీలంక (వేదిక: క్యాండి-శ్రీలంక)
సెప్టెంబర్‌ 2: భారత్‌ x పాకిస్తాన్‌ (వేదిక: క్యాండి-శ్రీలంక)
సెప్టెంబర్‌ 3: బంగ్లాదేశ్‌ x అఫ్గానిస్తాన్‌ (వేదిక: లహోర్‌-పాకిస్తాన్‌)
సెప్టెంబర్‌ 4: భారత్‌ x నేపాల్‌ (వేదిక: క్యాండి-శ్రీలంక)
సెప్టెంబర్‌ 5: శ్రీలంక x అఫ్గానిస్తాన్‌ (వేదిక: లహోర్‌-పాకిస్తాన్‌).

గ్రూప్‌ స్టేజ్‌లలో టాప్‌ స్థానాల్లో నిలిచే (గ్రూప్‌-ఏ టాప్‌-1, టాప్‌-2), (గ్రూప్‌-బి టాప్‌-1, టాప్‌-2) జట్లు సూపర్‌-4 మ్యాచ్‌లకు అర్హత సాధిస్తాయి. సూపర్‌-4 మ్యాచ్‌లు సెప్టెంబర్‌ 6 నుంచి 15 వరకు జరుగుతాయి. ఈ స్టేజ్‌లో మొత్తం 6 మ్యాచులు జరుగుతాయి. అందులో అగ్ర స్థానంలో నిలిచే మొదటి రెండు జట్లు సెప్టెంబర్‌ 17న కొలంబో వేదికగా జరిగే ఫైనల్స్‌లో తలపడుతాయి. ఆసియాకప్‌ మ్యాచ్‌లు స్టార్‌ నెట్‌వర్క్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అన్ని మ్యాచ్‌లు మధ్యాహ్నం 3:00 గంటల నుంచి ప్రారంభమవుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement