Monday, April 29, 2024

Big Story: ప్రభుత్వ ఆస్ప‌త్రులో మందుల కొరతకు చెక్‌.. జిల్లాల్లో మెడిసిన్‌ కోల్డ్‌ స్టోరేజీల ఏర్పాటు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద, సామాన్య రోగులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అనారోగ్యంతో ఆసుపత్రులకువచ్చే రోగులకు సకాలంలో వైద్య చికిత్సతోపాటు మందుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పకడ్బంధీ చర్యలు తీసుకుంటోంది. రోగుల మందుల కోసం ప్రయివేటు మెడికల్‌ షాపుల గడప తొక్కకుండా ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా పంపిణీ చేసే మందుల సంఖ్యను పెంచిన వైద్య, ఆరోగ్యశాఖ, ప్రభుత్వం… ఇప్పుడు తాజాగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో కొత్తగా మందుల నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేయబోతోంది.

పీహెచ్‌సీ మొదలు జిల్లా ఆసుపత్రి, హైదరాబాద్‌లోని పెద్దాసుపత్రి వరకు మందుల పంపిణీ మెడికల్‌ చెయిన్‌ను పకడ్బంధీగా నిర్వహించేందుకు కొత్తగా ఏర్పాటు చేయబోతున్న మెడికల్‌ నిల్వ కేంద్రాలు ఉపయోగపడనున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కొత్తగా భూపాలపల్లి, సిద్ధిపేట, జగిత్యాల, మంచిర్యాల, నాగర్‌కర్నూలు, సూర్యాపేట, వికారాబాద్‌, గద్వాల జిల్లాల్లో మెడికల్‌ కోల్డ్‌ స్టోరేజీలను ఏర్పాటు చేయనుంది. మందుల పంపిణీ సమయంలో అవి పాడుకాకుండా స్టోరేజీ నుంచి సకాలంలో రోగులకు అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేకమైన చైన్‌ సిస్టమ్‌ పద్దతిని అవలంభించాల్సి ఉంటుంది. మెడిసిన్స్‌ పాడుకాకుండా ఉండేందుకు వాటిని నిర్దిష్ట ఉష్ణోగ్రతల వద్దే కోల్డ్‌ స్టోరేజీలో నిల్వ ఉంచడమనేది అత్యంత కీలకం. ప్రస్తుతం రాష్ట్రంలోని హైదరాబాద్‌, వరంగల్‌ ఎంజీఎం, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌ తదితర ఉమ్మడి

జిల్లాల్లోనే మందుల నిల్వ గిడ్డంగులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి మారుమూల ప్రాంతాల్లోని పీహెచ్‌సీలకు చేరే సరికి వాటి నాణ్యత దెబ్బతింటున్న పరిస్థితులతోపాటు సకాలంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచడం కూడా కష్ట మవుతోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో కొత్తగా మెడికల్‌ స్టోరేజీ పాయింట్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేయబోతున్న స్టోరేజీల్లో అవసరమైన డీ ఫ్రీజర్లు, ప్రత్యేకంగా ఫార్మాసిస్టు, మందులను వేగంగా ఆసుపత్రులకు పంపిణీ చేసేలా కోల్డ్‌ స్టోరేజీ ఏర్పాట్లతో ఉన్న వాహనాలను ఇప్పటికే వైద్య, ఆరోగ్యశాఖ సిద్ధం చేసింది. దీంతో ఇకపై ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత తీరనుందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.

డిశ్చార్జి తర్వాత వినియోగించే ముందులూ పంపిణీ…

ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరిన రోగికి వ్యాధి నయమయి డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లాక వినియోగించాల్సిన మందులను కూడా అందుబాటులో ఉంచాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. వైద్యుడు రాసిన ప్రిస్కిప్షన్‌లోని మందులన్నింటినీ రోగికి డిశ్చార్జి సమయంలో ఇచ్చి పంపాలని మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. ఇందుకోసం ఈఎంఎల్‌ (ఎమర్జెన్సీ మెడికల్‌ లిస్టు), ఎఎంఎల్‌ జాబితాలోని మందులన్నింటినీ ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించారు. గతంలో ఈఎంఎల్‌, ఎఎంఎల్‌ జాబితా రెండు కలిపి 720 రకాల మందులు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం ఆ సంఖ్యను 843కు పెంచారు. కొత్తగా 123 రకాల మందులను వైద్య, ఆరోగ్యశాఖ కొనుగోలు చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లను ప్రత్యేకంగా కేటాయించింది. దీంతో ఇకమీదట ఆసుపత్రిలో ఉన్న సమయంలోనూ, డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లాక కూడా మందుల కోసం ప్రయివేటు మెడికల్‌ స్టోర్స్‌ కు వెళ్లాల్సిన అవసరం రోగులకు ఉండదని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

- Advertisement -

1500 మెడిసిన్స్‌ హ్యాండ్‌ బుక్స్‌ సిద్ధం…

ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మందులను కూడా లేవన్న భావనతో ప్రభుత్వ వైద్యులు ప్రయివేటు మెడికల్స్‌కు రాసే పరిస్థితులకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా మందుల వివరాలతో కూడిన హ్యాండ్‌ బుక్స్‌ ను ముద్రించాలని నిర్ణయించింది. ఇప్పటికే 1500 హ్యాండ్‌ బుక్స్‌ సిద్ధం అయినట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో ఈ మెడిసన్‌ హ్యాండ్‌ బుక్స్‌ ను మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా గాంధీ ఆసుపత్రి వైద్యులకు పంపిణీ చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement